లేదు లేదంటూనే బాదుడు!

లేదు లేదంటూనే బాదుడు! - Sakshi


విద్యుత్‌ వినియోగదారులకు డిస్కంల ‘కమర్షియల్‌’షాక్‌

చార్జీల పెంపు లేదంటూనే కనెక్షన్ల కేటగిరీల్లో భారీ మార్పులు



సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో విద్యుత్‌ చార్జీల పెంపు లేదు లేదంటూనే విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)లు వినియోగదారులకు ‘కమర్షియల్‌’షాక్‌ ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి. 2016–17లో అమలైన విద్యుత్‌ చార్జీలనే ఈ ఏడాదీ(2017–18) కొనసాగించాలని తాజాగా రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి(టీఎస్‌ఈఆర్సీ)కి ప్రతిపాదించిన డిస్కంలు.. తెరచాటుగా మాత్రం టారిఫ్‌లోని కమర్షియల్, ఇండస్ట్రియల్, టెంపరరీ విద్యుత్‌ కనెక్షన్ల కేటగిరీల్లో మార్పులకు అనుమతి కోరడం ద్వారా దొంగదెబ్బకు రెడీ అయ్యాయి.



ఇప్పటికే భారీ విద్యుత్‌ చార్జీల మోతను భరిస్తున్న కమర్షియల్‌ కేటగిరీలోకి కొత్తగా 12 రకాల కనెక్షన్లను డిస్కంలు ప్రతిపాదించాయి. దీంతో ఈ వినియోగదారుల విద్యుత్‌ బిల్లులు రెట్టింపు కానున్నాయి. అయితే, డొమెస్టిక్‌ కనెక్షన్ల కేటగిరీలో ఎలాంటి మార్పులు లేకుండా పాత విధానాన్ని ప్రతిపాదించడం గృహ వినియోగదారులకు ఊరట కలిగించనుంది. ఈఆర్సీ ఆమోదించిన తర్వాత ఈ ప్రతిపాదనలు అమల్లోకి రానున్నాయి. టారిఫ్‌ కేటగిరీల్లో డిస్కంలు సూచించిన మార్పులను తాజాగా ఈఆర్సీ బహిర్గతం చేసింది.



ఇక అంతా కమర్షియలే..!

ప్రస్తుతం అమల్లో ఉన్న టారీఫ్‌ ప్రకారం.. కమర్షియల్‌ కేటగిరీలో విద్యుత్‌ వినియోగం ఆధారంగా యూనిట్‌కు రూ.6 నుంచి రూ10 వరకు భారీగా చార్జీలు విధిస్తున్నారు. యూనిట్‌కు రూ.5.65 నుంచి రూ.6.65 వరకు చార్జీల పరిధిలోకి వచ్చే హెచ్‌టీ–1(ఏ) ఇండస్ట్రియల్‌ కేటగిరీలోని అన్ని రకాల సర్వీసింగ్‌ స్టేషన్లు మరియు రిపేరింగ్‌ సెంటర్లు, బస్‌ డిపోలు, లాండ్రీలు, డ్రై క్లీనింగ్‌ యూనిట్లు, గ్యాస్‌/ఆయిల్‌ స్టోరేజీ/ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్లు, గోదాములు/స్టోరేజీ యూనిట్లను కమర్షియల్‌ పరిధిలో చేర్చాలని డిస్కంలు ప్రతిపాదించాయి. అలాగే యూనిట్‌కి రూ.6.70 చార్జీలు వర్తించే ఎల్టీ పరిశ్రమల కేటగిరీ పరిధిలోని ఐటీ పరిశ్రమల యూనిట్ల ఆధ్వర్యంలో నిర్వహించే కెఫెటేరియాలు, హోటళ్లు, ఏటీఎంలు, బ్యాంకులు, ఆడిటోరియంలు, ఇతర సదుపాయాలను కమర్షియల్‌ కేటగిరీలోకి బదలాయించాలని కోరాయి. దీంతో ఈ కనెక్షన్లు యూనిట్‌కి రూ.6 నుంచి రూ.10 వరకు వర్తించే కమర్షియల్‌ కేటగిరీలోకి మారడం ద్వారా ఒక్కసారిగా వీటి విద్యుత్‌ బిల్లులు రెట్టింపు కానున్నాయి. ఐటీ పరిశ్రమల పరిధిలోని ఐటీ యేతర అవసరాలకు వినియోగించే విద్యుత్‌ కోసం ప్రత్యేక మీటర్లు ఏర్పాటు చేసుకోకుంటే మొత్తం ఐటీ పరిశ్రమల విద్యుత్‌ వినియోగానికి హెచ్‌టీ–2(ఇతర) కేటగిరీ కింద విద్యుత్‌ బిల్లులను జారీ చేస్తామని డిస్కంలు తెలిపాయి. హెచ్‌టీ–2(ఇతర) కేటగిరీలో కనెక్షన్ల సామర్థ్యం ఆధారంగా యూనిట్‌కు రూ.6.80 నుంచి రూ.7.80 వరకు చార్జీలు చెల్లించాల్సి రానుంది.



