ఫలించిన కేసీఆర్ వ్యూహం.. కేటీఆర్ ఉధృత ప్రచారం

ఫలించిన కేసీఆర్ వ్యూహం.. కేటీఆర్ ఉధృత ప్రచారం - Sakshi


చార్ సౌ షహర్.. 400 సంవత్సరాల చరిత్ర కలిగిన హైదరాబాద్ నగరంపై టీఆర్ఎస్ తన పట్టు నిరూపించుకుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జీహెచ్ఎంసీకి తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. అత్యధిక స్థానాలు గెలుచుకుని తానేంటో చూపించింది. కోర్‌సిటీతో పాటు శివారు ప్రాంతాల్లో కూడా టీఆర్ఎస్ అభ్యర్థులు ఎక్కువ స్థానాలు గెలుచుకున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో విజయం కోసం సీఎం కేసీఆర్ ముందు నుంచి రచించిన వ్యూహంతో పాటు.. ఐటీ, పంచాయతీ రాజ్ శాఖల మంత్రి కేటీఆర్ ఉధృతంగా సాగించిన ప్రచారం కూడా టీఆర్ఎస్ విజయానికి కారణమైంది. ''గాడిదకు గడ్డి వేసి ఆవును పాలివ్వమంటే ఇస్తుందా.. అభివృద్ధి కావాలంటే టీఆర్ఎస్‌ను గెలిపించండి'' అన్న మాటలు కూడా ఓటర్ల మీద గట్టిగానే పనిచేసినట్లు కనిపిస్తోంది. సెటిలర్లు, ఆంధ్రప్రాంతానికి చెందిన ప్రజలు ఎక్కువగా ఉండే శివారు ప్రాంతాల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించడం ఇందుకు నిదర్శనం.



ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతాలతో పాటు, తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగిన వరంగల్, నల్లగొండ, కరీంనగర్ లాంటి జిల్లాల్లో తప్ప హైదరాబాద్ నగరంలోని ప్రాంతాల్లో టీఆర్ఎస్‌కు అంతగా పట్టు లేదనే అపప్రథ ఉండేది. అందుకే సనత్‌నగర్ ఉప ఎన్నిక విషయంలో కూడా వెనకడుగు వేస్తూ.. తలసాని శ్రీనివాస యాదవ్‌ను మంత్రిగా కొనసాగించడంపై విమర్శలు కూడా వచ్చాయి. వాటన్నింటికీ సమాధానంగా జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలను చూపించాలని ఐటీ, పంచాయతీ రాజ్ శాఖల మంత్రి కేటీఆర్‌కు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సూచించారు. అందుకు తగ్గట్లే కేటీఆర్ కూడా.. దాదాపు నగరంలోని అన్ని మూలలకూ సుడిగాలి పర్యటనలు చేసి, సెటిలర్ల ఓట్లను కూడా రాబట్టుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. ఇంతకుముందు జరిగిన హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎదురైన పరాభవాన్ని మరిచిపోయే రేంజిలో ఫలితాలు రాబట్టేందుకు కాలికి బలపం కట్టుకుని తిరిగారు. ఆ పర్యటనలు తగిన ఫలితాలను రాబట్టాయి. కేవలం కోర్‌సిటీలో మాత్రమే కాక.. శివారు ప్రాంతాల్లో సైతం తన పట్టు నిలబెట్టుకునేందుకు టీఆర్ఎస్ ఈ  ఎన్నికలను సమర్థంగా ఉపయోగించుకోగలిగింది. కోర్‌ సిటీ మాట ఎలా ఉన్నా, శివారు ప్రాంతాలు.. అంటే సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో సెటిలర్లు ఎక్కువగా ఉంటారని, వాళ్ల ఓట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ టీఆర్ఎస్‌కు రావు కాబట్టి వాటిని కొల్లగొట్టగలిగితే అధికార పార్టీ ఆధిక్యాన్ని గణనీయంగా తగ్గించొచ్చని కాంగ్రెస్‌తో పాటు టీడీపీ-బీజేపీ కూడా భావించాయి. కానీ అలా జరగలేదు. దాంతో ఆ పార్టీల ఆశలు గల్లంతయ్యాయి.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top