నీటి పంపకాలపై నేడు నిర్ణయం

నీటి పంపకాలపై నేడు నిర్ణయం

ఈ ఖరీఫ్‌కు కృష్ణా జలాల పంపకాన్ని తేల్చనున్న త్రిసభ్య కమిటీ

ఏపీ, తెలంగాణ అవసరాలపై చర్చించి తుది నిర్ణయం

మూడు నెలల కోసం 41 టీఎంసీలు అవసరమన్న తెలంగాణ

కేవలం సెప్టెంబర్ వరకే 47 టీఎంసీలు కావాలన్న ఏపీ

 

 

హైదరాబాద్: ప్రస్తుత ఖరీఫ్ కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కృష్ణా జలాల పంపకంపై శనివారం నిర్ణయం వెలువడనుంది. ఇరు రాష్ట్రాల తాగు, సాగు నీటి అవసరాలపై కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ చర్చించి నీటి విడుదల, షెడ్యూల్‌లను ఖరారు చేయనుంది. ఈ మేరకు శుక్రవారం జరిగిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశంలో నీటి విడుదల అంశాన్ని త్రిసభ్య కమిటీకి కట్టబెడుతూ నిర్ణయం తీసుకున్నారు. త్రిసభ్య కమిటీ నిర్ణయం మేరకు శ్రీశైలంలో కనీస నీటి మట్టాలకు ఎగువన ఉన్న నీటిని... కృష్ణా బోర్డు ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేయడంతోపాటు విడుదలకు అనుమతిస్తూ ఉత్తర్వులిస్తుంది. తెలంగాణ, ఏపీల తాగు, సాగునీటి అవసరాలు, కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల్లో నీటి లభ్యత, ఇప్పటివరకు జరిగిన వినియోగం తదితర అంశాలపై చర్చించేందుకు శుక్రవారం కృష్ణా బోర్డు ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని జలసౌధ కార్యాలయంలో సమావేశం జరిగింది. బోర్డు చైర్మన్ రామ్‌శరణ్, సభ్య కార్యదర్శి సమీర్ చటర్జీ, ఇరు రాష్ట్రాల నీటి పారుదల శాఖ కార్యదర్శులు ఎస్‌కే జోషి, శశిభూషణ్ కుమార్, ఈఎన్‌సీలు మురళీధర్, వెంకటేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు. సుమారు మూడు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ఖరీఫ్ నీటి విడుదల, అవసరాలపైనే ప్రధానంగా చర్చించారు.

 

నీటి అవసరాల కోసం విజ్ఞప్తులు

భేటీ సందర్భంగా ఇరు రాష్ట్రాలు తమ అవసరాలను బోర్డు ముందు పెట్టాయి. సాగర్ ఎడమ కాలువ కింద ఖరీఫ్‌కు 31 టీఎంసీలు, వచ్చే మూడు నెలల పాటు హైదరాబాద్ తాగునీటికి 6 టీఎంసీలు, నల్లగొండ తాగునీటికి 4.1 టీఎంసీలు అవసరమని తెలంగాణ పేర్కొంది. మరోవైపు ఏపీ మాత్రం కేవలం సెప్టెంబర్ వరకే 47 టీఎంసీలు కావాలని కోరింది. సాగర్ కుడి కాల్వకు 10 టీఎంసీలు, ఎడమ కాల్వకు 4, కృష్ణా డెల్టాకు 12, గాలేరు నగరికి 6, హంద్రీనీవాకు 5, తెలుగు గంగకు 5, చెన్నై తాగునీటి సరఫరాకు 5 టీఎంసీలు కావాలని విజ్ఞప్తి చేసింది. ఈ నీటి అవసరాలపై త్రిసభ్య కమిటీ శనివారం సమావేశమై నిర్ణయం తీసుకుంటుందని బోర్డు స్పష్టం చేసింది.



ఈ సందర్భంగా హైదరాబాద్ అంశాన్ని ప్రస్తావించిన తెలంగాణ... ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్‌కు కేటాయిస్తున్న నీటిలో ఏపీ కూడా వాటా భరించాలని కోరింది. అయితే నీటి వినియోగంపై వాటర్‌సెస్, ఇతర ట్యాక్సులు వసూలు చేస్తున్నందున ఏపీ నుంచి వాటా నీరు ఇవ్వాల్సిన అవసరం లేదని ఆ రాష్ట్రం వాదించింది. ఇక 2014-15 ఏడాదిలో ఏపీ తన వాటాకు మించి 30 టీఎంసీలు అదనంగా వాడుకుందని, వాటిని సర్దుబాటు చేయాలని తెలంగాణ కోరగా... నీరు సమృద్ధిగా ఉన్న సమయంలో సర్దుబాటు చేస్తామని ఏపీ పేర్కొంది. ఇక శ్రీశైలం విద్యుత్‌ను చెరి సగం చొప్పున పంచాలని తెలంగాణ కోరగా.. ఏపీ అంగీకరించలేదు. ఈ అంశాన్ని కేంద్ర విద్యుత్ శాఖ తేల్చుతుందని స్పష్టం చేసింది.

 

చిన్న వనరుల నీటి వినియోగంపై కమిటీ

 చిన్న నీటి వనరుల్లో నీటి వినియోగంపై లెక్కలు సమర్పించాలని పదేపదే కోరుతున్నా ఇరు రాష్ట్రాలు స్పందించడం లేదని సమావేశంలో బోర్డు ప్రస్తావించింది. దీనిపై ఇరు రాష్ట్రాలు భిన్న వాదనలు చేయడంతో.. ఇరు రాష్ట్రాల అంతర్రాష్ట్ర వ్యవహారాల చీఫ్ ఇంజనీర్లు, బోర్డు సీఈలతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. చిన్న వనరుల నీటి వినియోగాన్ని పరిశీలించి.. సెప్టెంబర్ 15లోగా నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించింది.



అపెక్స్ కౌన్సిల్‌కు పాలమూరు, డిండి


బోర్డు సమావేశంలో పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల అంశాన్ని ఏపీ ప్రస్తావించింది. ఆ ప్రాజెక్టులు కొత్తవి కావని ఇప్పటికే చెప్పామని.. అంతేగాకుండా ఈ వ్యవహారాన్ని అపెక్స్ కౌన్సిల్‌కు కట్టబెడుతూ కేంద్రం నిర్ణయించినందున అక్కడే దీనిపై చర్చిద్దామని తెలంగాణ సూచించింది. అందుకు ఏపీ అంగీకరించింది. ఇక పట్టిసీమ అంశాన్ని లేవనెత్తిన తెలంగాణ... బచావత్ అవార్డు మేరకు పోలవరం కాకుండా మరే ప్రాజెక్టు ద్వారానైనా గోదావరి నీటిని కృష్ణాకు తరలిస్తే, అంతే పరిమాణంలో నీటిపై రాష్ట్రాలకు వాటా ఉంటుందని స్పష్టం చేసింది. ఈ లెక్కన 45 టీఎంసీలతో పట్టిసీమ చేపడితే అదే స్థాయిలో నీరు తెలంగాణకు దక్కాలని కోరింది. కానీ దీనిపై బ్రిజేష్ ట్రిబ్యునల్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఏపీ వాదించింది. ఈ అంశంపై మరోమారు చర్చిద్దామని బోర్డు సూచించడంతో.. చర్చ ముగిసింది. ఇక ప్రాజెక్టుల పరిధిలో బోర్డు సూచించిన చోట టెలీమెట్రీ విధానం అమల్లోకి తెచ్చేందుకు అంగీకారం కుదిరింది.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top