రేపటి నుంచి లారీల నిరవధిక సమ్మె


రోజూ ఐదు వేల లారీలకు బ్రేక్‌!



సాక్షి, హైదరాబాద్‌: భారీగా పెంచిన బీమా ప్రీమియాన్ని తగ్గించాలని, తెలుగు రాష్ట్రాలకు వర్తించే సింగిల్‌ పర్మిట్‌ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ లారీ యాజమాన్య సంఘాలు గురువారం నుంచి నిరవధిక సమ్మెకు దిగనున్నాయి. రవాణా మంత్రి మహేందర్‌రెడ్డితో జరిపిన చర్చలు సైతం అసంపూర్తిగా ముగియడంతో సమ్మె దిశగా లారీ సంఘాలు కార్యాచరణకు సన్నద్ధమవుతు న్నాయి.



తమ సమస్యలు పరిష్కారమయ్యే వరకు లారీ లను రోడ్డెక్కించబోమని తెలంగాణ లారీ ఓనర్స్‌ అసోసి యేషన్‌ అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి తెలిపారు. దక్షిణాది రాష్ట్రాల లారీ యజమానుల సంఘంతో కలసి ఈ సమ్మెలో పాల్గొనబోతున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో ఈ నెల 30 నుంచి గ్రేటర్‌ హైదరాబాద్‌కు రోజు రాకపోకలు సాగించే సుమారు 5వేల లారీలు స్తంభించనున్నాయి. అంతర్రాష్ట్ర లారీ యజమానులు చేపట్టనున్న ఈ సమ్మెకు స్థానిక లారీల యజమానులు కూడా మద్దతునిచ్చే అవకాశం ఉంది.



లారీ సంఘాల ప్రధాన డిమాండ్లివి..

► ప్రైవేట్‌ బీమా సంస్థల ఒత్తిడి మేరకు థర్డ్‌ పార్టీ బీమాను ఏప్రిల్‌ ఒకటి నుంచి 50 శాతం పెంచే ప్రతిపాదనను వెంటనే విరమించుకోవాలి.

► దేశ వ్యాప్తంగా డీజిల్, పెట్రోల్, గ్యాస్‌ ధరలు ఏకీకృతంగా ఉండేలా చూడాలి.

► 15 ఏళ్లు నిండిన లారీల పర్మిట్ల రద్దుపై పునరాలోచించాలి.

► తెలుగు రాష్ట్రాల్లో అమలయ్యేలా సింగిల్‌ పర్మిట్‌కు అవకాశం కల్పించాలి.

► ఉమ్మడి రాష్ట్రానికి చెల్లుబాటయ్యేలా చెల్లించిన క్వార్టర్లీ ట్యాక్స్‌ను తగ్గించి తెలంగాణ పరిధికి అనుగుణంగా కొత్త పన్ను విధానాన్ని అమలు చేయాలి.

► లారీల్లో ఓవర్‌లోడ్‌కు లారీ యజమానులను కాకుండా వినియోగదారులు బాధ్యత వహించేలా చట్టాల్లో మార్పులు చేయాలి.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top