కోడెల సభ్యత్వం రద్దు చేయాలి

కోడెల సభ్యత్వం రద్దు చేయాలి - Sakshi


ఎన్నికల కమిషన్‌కు ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ ఫిర్యాదు

- ఎన్నికల నియమావళి ప్రకారం రూ.28 లక్షలే ఖర్చు చేయాలి

- రూ.11.5 కోట్లు ఖర్చుచేశానని స్పీకర్ స్వయంగా నేరం ఒప్పుకున్నారు

- కోడెలను తక్షణమే ఎమ్మెల్యే పదవి నుంచి తొలగించండి: అంబటి

- అడ్డదారిలో గెలిచిన వ్యక్తి స్పీకర్ పదవికీ అనర్హుడే: ఎమ్మెల్యే రోజా

 

 సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభా స్పీకర్ కోడెల శివప్రసాదరావు శాసన సభ్యత్వాన్ని తక్షణమే రద్దు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఎన్నికల కమిషన్‌ను కోరారు. మంగళవారం ఆయన ఎమ్మెల్యే రోజా, పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ, వైఎస్సార్‌సీపీ నేత కరణం ధర్మశ్రీలతో కలసి సచివాలయంలో ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌ను కలిశారు. ప్రస్తుత ఏపీ స్పీకర్‌గా ఉన్న కోడెల శివప్రసాదరావు తాను ఎన్నికల్లో రూ.11.5 కోట్లు ఖర్చు చేశానని ఓ ప్రముఖ తెలుగు ఛానెల్‌లో ఇంటర్వ్యూ ఇచ్చారని, ఇది ఎన్నికల నియమావళికి విరుద్ధమని, అందుకే ఆయనపై తక్షణమే చర్యలు తీసుకుని, ఆయన శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరారు.



ఈమేరకు వినతిపత్రంతో పాటు కోడెల మాట్లాడిన టేపులను సీడీల రూపంలో భన్వర్‌లాల్‌కు అందజేశారు. అనంతరం సచివాలయంలో మీడియాతో అంబటి రాంబాబు మాట్లాడుతూ... ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా రూ.11.5 కోట్లు ఖర్చు చేసినందునే సత్తెనపల్లి నియోజకవర్గంలో తనపై 924 ఓట్లతో కోడెల గెలుపొందినట్టు భావిస్తున్నానని చెప్పారు. నేను మర్డర్ చేశాను బాబూ అన్నట్టు తాను రూ.11.5 కోట్లు ఖర్చుచేసినట్లు అంగీకరించినా చర్యలు తీసుకోకపోవడం సమంజసం కాదన్నారు. నిబంధనల మేరకు ఆయన రూ.28 లక్షలు మాత్రమే ఖర్చు చేసి ఉంటే ఇన్ని ఓట్లు వచ్చేవి కావని, ఆయన గెలిచేవారు కారని అభిప్రాయపడ్డారు. ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించి కోడెలపై చర్యలు తీసుకుంటారని భావిస్తున్నామని ఆయన చెప్పారు.



 స్పీకర్ పోస్టుకు అనర్హులు...

 ఎందరో మహామహులు కూర్చున్న స్పీకర్ స్థానంలో అడ్డదారిలో గెలిచి ఆ సీటులోకి వచ్చిన కోడెల శివప్రసాదరావు అనర్హుడని, ఆయన్ను తక్షణమే స్పీకర్ పదవి నుంచి, ఎమ్మెల్యే పదవి నుంచి తొలగించాలని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా డిమాండ్ చేశారు. నేరుగా తానే తప్పును ఒప్పుకున్న స్పీకర్‌పై చర్యలు తీసుకోకపోతే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందన్నారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలను అడ్డగోలుగా సంతలో పశువుల్లాగా కొంటున్నా, వారిపై చర్యలు తీసుకునే ధైర్యం స్పీకర్‌కు లేదని విమర్శించారు.

 

 బ్రీఫ్‌డ్ మీ వాయిస్ నాది కాదు అని అనలేదు...

 ఓటుకు కోట్లు వ్యవహారంలో ‘బ్రీఫ్‌డ్ మీ’ అన్న వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు ఇప్పటి కీ అవి తన వ్యాఖ్యలు కాదని ఖండించడం లేదని, అయినా దాని నుంచి ఆయన తప్పించుకునేందుకు అడ్డదార్లు తొక్కారని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. ఇప్పుడు స్పీకర్ కూడా రూ.11.5 కోట్లు ఖర్చు చేశానని నేరం అం గీకరించినా తప్పించుకోవాలని చూస్తున్నారని చెప్పారు. ఇలా ఉన్నత స్థానంలో ఉన్నవాళ్లు ఏం చేసినా తప్పించుకోవచ్చునని అనుకుంటే రాజ్యాంగంలో నిబంధనలకు విలువలేదని, ప్రజలకు తప్పుడు సంకేతా లు వెళతాయని ఆమె అభిప్రాయపడ్డారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top