వీడిన 14 ఏళ్లనాటి హత్య కేసు మిస్టరీ


  • ఇద్దరు రౌడీషీటర్ల అరెస్టు

  • తుపాకీ స్వాధీనం

  • చాంద్రాయణగుట్ట: తప్పించుకు తిరుగుతున్న ఇద్దరు రౌడీషీటర్లను అరెస్టు చేసి విచారించగా.. 14 ఏళ్ల నాటి హత్య కేసు మిస్టరీ వీడింది. గురువారం నగర టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ బి.లింబారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... మహ్మద్ హబీబ్‌ఖాన్ (బహదూర్‌పురా),అస్గర్‌షా (కిషన్‌బాగ్ ) స్నేహితులు. ఇద్దరిపై బహదూర్‌పురా స్టేషన్‌లో రౌడీషీట్ ఉంది. మరో ముగ్గురితో కలిసి వీరు 2000 సంవత్సరంలో ముర్గీ చౌక్‌లో ఓ వ్యక్తి వద్ద హవాలా రూపంలో వచ్చిన రూ. 10 లక్షలు దోపిడీ చేశారు. ఈ కేసును హుస్సేనీఆలం పోలీసులు సీసీఎస్‌కు బదిలీ చేయగా ఇటీవలే దీనిని మూసేశారు. కాగా, ఈ ముఠాలో హబీబ్‌కు సన్నిహితుడైన కిషన్‌బాగ్‌కే చెందిన ఆసీఫ్(22) ఉన్నాడు.



    తనకు ఎక్కువ డబ్బులు ఇవ్వాలని..లేదంటే దోపిడీ విషయం పోలీసులకు చెప్పేస్తానని హబీబ్, అస్గర్ షాలను ఆసీఫ్ బెదిరించాడు. దీంతో ఇద్దరు డబ్బు విషయం మాట్లాడుకుందామని అక్టోబర్ 3, 2000లో ఆసీఫ్‌ను మెదక్ జిల్లా సదాశివపేటకు పిలిచి మరో ఐదుగురితో కలిసి హత్య చేశారు. మృతదేహాన్ని గిరంపూర్ గ్రామ శివారులో పెట్రోల్ పోసి ఆనవాళ్లు కనిపించకుండా కాల్చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన కొండాపూర్ పోలీసులు, ఆ తర్వాత కేసును సీసీఎస్‌కు బదిలీ చేశారు. మృతుడి ఆనవాళ్లు తెలియక పోవడంతో సీసీఎస్ అధికారులు కేసు మూసేశారు. హత్య చేసిన అనంతరం హబీబ్‌ఖాన్ కర్ణాటక వెళ్లిపోయాడు.



    కాగా హత్యలు, హత్యాయత్నాలు, దోపిడీలలో ప్రమేయం ఉండటంతో శత్రువుల నుంచి ముప్పు ఉందని గ్రహించిన హబీబ్‌ఖాన్ చాంద్రాయణగుట్టకు చెందిన వాహబ్ అనే వ్యక్తి వద్ద నాటు తుపాకీతో పాటు నాలుగు రౌండ్ల బుల్లెట్లను రూ. 20 వేలకు కొనుగోలు చేశాడు. మూడు రోజుల క్రితం నగరానికి వచ్చిన హబీబ్‌ఖాన్ అస్గర్ షాతో కలిసి దోపిడీలకు పథకం వేశారు. సమాచారం అందుకున్న దక్షిణ మండలం టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్  కేవీ సూర్యప్రకాష్ రావు నేతృత్వంలోని బృందం  గురువారం బహదూర్‌పురాలో హబీబ్‌ఖాన్, అస్గర్ షాలను అదుపులోకి తీసుకున్నారు. సోదా చేయగా తుపాకీతో పాటు నాలుగు రౌండ్ల బుల్లెట్లు లభ్యమయ్యాయి. వారిని విచారించగా ఆసీఫ్ హత్య విషయం బయటపెట్టారు.  నిందితులను తదుపరి విచారణ నిమిత్తం బహదూర్‌పురా పోలీసులకు అప్పగించారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top