వెంటపడి వేధించారు

వెంటపడి వేధించారు - Sakshi


ప్రభుత్వం, పోలీసుల తీరు అప్రజాస్వామికం: కోదండరాం

పోలీసులు అర్ధరాత్రి మా ఇంటి తలుపులు పగలగొట్టారు

ఉదయమే వస్తామన్నా వినిపించుకోకుండా దౌర్జన్యం చేశారు




సాక్షి, హైదరాబాద్‌/సాక్షి, న్యూఢిల్లీ: నిరుద్యోగ నిరసన ర్యాలీని శాంతియుతంగా, ప్రశాంతంగా నిర్వహిస్తామని చెప్పినా కూడా వెంటపడి వేధించారని టీజేఏసీ చైర్మన్‌ ఎం.కోదండరాం పేర్కొన్నారు. ప్రభుత్వం, పోలీసుల తీరు దారుణమని.. ఇది అప్రజాస్వామికమని మండిపడ్డారు. నిరుద్యోగ సమస్య పరిష్కారమయ్యేంత వరకూ పోరాడుతామని స్పష్టం చేశారు. మంగళవారం అర్ధరాత్రి కోదండరాంను అరెస్టు చేసిన పోలీసులు బుధవారం సాయంత్రం విడిచిపెట్టారు. అనంతరం హైదరాబాద్‌లోని తార్నాకలో ఉన్న తన నివాసం వద్దకు చేరుకున్న కోదండరాం.. అక్కడ విలేకరులతో మాట్లాడారు. ‘‘తెలంగాణ ఉద్యమం సందర్భంగా అరెస్టు చేయని వారిని కూడా ఇప్పుడు అరెస్టు చేశారు. నాతో పాటు జేఏసీ నేతలను అరెస్టు చేసిన తీరు దారుణం. పోలీసులు మా ఇంటిమీద పడి, తలుపులను విరగ్గొట్టారు. లోపలికి ప్రవేశించాక దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఉదయం తామే వస్తామని చెప్పినా వినకుండా ఈస్ట్‌జోన్‌ డీసీపీ అప్రజాస్వామికంగా వ్యవహరించారు’’అని వెల్లడించారు.



కావాలనే తాత్సారం చేశారు

నిరుద్యోగ ర్యాలీ, సభలకు అనుమతి కోసం 20 రోజుల ముందుగానే దరఖాస్తు చేసుకున్నామని.. కానీ పోలీసులు కావాలనే తాత్సారం చేసి నాగోల్‌ సభ పెట్టుకోవాలని చెప్పారని కోదండరాం తెలిపారు. కొంత ముందుగా అవకాశమిచ్చినా నిజాం కాలేజీ మైదానంలో సభ పెట్టుకునే వాళ్లమన్నారు. నిరసన తెలిపే కనీస హక్కును ప్రభుత్వం కాలరాసిందని మండిపడ్డారు. నిరుద్యోగం తీవ్రమైన సమస్య అని, ప్రజాస్వామ్యానికి లోబడి శాంతియుతంగానే నిరుద్యోగుల పక్షాన పోరాడుతామని కోదండరాం పేర్కొన్నారు. తాము ఎలాంటి కుట్రలూ చేయడం లేదని.. జేఏసీలో అసాంఘిక శక్తులు ఎక్కడున్నాయో చెప్పాలని ప్రభుత్వాన్ని నిలదీశారు.



నిరుద్యోగ సమస్య పరిష్కారమయ్యేంత వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని అవసరమైతే రాజకీయ పార్టీలను సైతం కలుపుకొని ముందుకు వెళతామని చెప్పారు. టీజేఏసీ చేపట్టిన నిరుద్యోగ నిరసన ర్యాలీ విజయవంతమైందని, దానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు చెబుతున్నామని పేర్కొన్నారు. గురువారంనాటి బంద్‌కు టీజేఏసీ, ప్రజా సంఘాల తరఫున మద్దతు ప్రకటిస్తున్నామని కోదండరాం తెలిపారు. దానిని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మరోవైపు కోదండరాం అక్రమ అరెస్టుకు నిరసనగా ఏఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో బుధవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌ వద్ద ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దిష్టిబొమ్మ దహనంచేశారు.



నేడు జేఏసీ భేటీ

గురువారం ఉదయం కోదండరాం నివాసంలో టీజేఏసీ స్టీరింగ్‌ కమిటీ సమావేశం జరుగనుంది. నిరుద్యోగ నిరసన ర్యాలీ సందర్భంగా ప్రభుత్వం వ్యవహరించిన తీరు, జిల్లాల్లోని పరిస్థితులు, భవిష్యత్తు కార్యాచరణ వంటి వాటిపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top