బడ్జెట్ అంటే జమాఖర్చులు కాదు..

బడ్జెట్ అంటే జమాఖర్చులు కాదు..


ప్రభుత్వ విధానాలను ప్రతిబింబించాలి: ముఖ్యమంత్రి కేసీఆర్



* కేవలం ఒక ఏడాది ప్రక్రియగా చూడొద్దు

* రూపకల్పనలో కొత్త ఒరవడి ఉండాలి

* వనరుల సమీకరణ, సంస్కరణలపై దృష్టిపెట్టండి

* ప్రభుత్వ సలహాదారులు, ఉన్నతాధికారులకు సూచన


 

సాక్షి, హైదరాబాద్: బడ్జెట్ అంటే కేవలం జమాఖర్చుల వ్యవహారం కాదని, అది ప్రభుత్వ విధానాల ఆవిష్కరణగా ఉండాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. ప్రతి శాఖకు సంబంధించి బడ్జెట్ కేటాయింపులు జరపడానికి ముందే.. విధి విధానాలు రూపొందించి, క్షుణ్నంగా చర్చించాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసే విధంగా, సమాజంలోని అన్ని వర్గాలకు మేలు చేసేలా కార్యక్రమాలు ఉండాలని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి గురువారం సచివాలయంలో బడ్జెట్‌పై అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, ప్రభుత్వ సలహాదారులతో సీఎం సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ విధానాలు స్వల్ప, మధ్య, దీర్ఘకాలికంగా ఉండాలని.. అందుకు అనుగుణంగా బడ్జెట్‌ను రూపొందించాలని కేసీఆర్ ఆదేశించారు.

 

తెలంగాణకు ఉన్న వనరులు, ప్రజల అవసరాలు, ప్రాధాన్యతలు, అనుకూలతలు, ప్రతికూలతలు ఏమిటనే అంశాలపై పూర్తిస్థాయిలో అవగాహనతో విధానాలు రూపొందించాలని సూచించారు. ప్రతి రంగంలోనూ ప్రస్తుతమున్న విధానాలు, చట్టాలు ఎలా ఉన్నాయి, వాటిని యథాతథంగా వాడుకోవచ్చా, మార్పులు చేయాలా, పూర్తిగా కొత్త చట్టాలు తేవాలా, అసలు విధానమే మార్చాలా.. అన్న అంశాలపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఈ సదర్భంగా అధికారులను సీఎం కోరారు.

 

నిర్లక్ష్యానికి గురైనవాటిని గుర్తించండి..

తెలంగాణకు అనేక అంశాల్లో అనుకూలతలు ఉన్నా ఇంతకుముందటి పాలకులు వాటిని నిర్లక్ష్యం చేశారని సమావేశంలో కేసీఆర్ పేర్కొన్నారు. ఆ నిర్లక్ష్యాన్ని తొలగించి కొత్త ఒరవడి సృష్టించాలని.. ప్రతీశాఖలో నిర్లక్ష్యానికి గురైన వాటిని గుర్తించి సవరించాలని అధికారులకు సూచించారు. తెలంగాణ విత్తనోత్పత్తికి అత్యంత అనువుగా ఉన్నా.. పూర్తిగా నిర్లక్ష్యం జరిగిందని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రాన్ని క్రాప్ కాలనీలుగా విభజించాలని అధికారులను ఆదేశించారు. సింగరేణి సంస్థకు తనకున్న శక్తి మేరకు కార్యకలాపాలు నిర్వహించడానికి ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని చెప్పారు.

 

వేర్వేరుగా ప్రతిపాదనలు..

విధానాల రూపకల్పనలో గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు వేర్వేరుగా ప్రతిపాదనలు ఇవ్వాలని సీఎం అధికారులకు ఆదేశించారు. స్థానిక సంస్థలను బలోపేతం చేయాలని, వాటిని కూడా ప్రభుత్వంలో భాగంగా పరిగణించాలని సూచించారు. గ్రామ, మండల, జిల్లా, మున్సిపాలిటీ, కార్పొరేషన్లకు తగిన అధికారాలు, బాధ్యతలు అప్పగించడానికి అవసరమైన విధానాలు రూపొందించాలని చెప్పారు. బడ్జెట్ అనేది ఒక సంవత్సరం కోసం చేసే ప్రక్రియగా ఉండరాదని... ఐదేళ్ల కాలానికి కార్యాచరణ రూపొందించుకుని మొదటి ఏడాది నిధులు కేటాయిస్తున్నామనే విషయాన్ని గుర్తించాలని కోరారు.

 

అదే విధంగా అక్రమాలను నియంత్రించే విధానాలు, కార్యాచరణ ఉండాలని ఆకాంక్షించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు రమణాచారి, ఏకే గోయల్, పార్లమెంట్ సభ్యుడు కడియం శ్రీహరి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, డీజీపీ అనురాగ్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top