ఏమీ తేల్చలేదు!

ఏమీ తేల్చలేదు! - Sakshi


ప్రాథమిక చర్చలకే పరిమితమైన కృష్ణా బోర్డు సమావేశం  

 

 సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల వినియోగం విషయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య నెలకొన్న వివాదాల పరిష్కారం కోసం శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఏమీ తేల్చలేదు. ఎజెండాలో పేర్కొన్న అంశాలపై కేవలం ప్రాథమిక చర్చలకే పరిమితమైంది. వివాదాలను పరిష్కరించే దిశగా ఏ నిర్ణయం చేయలేదు. నీటి నిర్వహణపై ముసాయిదా కానీ, వాటర్ ప్రోటోకాల్‌ని కానీ సిద్ధం చేయలేదు. మొత్తంమ్మీద ఈ నెలాఖరుకు పదవీ విరమణ చేయనున్న బోర్డు చైర్మన్ నాథన్‌కు వీడ్కోలు సమావేశంలా భేటీ సాగింది.



బోర్డుకు కొత్త చైర్మన్ వచ్చాకే ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణ, బోర్డు పరిధి వంటి అంశాలపై పూర్తిస్థాయిలో చర్చించి ముసాయిదా సిద్ధం చేసుకోవాలని సమావేశంలో ఇరు రాష్ట్రాలు నిర్ణయించాయి. కృష్ణా జలాల లభ్యత, వినియోగం, నీటి ప్రోటోకాల్, ప్రాజెక్టుల నిర్వహణ వంటి 11 అంశాలపై చర్చించేందుకు బోర్డు ఇక్కడి కేంద్ర జల సంఘం ప్రాంతీయ కార్యాలయంలో ఈ సమావేశం నిర్వహించింది. బోర్డు చైర్మన్ నాథన్, సభ్య కార్యదర్శి ఆర్‌కే గుప్తా, తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్‌రావు, ఏపీ జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఈఎన్‌సీ వెంకటేశ్వర్‌రావు తదితరులు హాజరయ్యారు. సమావేశంలో అంశాల వారీగా ఎవరి వాదనలు వారు వినిపించారు.



 ఆ ప్రాజెక్టులు కొత్తవి.. కాదు పాతవి!

 కృష్ణా జలాల వినియోగంతో తెలంగాణ చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల ప్రాజెక్టుల అంశాన్ని ఏపీ సమావేశంలో ప్రధానంగా ప్రస్తావించింది. ఎలాంటి అనుమతుల్లేకుండా తెలంగాణ వీటిని చేపడుతోందని, దీనిపై వివరణ కోరినా ఇంతవరకు స్పందన లేదని బోర్డు దృష్టికి తెచ్చింది. అయితే అవన్నీ పాత ప్రాజెక్టులేనని తెలంగాణ మరోమారు స్పష్టం చేసింది.  పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుపై సమగ్ర అధ్యయన నివేదిక తయారు చేయాలంటూ 2013లోనే జీవో 72 ఇచ్చారని, అలాగే 30 టీఎంసీలతో డిండి ఎత్తిపోతల ప్రాజెక్టు చేపట్టేందుకు 2007 జూలై7న జీవో 159 ఇచ్చారని గుర్తు చేసింది. దీనిపై ఇదివరకే వివరణ ఇచ్చామని తెలిపింది.



ఈ సందర్భంగా బోర్డు జోక్యం చేసుకుంటూ.. దీనిపై సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నందున పక్కన పెట్టాలని, కోర్టే తేలుస్తుందని పేర్కొంది. ప్రాజెక్టులను బోర్డు నియంత్రణలోకి తెచ్చే అంశంపై సమావేశంలో ప్రస్తావన వచ్చినా చర్చ మాత్రం జరగలేదు. ముందుగా ఈ అంశాన్ని ప్రస్తావించిన ఏపీ.. కృష్ణా బేసిన్ పరిధిలోని అన్ని ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తేవాలని కోరింది. అందుకు బోర్డు స్పందిస్తూ.. బేసిన్‌లోని అన్ని ప్రాజెక్టులను తమ పరిధిలోకి తెస్తూ నోటిఫై చేయాలని కేంద్ర జలసంఘానికి లేఖ రాసినట్లు సభ్య కార్యదర్శి ఆర్‌కే గుప్తా తెలిపారు. దీనిపై కేంద్రం త్వరలో నిర్ణయం ప్రకటిస్తుందని, అంతకుముందే ఏమైనా అభ్యంతరాలుంటే తమ దృష్టికి తేవాలని సూచించారు.



 ముసాయిదా మార్చాల్సిందే..

 వాటర్ ఇయర్‌కు సంబంధించి గతేడాది ముసాయిదాను ఈ ఏడాది కొనసాగించేం దుకు తెలంగాణ, ఏపీ అంగీకరించలేదు. ఈ ముసాయిదాలో మార్పు చేర్పులు చేయాలని అభిప్రాయపడ్డాయి. దీనికి అంగీ కరిం చిన బోర్డు.. తదుపరి సమావేశంలో చర్చించి నిర్ణయానికి వద్దామని తెలిపింది. అలాగే బోర్డు ఖర్చు, అధికారుల కేటాయింపు, కార్యాలయం ఏర్పాటుపై చర్చ జరిగింది.

 

 4న పార్లమెంటరీ కమిటీ రాక

 కృష్ణా, గోదావరి బేసిన్‌ల పరిధిలోని ప్రాజెక్టుల స్థితిగతులు, నీటి లభ్యత, వినియోగం, ప్రాజెక్టుల నిర్వహణ వంటి అంశాలపై చర్చించేందుకు వచ్చేనెల 4న పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ(పీఎస్‌సీ) రాష్ట్రంలో పర్యటించనుంది. ఈ మేరకు బోర్డు ఇరు రాష్ట్రాల అధికారులకు సమాచారం ఇచ్చింది. ఈ కమిటీ రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టుల్లో గడిచిన ఐదేళ్ల కాలంలో నీటి సామర్థ్యాలు ఎలా పడిపోయాయి, అందుకు కారణాలు, ప్రస్తుత ఏడాది పరిస్థితులు వంటి అంశాలపై చర్చిస్తుందని తెలిపింది. అన్ని అంశాలతో నివేదికలు తయారు చేసి సిద్ధంగా ఉండాలని సూచించింది. గోదావరి, కృష్ణా నదుల అనుసంధానంపై అభ్యంతరాలు, నదుల కాలుష్య నివారణకు తీసుకుంటున్న చర్యలు తదితరాలపైనా కమిటీ చర్చిస్తుందని వివరించింది.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top