స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించాలి

స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించాలి - Sakshi


* పాలేరు ఉప ఎన్నికపై ఎన్నికల కమిషన్‌కి ఉత్తమ్ లేఖ

* ఈవీఎం ప్రింటర్లు ఏర్పాటు చేయండి

* అధికార టీఆర్‌ఎస్ అక్రమాలు అడ్డుకోవాలని వినతి


సాక్షి, హైదరాబాద్: ఖమ్మం జిల్లా పాలేరులో జరగనున్న ఉప ఎన్నికను ప్రజాస్వామ్యబద్ధంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించడానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘాని(ఈసీ)కి పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గురువారం లేఖ రాశారు. ఈ ఉప ఎన్నికలో అధికార టీఆర్‌ఎస్ పార్టీ అక్రమాలకు, అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆయన ఫిర్యాదు చేశారు. ఈ ఎన్నికలో పేపర్ బ్యాలెట్‌ను వినియోగించాలని, ఈవీఎంలను వినియోగించాలనుకుంటే ప్రింటర్లు ఏర్పాటుచేయాలని కోరారు.



స్థానిక అధికారులు పూర్తిగా అధికారపార్టీ కనుసన్నల్లో, వారి ఆదేశాల ప్రకారమే పనిచేస్తున్నారని ఉత్తమ్ ఆరోపించారు. ఖమ్మం జిల్లా కలెక్టరును, ఎస్పీని, రిటర్నింగ్ అధికారిని బదిలీ చేసినా స్థానికంగా ఉన్న అధికారులు అక్రమాలను ఆపలేదన్నారు. ఉప ఎన్నిక సమయంలోనే ఖమ్మంలో టీఆర్‌ఎస్  ప్లీనరీకి అనుమతి ఇవ్వొద్దని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరినా అనుమతించారని ఉత్తమ్ ఫిర్యాదు చేశారు. దీనివల్ల ఖమ్మం పట్టణం అంతా టీఆర్‌ఎస్ ఫ్లెక్సీలు, పోస్టర్లు, జెండాలతో నింపేశారని వివరించారు. ఖమ్మం కార్పొరేషన్‌లోని కొన్ని ప్రాంతాలు పాలేరు నియోజకవర్గంలో ఉన్నాయన్నారు.



సీఎం, మంత్రులు ప్రభుత్వ ఖర్చుతోనే ప్లీనరీలో పాల్గొన్నారని.. ప్లీనరీ ఖర్చును టీఆర్‌ఎస్ అభ్యర్థి ఖాతాలో వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సభలోనే టీఆర్‌ఎస్‌ను గెలిపించాలని కూడా కోరారని తెలిపారు. టీఆర్‌ఎస్ అనుకూల అధికారులను వెంటనే బదిలీచేయాలని కోరారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న టీఆర్‌ఎస్ ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని ఉత్తమ్ విజ్ఞప్తి చేశారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top