జీవితాన్ని ప్రేమించండి గెస్ట్ కాలమ్

జీవితాన్ని ప్రేమించండి  గెస్ట్ కాలమ్


గెస్ట్ కాలమ్

 

‘వన్ లైఫ్ అలియన్’ వ్యవస్థాపకురాలు కియాచెర్

తీవ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం

పోలీసుల కోసం ‘మెడిటేషన్ వాట్సప్ గ్రూప్’


 

 సిటీబ్యూరో: ‘2008, 26/11..ముంబై ముష్కరుల దాడుల్లో కుటుంబాన్ని కోల్పోయినప్పుడు ఎంతో వేదనచెందా. మెడిటేషన్, విద్యే ఆ ఘోరకలి నుంచి నన్ను బయటపడేసింది. ఆ సంఘటన నాజీవితాన్ని మార్చేసింది. ‘వన్ లైఫ్ అలియన్స్’ స్థాపనకు మార్గం అయింది. తీవ్రవాదానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తూనే జీవితాన్ని ప్రేమించాలంటూ వివిధ సదస్సుల్లో సందేశమిస్తున్నా. తీవ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న పోలీసుల మనోస్థైర్యం దెబ్బతినకుండా, భావోద్వేగాలు అదుపు తప్పకుండా మెడిటేషన్ చేయాలని కోరుతున్నా. ఇందుకోసం ప్రత్యేక వాట్సప్ గ్రూప్ ఏర్పాటుచేశాను..’ అని తెలిపారు..అమెరికాకు చెందిన కియా చెర్. ముంబై పేలుళ్లలో భర్త, కుమార్తెను కోల్పోయిన ఆమె నేషనల్ పోలీసు అకాడమీలో జరుగుతున్న ‘చట్టాల అమలులో మహిళ పాత్ర’ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు. ఆ విషయాలు ఆమె మాటల్లోనే...



చిన్న చిన్న నేరాల నుంచి ఉగ్రవాదం వరకు అన్ని సమస్యలు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నాయి. వీటన్నింటిని అణగదొక్కేందుకు అన్ని దేశాల పోలీసులు కృషి చేస్తున్నారు. ఇందులో మహిళా పోలీసులు కూడా ఓ చెయ్యి వేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో వీరు కుటుంబ సమస్యలు కానివ్వండి...కేసుల విషయంలోనూ  కానివ్వండి ఆవేశకావేశాలకు లోనవుతుంటారు. అందుకే దేశ భద్రత కోసం అహర్నిశలు పనిచేస్తున్న పోలీసుల భావోద్వేగాలను అదుపులో ఉంచుకునేందుకు మెడిటేషన్ దోహదపడుతుందని భావించా. ఎందుకంటే 2008 ముంబై పేలుళ్లలో ముష్కరుల చేతిలో నా భర్త అలన్, కుమార్తె నవోమిని ప్రాణాలు కోల్పోయినప్పుడు బాధ నుంచి  నాకు మెడిటేషనే విముక్తి కల్పించింది. ఆ ఘోరకలి విషాదాల నుంచి బయటపడేసింది. ప్రేమ, కరుణతో జీవితం సాగించాలనే సందేశాన్ని ‘వన్ లైఫ్ అలియన్స్’ ఎన్జీవో ద్వారా ప్రజల్లోకి తీసుకెళుతున్నా. తీవ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్నా.



అందుకే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న పోలీసు అధికారులకు చేయూతనివ్వాలనుకున్నా. కొన్ని సందర్భాల్లో మానసిక ఒత్తిడికి గురయ్యే పోలీసులకు ప్రత్యేకంగా వాట్సప్ గ్రూప్‌ను ఏర్పాటుచేసి ప్రతిరోజూ మెడిటేషన్ చేయాలనే సందేశాన్ని చేరవేస్తున్నా. సామాన్యుల నుంచి కూడా వేల సంఖ్యలో ఫోన్ కాల్స్, ఈ మెయిల్స్ వస్తున్నాయి. సాధ్యమైనంత మేర అందరికీ మానసిక ఒత్తిడి నుంచి బయట పడేందుకు అవసరమైన క్లాస్‌లు తీసుకుంటున్నా. సొంత జీవితంతో పాటు మానవుల అందరి జీవితాలను గౌరవించాలి.

 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top