‘ఖేడ్’లో బ్యాలెట్ పేపర్ వాడాలి


ఈసీకి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి లేఖ

అవసరమైతే పోలింగ్ తేదీని మార్చాలని వినతి


 

 సాక్షి, హైదరాబాద్/ న్యూఢిల్లీ : నారాయణఖేడ్ ఉప ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్‌ను ఉపయోగించాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సోమవారం లేఖ రాశారు. వరంగల్ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు వచ్చిన మెజారిటీ, కాంగ్రెస్‌కు తగ్గిన ఓట్లు, స్థానికంగా ఉన్న పరిస్థితులపై చాలా అనుమానాలు వచ్చాయని ఆ లేఖలో పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కూడా పలు పోలింగ్ బూత్‌లలో అక్రమాలు జరిగినట్టుగా అనుమానాలు, కొన్ని ఆధారాలు ఉన్నాయన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా ఒక పోలింగ్ బూత్‌లో పోలైన ఓట్లకన్నా టీఆర్‌ఎస్‌కు ఎక్కువ మెజారిటీ వచ్చిందని, ఇలాంటి మరికొన్ని ఉదాహరణలు కూడా ఉన్నాయని తెలిపారు. నారాయణఖేడ్‌లో అవసరమైతే పోలింగ్ తేదీని మార్చి, బ్యాలెట్ పేపర్ ద్వారా ఉప ఎన్నికలు నిర్వహించాలని ఉత్తమ్ ఈసీని కోరారు.



 ఈవీఎంల ట్యాంపరింగ్: సబిత, మర్రి

 జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌పార్టీ ఈవీ ఎంల ట్యాంపరింగ్‌కు పాల్పడిందని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఈవీఎంలలో జరిగిన అక్రమాలపై న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. మాజీమంత్రి మర్రి శశిధర్‌రెడ్డి మాట్లాడుతూ ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగినట్టుగా చాలా అనుమానాలు ఉన్నాయని చెప్పారు. కొన్ని కేంద్రాల్లో పోలైన ఓట్లకన్నా ఎక్కువ ఓట్లు అధికారపార్టీకి వచ్చినట్టుగా ఈవీఎంలు చూపించాయన్నారు.



 ఈసీకి లేఖ అందజేసిన నేతలు

 తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌తో పాటు ఇతర అధికార ప్రతినిధులు సోమవారం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలసి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాసిన లేఖను అందజేశారు. గ్రేటర్ ఎన్నికల్లో పథకం ప్రకారం ఈవీఎంల టాంపరింగ్ జరిగిందని ఈ సందర్భంగా శ్రవణ్ విమర్శించారు. నోటా బటన్ గులాబీ రంగులో ఉండటంతో ఈ ఎన్నికల్లో నోటాను తొలగించారని, అందువల్ల తర్వాత జరగబోయే ఎన్నికల్లో ఇలాంటి తప్పిదాలు జరగకుండా చూడాలని కేంద్ర ఎన్నికల సంఘా న్ని కోరామని ఆయన మీడియాకు తెలిపారు. గ్రేటర్ ఎన్నికల్లో జరిగిన తప్పిదాలపై న్యాయ పోరాటం చేస్తామని శ్రవణ్ చెప్పారు.

 

 ‘ఖేడ్’ ఉప ఎన్నికల్లో ఓటు నిర్ధారణ స్లిప్ ఇవ్వాలి: ఎల్. రమణ

 సాక్షి, హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఈవీఎంల టాంపరింగ్ జరిగిందని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో నారాయణఖేడ్ ఉప ఎన్నికల్లో ఈవీఎంలలో ఓటేశాక ఓటు నిర్ధారణ స్లిప్ ఇవ్వాలని, లేదా బ్యాలట్ పేపర్లను ఏర్పాటు చేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ భారత ఎన్నికల ప్రధాన కమిషనర్‌ను కోరారు. ఈ మేరకు సోమవారం ఆయన ఓ లేఖ రాశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓటు నిర్దారణ స్లిప్ ఇవ్వకుండా పోలింగ్ నిర్వహించారని గుర్తు చేశారు. ఢిల్లీ, బిహార్ శాసనసభ ఎన్నికల్లో  ఇలాంటి స్లిప్‌లు ఇవ్వగా, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మాత్రం ‘నోటా’ను కూడా తొలగించారని ఎన్నికల కమిషనర్‌కు వివరించారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top