జూలై 22 నుంచి మహంకాళి బోనాలు


చాంద్రాయణగుట్ట : జూలై 22వ తేదీ నుంచి లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారి 108వ వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయని ఆలయ కమిటీ అధ్యక్షుడు సి.రాజ్‌కుమార్ యాదవ్ తెలిపారు. ఆలయ ఆవరణలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బోనాల జాతర ఉత్సవాల వివరాలను వెల్లడించారు. జూలై 22వ తేదీన ఉదయం 8 గంటలకు జరిగే దేవి అభిషేకంతో ప్రారంభమయ్యే బోనాల జాతర ఉత్సవాలు ఆగష్టు 1 వ తేదీన ఊరేగింపుతో ముగుస్తాయన్నారు.



22వ తేదీన ఉదయం 10 గంటలకు ధ్వజారోహణ, శిఖర పూజ, సాయంత్రం 6.15 గంటలకు కలశ స్థాపన ఉంటుందన్నారు. 23వ తేదీన సాయంత్రం 4 గంటలకు లక్ష ఫలార్చన, 24వ తేదీన సాయంత్రం 6 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు, ఆలయ వేదిక నుంచి ఉమ్మడి దేవాలయాల ఘటాలకు స్వాగతం, రాత్రి 9 గంటలకు ఘట స్థాపన ఉంటుందన్నారు. 25వ తేదీన సాయంత్రం 4 గంటలకు లక్ష బిల్వార్చన, 26వ తేదీన సాయంత్రం 7 గంటలకు దీపోత్సవము, 27వ తేదీన సాయంత్రం 5 గంటలకు శాకాంబరి పూజ, 28వ తేదీన సాయంత్రం 5 గంటలకు లక్ష పుష్పార్చన, 29వ తేదీన లక్ష కుంకుమార్చన, 30వ తేదీన సాయంత్రం 5 గంటలకు నవ ఛండీ హవనము, రాత్రి 9 గంటలకు తొట్టెల ఉంటుందన్నారు. 31వ తేదీన తెల్లవారుఝామున 4 గంటలకు బలిహరణ, ఉదయం 6 గంటలకు దేవి మహాభిషేకం అనంతరం అమ్మవారికి బోనాల సమర్పణ ప్రారంభమవుతుందన్నారు.


రాత్రి 8 గంటలకు శాంతి కల్యాణము, ఆగష్టు 1వ తేదీన ఉదయం 10 గంటలకు అష్టాదళపాద పద్మారాధన, మధ్యాహ్నం 12 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు, 2 గంటలకు పోతురాజు స్వాగతం, సాయంత్రం 4 గంటలకు భవిష్యవాణిని వినిపించే రంగం కార్యక్రమం ఉంటుందన్నారు. సాయంత్రం 5 గంటలకు శ్రీ భవానీ రథయాత్ర అమ్మవారి ఊరేగింపు ఉంటుందన్నారు. కాగా ఈ బోనాల ఉత్సవాలకు గవర్నర్ నరసింహాన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు ఆయా రంగాలకు చెందిన ప్రముఖులు హాజరు కానున్నారన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సలహాదారులు జి.మహేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి పి.వై.కైలాష్ వీర్, కోశాధికారులు జి.అరవింద్ కుమార్ గౌడ్, యు.సదానంద్ గౌడ్, తిరుపతి నర్సింగ్ రావు, ప్రచార కార్యదర్శి మహేష్, సభ్యులు ఎ.మాణిక్ ప్రభు గౌడ్, బల్వంత్ యాదవ్, బంగ్లా రాజు యాదవ్, విష్ణు గౌడ్, కె.వెంకటేష్, కప్పా కృష్ణా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.



జూలై 9,10 తేదీలలో ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో బోనాలు



లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి ఆలయ కమిటీ తరఫున ఈ ఏడాది కూడా ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో బోనాలను ఘనంగా నిర్వహించనున్నామని ఈ సందర్భంగా అధ్యక్షుడు సి.రాజ్ కుమార్ యాదవ్ వెల్లడించారు. ఆలయ కమిటీ సభ్యులతోపాటు దాదాపు 150 మంది భక్తులతో కలిసి ఈ బోనాలను జరుపనున్నామన్నారు. కాగా ఈ బోనాల ఉత్సవాలకు సాంస్కృతిక శాఖ కార్యదర్శి సహకరించి 50 మంది కళాకారులను కూడా కేటాయిస్తున్నారన్నారు.



రెండు రోజుల పాటు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టి పడేలా ఈ బోనాలు నిర్వహిస్తామన్నారు. ఢిల్లీలో జరిగే బోనాల ఉత్సవాలలో నిజామాబాద్ ఎంపీ కవిత బోనం ఎత్తుకోనున్నారన్నారు. కేంద్ర మంత్రులు సుష్మా స్వరాజ్, స్మృతి ఇరానీ, బండారు దత్తాత్రేయలు కూడా హాజరు కానున్నారన్నారు. ఢిల్లీలో అంగరంగ వైభవంగా బోనాలు నిర్వహించి అమ్మవారి ఆలయం వద్ద జరిగే బోనాల ఉత్సవాలకు హాజరు కావాల్సిందిగా రాష్ట్రపతి, ప్రధానమంత్రిని కూడా ఆహ్వానించనున్నామన్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top