111 జీవో ఉండాల్సిందే

111 జీవో ఉండాల్సిందే - Sakshi


పభుత్వానికి ఇరిగేషన్ శాఖ నివేదిక



వరద నివారణ, తాగునీటి అవసరాల కోసమే జంట జలాశయాలు

అవసరంలేని గ్రామాలను కూడా జీవోలో పొందుపరిచారు

అనవసరంగా నాలుగు గ్రామాలను మినహాయించారు


 

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జీవో 111 అమలు తప్పనిసరని, దానిని రద్దు చేస్తే జంట జలాశయాల ఉనికికి ప్రమాదం ఏర్పడుతుందని  నీటిపారుదల శాఖ స్పష్టం చేసింది. జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ ఎఫ్‌టీఎల్ నుంచి 10 కిలోమీటర్ల దూరంలోని 84 గ్రామాల పరిధిలో పరిశ్రమలు, నిర్మాణాలపై ఆంక్షలు విధిస్తూ 1996లో అప్పటి ప్రభుత్వం జీవోనంబర్ 111ను జారీ చేసింది. ఎగువ ప్రాంతంలోనే కాకుండా జలాశయాలకు దిగువన 10 కి.మీ. పరిధిలోనూ ఈ ఆంక్షలు వర్తిస్తాయని స్పష్టం చేసింది.



పరీవాహక ప్రాంతాలైన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్, శంషాబాద్, రాజేంద్రనగర్, శంకర్‌పల్లి, చేవెళ్ల, షాబాద్ మండలాలు, మహబూబ్‌నగర్‌లోని కొత్తూరు మండలం ఈ జీవో పరిధిలోకి వచ్చాయి. దీంతో ఈ గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడింది. ఇతరగ్రామాల్లో భూముల విలువలు ఆకాశాన్నంటుతున్నా, తమ ప్రాంతంలో మాత్రం ఆంక్షలతో భూములను కొనలేని, అమ్మలేని పరిస్థితి ఏర్పడినందున జీవోను సడలించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.



జీవోరద్దుకు కేసీఆర్ హామీ ...

అధికారంలోకి వస్తే 111 జీవోను రద్దు చేస్తామని  కేసీఆర్ కూడా ఎన్నికల్లో ప్రకటించారు. అయితే,  ఈ జీవోపై సర్వోన్నత న్యాయస్థానం పలు తీర్పులు ఇచ్చినందున, వాటికి లోబడి నిర్ణయం తీసుకోవాలని భావించారు. అందుకే ఇటీవల ఈ జీవో ఎత్తివేతపై జిల్లా కలెక్టర్ నుంచి నివే దిక కోరారు. ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ పరీవాహక ప్రాంతాలు, వరదనీటి ప్రవాహంపై సర్వే నిర్వహించాలని నీటి పారుదల శాఖకు సూచించారు.



తప్పులతడకగా జీవో నిబంధనలు...

దీంతో రంగంలోకి దిగిన ఆ శాఖ జీవో జారీలో శాస్త్రీయత పాటించలేదని, ఎఫ్‌టీఎల్ పరిధిలోకి వచ్చే శంకర్‌పల్లిలోని నాలుగు గ్రామాలను ఉద్దేశపూర్వకంగా జీవో పరిధి నుంచి తప్పించినట్టు గుర్తించింది. అంతేకాకుండా జాడలేని నాలుగుగ్రామాలను మాత్రం బయో కన్జర్వేషన్ జోన్‌లోకి తెచ్చారని, మొయినాబాద్ మండల గ్రామాలను శంషాబాద్ మండలంలో చూపారని పేర్కొంది. కాలుష్యాన్ని అరికట్టేందుకే పది కిలోమీటర్ల విస్తీర్ణంలో ఎలాంటి పరిశ్రమలు రావద్దనే ఆంక్షలు విధించారని, వీటిని సవరిస్తే నీరు కలుషితమయ్యే అవకాశముందని నీటిపారుదలశాఖ అభిప్రాయపడింది. 1908లో హైదరాబాద్‌ను మూసీవరద ముంచెత్తినందున ఈ చెరువుల నిర్మాణాన్ని చేపట్టారని, దీనిని పరిగణనలోకి తీసుకోవాల్సివుంటుందని పేర్కొంది. జంట జలాశయాలకు భంగం వాటిల్లకూడదనే పర్యావరణవేత్తల సూచనలు, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించాలని స్పష్టం చేసింది.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top