ప్రిన్స్‌తో కాసేపు..

ప్రిన్స్‌తో కాసేపు.. - Sakshi


సిటీకి ఎందరో కమిషనర్లు వస్తుంటారు పోతుంటారు.. ఈ రోజు మాత్రం ఓ లోకల్ చంటిగాడు సిటీ క మిషనర్‌గా రాబోతున్నాడు. ఈ కుర్రాడి పేరు సాదిక్. వయసు పదేళ్లు.  పోలీస్ కమిషనర్‌గా పదేళ్ల కుర్రాడేంటని అనుకుంటున్నారా..!  కమిషనర్ ఆఫ్ పోలీస్ కావాలన్నది

దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న ఈ చిన్నారి కోరిక.


అందుకే మేక్ ఎ విష్ అనే స్వచ్ఛంద సంస్థ సాదిక్ కోరికను తీరుస్తోంది. ఈ రోజు ఉదయాన్నే సాదిక్ ఇంటికి బుగ్గకారు వస్తుంది. ఈ బుల్లి  కమిషనర్‌కు రెడ్‌కార్పెట్ పరిచి మరీ ఆఫీస్‌కు తీసుకెళ్తుంది. అక్కడున్న ఖాకీలంతా గౌరవ వందనంతో ఈ బుల్లి కమిషనర్‌కు స్వాగతం పలుకుతారు. సీపీ సీట్లో కూర్చుని  మరీ మనోడు ఏక్ దిన్ కా సీపీగా పనులు చక్కబెడతాడు.

 

 

 ప్రిన్స్‌తో కాసేపు..



అభిషేక్. వయస్సు పద్నాలుగేళ్లు. జూబ్లీహిల్స్‌లోని ఇందిరానగర్‌లో ఉంటున్న ఈ కుర్రాడు సెరిబ్రల్ పాల్సీతో బాధపడుతున్నాడు. ఈ బాలుడికి సినీ హీరో మహేశ్‌బాబును కలవాలన్న కోరిక మేక్ ఎ విష్ చొరవతో తీరిపోయింది. ఆగడు సినిమా షూటింగ్ సమయంలోనే గంటపాటు ఈ కుర్రాడికి ప్రిన్స్ సమయం కేటాయించారు.  

 

ఒక్క సాదిక్ విషయంలోనే కాదు ప్రాణాంతక వ్యాధులతో పోరాడుతున్న ఎందరి కోరికలనో తీరుస్తోంది ‘మేక్ ఎ విష్’ స్వచ్ఛంద సంస్థ. ‘అమితాబ్‌తో ఆడుకోవాలి.. సచిన్‌తో మాట్లాడాలి.. ప్రిన్స్ మహేశ్‌బాబును చూడాలి.. బార్బీ బొమ్మ కావాలి.. ఇలా చిన్నారుల మనసులోని చిన్న, పెద్ద ఆశలను చిటికె’లో తీర్చేసి వారి ముఖాల్లో సంతోషం నింపుతోంది.



ఇలా తెలుసుకుంటారు...



నగరంలోని  గ్లోబల్, కేర్, గాంధీ, అపోలో, ఎంఎన్‌జే ప్రాంతీయ క్యాన్సర్ పరిశోధన కేంద్రం, ఇండో-అమెరికన్ హాస్పిటల్...ఇలా ప్రముఖ ఆస్పత్రులకు ‘మేక్ ఎ విష్’ వాలంటీర్లు వెళ్తారు. ప్రాణాంతక వ్యాధులతో చికిత్స పొందుతున్న పిల్లల వివరాలు తెలుసుకుంటారు. డాక్టర్ అనుమతితో ఆ పిల్లలను, వారి తల్లిదండ్రులను సంప్రదిస్తారు. చిన్నారుల కోరిక లు తెలుసుకుని వాటిని నెరవేర్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తారు.



కొడుకు కోరిక తీర్చలేక..



