భూ వినియోగ మార్పిడి చార్జీల బాదుడు

భూ వినియోగ మార్పిడి చార్జీల బాదుడు


సాక్షి, హైదరాబాద్: భూ వినియోగ మార్పిడి చార్జీలు భారీగా పెరిగాయి. నగరాలు, పట్టణాలు, పట్టణాభివృద్ధి సంస్థల మాస్టర్ ప్లాన్‌లో నివాస, వాణిజ్య, పారిశ్రామిక, వ్యవసాయ/కన్జర్వేషన్/గ్రీన్ బెల్ట్, రిక్రియేషనల్ జోన్లలోని భూములను సంబంధిత కేటగిరీ కాకుండా ఇతరత్ర అవసరాలకు వినియోగించుకోవడానికి అనుమతించేందుకు ప్రభుత్వం వసూలు చేస్తున్న అభివృద్ధి చార్జీలు 25 శాతం నుంచి 100 శాతం వరకు పెరిగాయి. బుధవారం ఈ మేరకు రాష్ట్ర పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంజీ గోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు.



హైదరాబాద్ మెట్రో డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ), కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కుడా), యాదగిరిగుట్ట, వేములవాడ, బాసర టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీలతో సహా రాష్ట్రంలోని ఇతర అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల మాస్టర్ ప్లాన్లలోని భూ వినియోగ మార్పిడికి ఇకపై వసూలు చేసే కొత్త చార్జీలను ఉత్తర్వుల్లో పొందుపరిచారు. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ మినహాయిస్తే.. హెచ్‌ఎండీఏ పరిధిలోని మునిసిపాలిటీలతో పోల్చితే గ్రామ పంచాయతీల్లో చార్జీలు తక్కువగా ఉన్నాయి.



తాజాగా మున్సిపాలిటీలతో సమానంగా గ్రామ పంచాయతీల్లోని భూముల భూ వినియోగ చార్జీలను పెంచారు. హైదరాబాద్‌తో సహా రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో మౌలిక వసతుల అభివృద్ధి ప్రాజెక్టుల కోసం భారీగా నిధులను సమకూర్చుకోడానికి ప్రభుత్వం ఈ చార్జీలను పెంచిం ది. ఈ చార్జీల ద్వారా హెచ్‌ఎండీఏ ఏటా రూ.వందల కోట్లు ఆర్జిస్తోంది.

 

యాదగిరిగుట్ట భూములపై కూడా..

యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్‌మెంట్ ఆథారిటీ పరిధిలో భూ వినియోగ మార్పిడి చార్జీలను దాదాపు హెచ్‌ఎండీఏ పరిధిలోని చార్జీలకు సమానంగా పెంచారు. యాదగిరిగుట్ట పరిధిలో చ.మీ. స్థలానికి రూ.120 నుంచి రూ.200 వరకు చార్జీలను వసూలు చేయనున్నారు. కమర్షియల్, రెసిడెన్షియల్ కేటగిరీలకు మార్చేందుకు చ.మీ.కు రూ.200 అభివృద్ధి చార్జీని విధించనున్నారు. గుట్ట పరిధిలో పరిశ్రమల కేటగిరీకి మార్పు కోసం మాత్రం చ.మీ.కు రూ.120 చార్జీని ఖరారు చేశారు.



వేములవాడ, బాసర ఆలయాభివృద్ధి సంస్థల పరిధిలోనూ మున్సిపల్ కార్పొరేషన్లు/మున్సిపాలిటీల్లో చ.మీ.కు రూ.90 నుంచి రూ.120 వరకు చార్జీలను వసూలు చేయనున్నారు. నివాస కేటగిరీ నుంచి వాణిజ్య, పారిశ్రామిక కేటగిరీలకు మార్చేందుకు రూ.120 చార్జీలు విధించనున్నారు. గ్రామ పంచాయతీల్లో చ.మీ.కు రూ.40 నుంచి రూ.60 వరకు వసూలు చేయనున్నారు.

 

ఇతర నగరాలు, పట్టణాల్లో..

హెచ్‌ఎండీఏ, కుడాలతో సహా రాష్ట్రంలోని ఇతర నగరాలు, పట్టణాల్లో కూడా భూ వినియోగ మార్పిడి చార్జీలు పెరిగాయి. ఇతర మున్సిపల్ కార్పొరేషన్లు, స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీలు, గ్రేడ్-1, 2, 3 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో రూ.10 నుంచి రూ.135 వరకు భూ వినియోగ చార్జీలు విధించనున్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top