ఆ మరణం వెనక.. ఎన్ని మలుపులు

ఆ మరణం వెనక.. ఎన్ని మలుపులు


ఇంజనీరింగ్ విద్యార్థి దేవిది హత్యే

తల్లిదండ్రులు, బంధువుల ఆరోపణ

భరత్ మరో ఇద్దరు కలసి చంపేశారు

వారిని తప్పించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆరోపణ

దేవి తల్లిదండ్రుల ఫిర్యాదుతో దర్యాప్తు అధికారి మార్పు..

ఘటనపై మళ్లీ తొలి నుంచి విచారణ


సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ విద్యార్థిని కట్కూరి దేవి అనుమానాస్పద మృతి అంశం ఎన్నో మలుపులు తిరుగుతోంది. తమ కుమార్తె ప్రమాదవశాత్తూ మరణించలేదని, ఆమెను హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించారన్న దేవి తల్లిదండ్రుల ఫిర్యాదుతో... పోలీసులు ఈ ఘటనపై తిరిగి మొదటి నుంచి దర్యాప్తు ప్రారంభించారు.ప్రమాదానికి గురైన కారును ఘటనా స్థలంలోకి తిరిగి తెప్పించి... పోలీసులతోపాటు ఫోరెన్సిక్ నిపుణులు, మోటారు వాహనాల అధికారులు పరిశీలించారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఆదివారం తెల్లవారుజామున జరిగిన కారు ప్రమాదంలో దేవి అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయం తెలిసిందే. గురువారం ఘటనా స్థలంలో పోలీసులు విచారణ జరుపుతుండగా.. దేవి బంధువులు, మిత్రులు అక్కడికి చేరుకుని ఆందోళన చేపట్టారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రమాదం జరిగిన రోజున కారులో మరో ఇద్దరు ఉన్నారని, వారిని తప్పించారని ఆరోపించారు.



ప్రమాదం జరిగిన రోజున కారు ముందు భాగం చాలా తక్కువగా దెబ్బతిన్నదని... కానీ ఇప్పుడు పోలీసులు తీసుకువచ్చేటప్పటికి చాలా ఎక్కువ డ్యామేజీ ఉందంటూ దేవి సోదరి మానస చెప్పారు. ఇందుకు సంబంధించి ప్రమాదం జరిగినప్పుడు తీసిన ఫొటోను ఆధారంగా చూపారు. పోలీసులు కావాలనే దోషులను తప్పిస్తున్నారని ఆరోపించారు. ఇక మరోవైపు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసు అధికారులు విచారణాధికారిగా ఉన్న జూబ్లీహిల్స్ సీఐ వెంకటరెడ్డిని తప్పించి.. ఏసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డికి కేసును అప్పగించారు.

 

దర్యాప్తు ముమ్మరం..

తిరిగి మొదటి నుంచి దర్యాప్తు చేపట్టిన పోలీసులు... ఉస్మానియా వైద్యులిచ్చిన పోస్టుమార్టం నివేదికను క్షుణ్నంగా పరిశీలించారు. తలకు బలమైన గాయాలు కావటం వల్లే ఆమె మరణించిందని, మిగతా శరీర భాగాలపై గాయాలేవీ లేవని ఆ నివేదిక పేర్కొంది. దీంతో తలపై గాయాలు ప్రమాదం వల్లే జరిగాయా, ఆ సమయంలో కారు ఎంత వేగంలో ఉండి ఉంటుందనే అంశాలపై ఫోరెన్సిక్, మోటార్ వాహనాల అధికారుల సహాయాన్ని తీసుకున్నారు. ఇక దేవి ఆదివారం తెల్లవారుజామున ఇంటి నుంచి బయలుదేరి ప్రమాదస్థలి వరకు ఏ మార్గంలో వచ్చారు, ఆ సమయంలో ఎవరెవరితో మాట్లాడారు, దేవి తల్లిదండ్రులు ఆరోపిస్తున్న యువకుల సెల్‌ఫోన్ టవర్ లోకేషన్లను పోలీసులు విశ్లేషించారు.