ఈ సంస్థకు ఆద్యులు ఉదయ్, గీతాజోషీ దంపతులు. వారి ముద్దుల కుమారుడు గాంధార్ లుకేమియాతో పోరాడుతూ 1996లో మరణించాడు. అమెరికాలోని  ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గాంధార్‌కు డిస్నీల్యాండ్ చూడాలన్న కోరిక. ఆ విషయం తెలుసుకొని కోరికను నిజం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. కానీ చివరి కోరిక తీరకుండానే ఆ బాలుడు కన్నుమూశాడు. ఆ బాధలోనే ఇండియాకు వచ్చేశారు. కన్నకొడుకు పోయాడన్న దుఃఖం.. తన చివరి కోరిక తీర్చలేకపోయామన్న ఆవేదన నుంచే ‘మేక్ ఎ విష్’ ఆలోచన పుట్టింది. గాంధార్ వంటి చిన్నారులకు ఆనందాన్ని అందించాలన్న లక్ష్యంతో 1996లో ముంబైలో ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేశారు.

 

 ముఖ్యమంత్రి ముఖాముఖి వరంగల్‌కు చెందిన శరత్‌కు హార్ట్ ప్రాబ్లమ్.




 ఈ కుర్రాడికి జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో సర్జరీ జరిగింది. బెడ్ మీదున్న ఈ పిల్లాడు తనకు సీఎం కేసీఆర్‌ను కలవాలనుందని కోరాడు. విషయం తెలుసుకున్న ‘మేక్ ఎ విష్’.. శరత్ సీఎంను కలవడానికి చకచకా ఏర్పాట్లు చేసేసింది. అయితే ఈ పరిస్థితుల్లో పిల్లాడ్ని కదల్చడం సరికాదన్నారు డాక్టర్లు. ఇదే విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన కేసీఆర్ తానే స్వయంగా ఆస్పత్రికి చేరుకుని శరత్ కళ్లలో ఆనందం నింపారు.

 

పవర్ స్టార్ కోసం..



ఖమ్మంలోని కార్తీక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో 13 ఏళ్ల శ్రీజ ‘బ్రెయిన్ ట్యూమర్’తో బాధపడుతోంది. ఈ చిన్నారికి పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ అంటే ఎంతో అభిమానం. పవన్‌ను కలిపించే ప్రయత్నం చేస్తోంది మేక్ ఎ విష్. శ్రీజను హైదరాబాద్ తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే వైద్యులు వద్దనడంతో ఆ ప్రయత్నం విరమించింది. దీంతో పవన్‌కల్యాణే శ్రీజ దగ్గరికి రావాలని రిక్వెస్ట్ చేసింది. ఈ విషయంలో పవర్ స్టార్ పాజిటివ్‌గా స్పందిస్తారని అనుకుంటున్నామని  పుష్ప దేవీ జైన్ తెలిపారు.

 

 

సెలిబ్రిటీలు ముందుకు రావాలి




 ప్రాణాంతక వ్యాధులతో పోరాడుతున్న మూడు నుంచి 18 ఏళ్లలోపు వారి కోరికలను తీర్చేందుకు శ్రమిస్తున్నాం. వారికిష్టమైన వస్తువులను ఇస్తున్నాం.సెలిబ్రిటీలను కలిపిస్తున్నాం. తీర్థయాత్రలతో పాటు పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్తున్నాం. విమానంలో చక్కర్లు కొట్టిస్తున్నాం. ఆ సమయంలో వారి ముఖాల్లో కనిపించే ఆనందం మాటల్లో వర్ణించలేం. ఈ చిన్నారుల సంతోషం కోసం

 సెలిబ్రిటీలు ముందుకు రావాలి. అప్పుడు ఆ చిన్నారుల కోరిక తీర్చినవారు అవుతారు.

 

 ఆనంద పరవశం..



బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న పదమూడేళ్ల స్వర్ణాంజలి.. సింగర్ శ్రావణభార్గవిని కలవాలనుందని ‘మేక్ ఎ విష్’తో షేర్ చేసుకుంది. అంతే ఆ చిన్నారి చికిత్స పొందుతున్న ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రికి వచ్చి మరీ శ్రావణభార్గవి స్వర్ణాంజలికి తన మధుర  గానాన్ని వినిపించింది.   - డాక్టర్ పుష్ప దేవీ జైన్, ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top