తక్కువ డబ్బే దొరికిందని విచక్షణ కోల్పోయి..

తక్కువ డబ్బే దొరికిందని విచక్షణ కోల్పోయి..


సాక్షి, సిటీబ్యూరో/అంబర్‌పేట: వివిధ ప్రాంతాల నుంచి వచ్చి నగరంలో స్థిరపడ్డారు... దురలవాట్లకు బానిసలు కావడంతో వచ్చే సంపాదన చాలలేదు... దీంతో ముఠా ఏర్పాటు చేసి ఎంజీబీఎస్‌ కేంద్రంగా తెగబడ్డారు... వారం రోజుల్లో నాలుగు నేరాలు చేసిన ఈ గ్యాంగ్‌ ఓ వ్యక్తి వద్ద తక్కువ మొత్తం లభించడంతో అతడిని చంపేసింది. ఈ ఘరానా ముఠాకు చెందిన నలుగుర్ని ఈస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. టాస్క్‌ఫోర్స్‌ అదనపు డీసీపీ ఎన్‌.కోటిరెడ్డితో కలిసి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తూర్పు మండల డీసీపీ డాక్టర్‌ వి.రవీందర్‌ పూర్తి వివరాలు వెల్లడించారు.




బానిసలై ముఠా కట్టిన వైనం...

మధ్యప్రదేశ్, బీహార్, కర్ణాటకల్లోని వివిధ ప్రాంతాలకు చెందిన ఇక్బాల్‌ ఖాన్‌ పఠాన్, మహ్మద్‌ రెహాన్‌ అన్సారీ, షేక్‌ జావేద్‌ బతుకు తెరువు కోసం నగరానికి వలసవచ్చారు. కూలీ పనులు చేస్తూ పొట్టపోసుకునే వీరికి టోలిచౌకి ప్రాంతానికి చెందిన ఇలియాస్‌ అలీ ఖాన్‌తో పరిచయమైంది. దురలవాట్లకు బానిసైన వీరంతా తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం చిన్న చిన్న నేరాలు చేసే వారు. వ్యసనాలు పెరిగిపోవడంతో పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించడం కోసం దోపిడీలు, భారీ దొంగతనాలు చేయాలని పథకం వేశారు. ఇందులో భాగంగా ఈ నెల 15న సైఫాబాద్‌ ఠాణా పరిధిలో పంజా విసిరారు. ఓ వ్యక్తి నుంచి ల్యాప్‌టాప్స్, హార్డ్‌డిస్క్‌లు ఉన్న బ్యాగ్‌ను తస్కరించారు.




ఎంజీబీఎస్‌–బ్రిడ్జ్‌ దారిలో అడ్డా...

ఈ గ్యాంగ్‌ అఫ్జల్‌గంజ్‌లోని మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌–శివాజీ బ్రిడ్జ్‌ మధ్య ఉన్న ‘మూసీ పరీవాహక ప్రాంతాన్ని’ తమ అడ్డాగా ఎంచుకుంది. ఆ మార్గంలో వెళ్లే వారిని మూసీ ఒడ్డుకు లాక్కెళ్లి దోపిడీ చేయడానికి సిద్ధమైంది. ఈ నెల 19 రాత్రి ఆ మార్గంలో వెళ్తున్న షేక్‌ అబ్దుల్‌ ఖరీద్‌ను వెంబడించిన ఈ నలుగురూ అదును చూసుకుని అతడిని మూసీ ఒడ్డుకు లాక్కుపోయారు. అక్కడ ఖరీద్‌ జేబులు తనిఖీ చేసిన ఈ దుండగులకు పర్సులో కేవలం రూ.230 లభించాయి. దీంతో విచక్షణ కోల్పోయిన నలుగురూ అతడిని హత్య చేశారు. ఇది జరిగిన రెండు రోజులకు ద్విచక్రవాహనంపై ఒంటరిగా వెళ్తున్న వ్యక్తిని లిఫ్ట్‌ ఇవ్వమంటూ ఎక్కిన ముఠా సభ్యుడు శివాజీ బ్రిడ్జ్‌ సమీపంలోని సబ్‌-స్టేషన్‌ వద్దకు తీసుకువచ్చాడు. అక్కడ వాహనం ఆపించగా... మిగిలిన ముగ్గురూ దాడి చేసి  బలవంతంగా మూసీ ఒడ్డుకు తీసుకువెళ్ళారు. బాధితుడి నుంచి రెండు సెల్‌ఫోన్లు, నగదు దోచుకుని పారిపోయారు.




వారంలోనే నాలుగో నేరం...

ఈ నెల 20న ఎంజీబీఎస్‌ వద్దే ఈ గ్యాంగ్‌ మరోసారి పంజా విసిరింది. రాత్రి 9 గంటల ప్రాంతంలో సబ్‌-స్టేషన్‌  వద్దకు మూత్ర విసర్జనకు వచ్చిన వ్యక్తిని పట్టుకున్న దుండగులు మూసీ ఒడ్డుకు లాక్కువెళ్ళి దాడి చేశారు. అతని వద్ద ఉన్న రూ.2వేల నగదు, రెండు బంగారు బ్రాస్‌లెట్లు, బంగారు ఉంగరం, సెల్‌ఫోన్‌ లాక్కెళ్లారు. గాయపడిన అతను అతి కష్టం మీద అఫ్జల్‌గంజ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దీంతో ఈస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ సీహెచ్‌ శ్రీధర్‌ నేతృత్వంలోని బృందం రంగంలోకి దిగింది. మంగళవారం ఎంజీబీఎస్‌ వద్ద నిఘా వేసి నలుగురినీ అరెస్టు చేసి అఫ్జల్‌గంజ్‌ పోలీసులకు అప్పగించింది. వీరి నుంచి ఐదు సెల్‌ఫోన్‌లు, ఐదు తులాల బంగారు అభరణాలు, ల్యాప్‌టాప్‌ స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై పీడీయాక్టు ప్రయోగించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఈ ముఠాను పట్టుకోవడంలో కీలకపాత్ర పోషించిన టాస్క్‌ఫోర్స్‌ ఎస్సైలు సుధాకర్, సైదాబాబుల్ని డీసీపీ అభినందించి రివార్డులు అందించారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top