బుద్వేల్‌లో జర్నలిస్టులకు నివాస గృహాలు

బుద్వేల్‌లో జర్నలిస్టులకు నివాస గృహాలు - Sakshi


- వంద ఎకరాల్లో టవర్స్ నిర్మాణానికి నిర్ణయం

- గ్రామీణాభివృద్ధి శాఖ ఆధీనంలోని స్థలం ప్రభుత్వానికి బదలాయింపు

- పార్ట్‌టైం రిపోర్టర్లకూ డబుల్ బెడ్‌రూం ఇళ్లు

- జర్నలిస్టు సంఘాల నాయకులతో చర్చ


 

సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని జర్నలిస్టుల కోసం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం బుద్వేల్ పరిధిలో వంద ఎకరాల స్థలంలో నివాస గృహాల సముదాయాలు నిర్మించనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. నగరంలో పనిచేసే అన్ని స్థాయిల జర్నలిస్టులకు గృహాలు సమకూరేలా బహుళ అంతస్తుల టవర్స్ నిర్మించనున్నట్లు చెప్పారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో ఆయన ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, జర్నలిస్టు సంఘాల నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, దేవులపల్లి అమర్, శైలేష్‌రెడ్డి తదితరులతో సమావేశమై చర్చించారు.

 

 సీఎం సూచనల మేరకు నగరంలోని పలు ప్రభుత్వ స్థలాలను పరిశీలించిన జర్నలిస్టులు బుద్వేల్‌లోని భూములు ఇళ్ల నిర్మాణానికి, రవాణా సదుపాయాలకు అనువుగా ఉన్నాయని సీఎంకు వివరించారు. వారి అభీష్టం మేరకు బుద్వేల్‌లోనే ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు సీఎం ప్రకటించారు. బుద్వేల్‌లోని ఈ స్థలం గ్రామీణాభివృద్ధి శాఖ ఆధీనంలో ఉందని, దానిని ప్రభుత్వానికి బదలాయించాలని పంచాయితీరాజ్ కార్యదర్శి ఎస్‌పీ సింగ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ అనితా రామచంద్రన్‌ను ఆదేశించారు. పాత్రికేయుల ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని సమన్వయం చేయాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్ రావుకు సూచించారు.

 

 దశలవారీగా ఇస్తాం: సీఎం

 జర్నలిస్టుల్లో ఎక్కువమంది దిగువ, మధ్య తరగతికి చెందిన వారేనని, వారికి సొంత ఇళ్లు లేవని సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులందరికీ దశలవారీగా ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పారు. మీడియాలో పనిచేసే అన్ని విభాగాల జర్నలిస్టులకు నివాస గృహాలతో పాటు హౌజింగ్ టవర్లలో ఇతర పౌర సదుపాయాలు కల్పిస్తామన్నారు. రాష్ట్రంలోని జర్నలిస్టులంతా మెరుగైన జీవితం గడపాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. హైదరాబాద్, వరంగల్ నగరాల్లో మొదటి విడతలో, తరువాత ఇతర ప్రాంతాల జర్నలిస్టులకు ఇళ్లు నిర్మిస్తామని తెలిపారు. జిల్లా కేంద్రాల్లోని జర్నలిస్టులకు ఇళ్లు కట్టే విషయంలో మంత్రులు, కలెక్టర్లకు సూచనలు ఇస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పార్ట్‌టైం రిపోర్టర్లకూ డబుల్ బెడ్‌రూం ఇళ్ల పథకంలో ఇళ్లు కట్టిస్తామని సీఎం చెప్పారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top