హెచ్‌టీ–2(ఇతర) కేటగిరీలో కొత్తగా..

గృహేతర, వాణిజ్య సముదాయాల్లోని పలు రకాల కనెక్షన్లను కొత్తగా హెచ్‌టీ–2(ఇతర) కేటగిరీలోకి చేర్చాలని డిస్కంలు కోరాయి. ఈ కేటగిరీ కింద కనెక్షన్ల సామర్థ్యం ఆధారంగా యూనిట్‌కు రూ.6.80 నుంచి రూ.7.80 వరకు చార్జీలు అమల్లో ఉన్నాయి. షాపులు, వ్యాపార సముదాయాలు, కార్యాలయాలు, పబ్లిక్‌ భవనాలు, ఆస్పత్రులు, హోటళ్లు, రెస్టారెంట్లు, క్లబ్బులు, థియేటర్లు, సినిమా హాళ్లు, టింబర్‌ డిపోలు, ఫొటో స్టూడియోలు, ప్రింటింగ్‌ ప్రెస్‌లు, అన్ని సర్వీసింగ్, రిపేరింగ్‌ సెంటర్లు, బస్‌ డిపోలు, లాండ్రీలు, డ్రై క్లీనింగ్‌ యూనిట్లు, గ్యాస్‌/ఆయిల్‌ స్టోరేజీ/ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్లు, గోదాములకు దీపాలు, ఫ్యాన్లు, హీటింగ్, ఎయిర్‌ కండిషనింగ్, ఇతర విద్యుత్‌ ఉపకరణాలకు విద్యుత్‌ సరఫరాను కొత్తగా హెచ్‌టీ–(2) కేటగిరీలోకి చేర్చాలని డిస్కంలు ప్రతిపాదించాయి. అలాగే వ్యక్తులు, ఎన్జీవోలు, ప్రైవేటు ట్రస్టుల ఆధ్వర్యంలో నడిచే విద్యా సంస్థలు, వాటి హాస్టళ్లను ఈ కేటగిరీలోనే చేర్చాలని కోరాయి.



ఏడాది వరకు తాత్కాలిక కనెక్షన్లు..

తాత్కాలిక కనెక్షన్ల కాలపరిమితిని ఆర్నెల్ల నుంచి ఏడాదికి పొడిగించాలని డిస్కంలు కోరాయి. అన్ని రకాల నిర్మాణ పనులు, నిర్మాణంలోని భవనాలు, ఎగ్జిబిషన్లు, సర్కస్‌లు, ఔట్‌డోర్‌ సినిమా షూటింగ్‌లు, టూరింగ్‌ టాకీస్‌లకు తాత్కాలిక కనెక్షన్ల కింద మాత్రమే విద్యుత్‌ సరఫరాను ప్రతిపాదించాయి. తాత్కాలిక కేటగిరీలో ప్రస్తుతం యూనిట్‌కు రూ.11 చొప్పున చార్జీలు విధిస్తున్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top