భరత్ వేసుకున్న దుస్తులు, ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదం జరిగే ముందు దేవి, భరత్ ఇద్దరూ ఐదు నిమిషాలపాటు అక్కడ ఆగినట్లు గుర్తించారు. ఇక దేవి అనుమానాస్పద మృతిపై మొదటి నుంచి దర్యాప్తు చేపట్టామని, శాస్త్రీయ కోణంలో ముందుకు వెళుతున్నామని డీసీపీ వెంకటేశ్వరరావు చెప్పారు. నిజాయితీగా, నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తామని, అపోహలకు తావు లేదని తెలిపారు.

 

దోషిగా తేలితే శిక్షించండి

కుమార్తె మరణించిన ఆవేదనలో దేవి తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తున్నారు. పోలీసులు దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపి, భరత్ తప్పు చేశాడని తేల్చితే.. ఏ శిక్ష విధించినా సరే. అంతేగానీ పోలీసుల విచారణను అడ్డుకోవటం సరికాదు..

- భరత్ తల్లి సామ అనితారెడ్డి

 

ఎన్‌కౌంటర్ చేయాలి

 మా అక్క మృతి పట్ల చాలా అనుమానాలున్నాయి. ఆ రోజు ఎన్నోసార్లు ఫోన్ చేసినా ఆమె లిఫ్ట్ చేయలేదు. ఇంట్లో అందరం నిద్రాహారాలు మాని ఎదురుచూశాం. రోడ్డు ప్రమాదంలో చనిపోయిందనగానే నిశ్చేష్టులమయ్యాం. ఇందుకు కారకులైన వారిని ఎన్‌కౌంటర్ చేయాలి.    

- దేవి సోదరి మానస

 

దేవిది మూమ్మాటికీ హత్యే

నా బిడ్డ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిందన్నది కట్టుకథ. లోతుగా విచారణ జరిపితే  దోషులెవరో తేలుతుంది. ఆమె వుృతి వెనుక మిస్టరీని ఛేదించాలి. ఆ రోజు కారులో భరతసింహారెడ్డితో పాటు మరో ఇద్దరు కూడా ఉన్నారు. ఆ ఇద్దరు ఎవరో గుర్తించాలి. సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తే నిజాలు వెలికి వస్తాయి. ప్రమాదం జరిగిన కారును తీయడానికి గంటల సమయం పట్టే ఈ రోజుల్లో.. అరగంటలోనే కారును అక్కడి నుంచి ఎలా తొలగిస్తారు? దాన్ని దూరంగా రహ్మత్‌నగర్‌కు తరలించడం వెనుక అనుమానాలున్నాయి. దోషులు పట్టుబడే దాకా ఉద్యమిస్తాం.    

- దేవి తండ్రి కట్కూరి నిరంజన్‌రెడ్డి

 

సాయం చేయాలంటూ అరుపులు వినిపించాయి

ఆదివారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో మా సార్ కార్లు కడగడానికి లేచాను. ఆ సమయంలో మా ఫ్లాట్ ముందు ఓ తెల్లరంగు కారు ఆగి ఉంది. కొద్దిసేపటికి కారు తలుపులు కొడుతున్న చప్పుడు వినిపించింది. తర్వాత కాసేపటికే కారులోంచి ఓ యువతి దిగి పరిగెత్తే ప్రయత్నం చేసింది. కానీ కార్లోంచి ఓ యువకుడు దిగి ఆమెను తిరిగి కారులోకి లాక్కెళ్లాడు. నేను నా పనిలో ఉండిపోయాను. కొద్దిసేపటికే హెల్ప్.. హెల్ప్ అన్న అరుపులు వినిపించాయి. నేను బయటకొచ్చి చూస్తుండగానే ఆ కారు దూసుకుపోయింది. కొద్దిసేపటికే కారు ప్రమాదం జరిగి, ఓ యువతి చనిపోయిందని తెలిసింది.    

- వాచ్‌మన్ రాము, ప్రత్యక్ష సాక్షి

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top