ఇంతకీ ఆగంతకుడి టార్గెట్ ఏంటి?

ఇంతకీ ఆగంతకుడి టార్గెట్ ఏంటి? - Sakshi


అతడి వద్ద ఏకే 47 లాంటి అత్యంత శక్తిమంతమైన ఆయుధం ఉంది. దాంతో ఒకటి కాదు, రెండు కాదు.. 8 రౌండ్లు కాల్పులు జరిపాడు. అయితే అదృష్టవశాత్తు అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డికి ఏ ప్రమాదం జరగలేదు. ఏకే 47 అంటే చిన్నా చితకా తుపాకి కాదు.. దాన్ని కారులో పెట్టుకుని.. అవతలి వ్యక్తి మీద కాల్పులు జరపడం అంత సులభం కాదు. అలా కాల్చాలనుకుంటే రివాల్వర్ లాంటి చిన్న ఆయుధం తీసుకెళ్లేవాడు. కానీ.. చేతిలో ఏకే 47 పెట్టుకుని కారులో ఏం చేద్దామనుకున్నాడు? అసలు అతడి టార్గెట్ ఏంటి.. నిత్యానందరెడ్డిని అంతం చేయడమా.. అపహరించడమా.. లేక ఉత్తినే బెదిరించడమా?



వివరాల్లోకి వెళితే ప్రశాంతమైన హైదరాబాద్ కేబీఆర్ పార్క్‌ వద్ద ఈ ఉదయం కాల్పుల కలకలం రేగింది. మార్నింగ్ వాక్ ముగించుకుని, ఆడి కారులో కూర్చుని ఉన్న అరబిందో ఫార్మా వైస్చైర్మన్ నిత్యానందరెడ్డిపై ఆగంతకుడు 8 రౌండ్ల కాల్పులు జరిపాడు. దీంతో ఒక్కసారిగా అక్కడ వాతావరణం వేడెక్కింది.  ఈలోగా ... నిత్యానంతరెడ్డితో పాటే కారులో ఉన్న అతడి సోదరుడు ప్రసాద్‌రెడ్డి ఆగంతకుడిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. కాసేపు ఇద్దరి మధ్య పెనుగులాట జరిగింది. ఎలాగైనా తప్పించుకోవాలనుకున్న ఆగంతకుడు, ప్రసాద్‌రెడ్డి చెయ్యి కొరికి పారిపోయాడు. ఈ హడావుడిలో ఏకే  47ను, వెంట తెచ్చుకున్న బ్యాగును కారులోనే వదిలి పరారయ్యాడు.



సంఘటన తర్వాత సాక్షితో మాట్లాడిన నిత్యానందరెడ్డి .. తనను చంపాల్సిన అవసరం ఎవ్వరికీ లేదని, తనకు ఎవ్వరిపై అనుమానం లేదని చెప్పారు. తాను కారు డ్రైవింగ్ సీట్లో కూర్చోగానే ఫ్రంట్ డోర్ తెరచి లోనికి వచ్చిన దుండగుడు గుండెపై గన్‌ పెట్టి కారును స్టార్ట్ చేయమని డిమాండ్ చేశాడని అన్నారు. కాల్పులు జరిపిన వ్యక్తిని గుర్తుపడతానన్న ఆయన అదృష్టవశాత్తు ప్రాణాపాయం నుంచి తృటిలో తప్పించుకున్నట్లు తెలిపారు.



ఈ కాల్పుల్లో ఎవ్వరికీ గాయాలు కాలేదు. ప్రశాంతమైన పార్క్ సమీపంలో కాల్పులు జరగడంతో .. మార్నింగ్ వాకర్స్ భయాందోళనకు గురయ్యారు.  హైదరాబాద్ సీపీ మహేందర్ రెడ్డి, వెస్ట్ జోన్ డిసీపీ వెంకటేశ్వరరావు సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. మరోవైపు నిత్యానందరెడ్డిపై కాల్పుల ఘటనలో ఆగంతకుడు వాడిన ఏకే 47 ఎక్కడిదో తెలిసిపోయింది.  గ్రేహౌండ్స్ ఏఎస్ఐ రాజరాజు వద్ద నుంచి మిస్ అయిన గన్గా పోలీసులు గుర్తించారు.  గత ఏడాది డిసెంబర్ 26న గ్రేహౌండ్స్‌లో కనిపించకుండా పోయిన ఏకే 47...కేబీఆర్‌ పార్క్‌లో నిత్యానందరెడ్డిపై కాల్పులకు వినియోగించినట్టు తేలింది.



రామరాజు వైజాగ్‌ నుంచి గండిపేటకు వస్తుండగా.. గన్ మిస్సైనట్లు గ్రేహౌండ్స్ కమాండర్ శ్రీనివాసరావు నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. అదే గన్‌తో ఆగంతకుడు కేబీఆర్ పార్కులో కాల్పులు జరపడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా  కాల్పుల ఘటనపై బంజారాహిల్స్ పోలీసులు 307, 363 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.ఈ సంఘటనపై తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ ప్రకటన చేశారు. నిందితుడిని పట్టుకోడానికి మూడు ప్రత్యేక బృందాలను నియమించామని, నగరంలో శాంతిభద్రతలను కాపాడేందుకు అనుక్షణం కృషి చేస్తామని ఆయన చెప్పారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top