మాయ లేడీ శ్రీలత డబుల్‌ యాక్షన్‌

మాయ లేడీ  డబుల్‌ యాక్షన్‌


తల్లిగానూ తానే మాట్లాడింది!

కి‘లేడీ’ విచారణలో వెలుగులోకి




సిటీబ్యూరో: మాట్రిమోనియల్‌ సైట్‌ను వేదికగా చేసుకుని, నకిలీ ప్రొఫైల్‌ క్రియేట్‌ చెయ్యడం ద్వారా పలువురిని మోసం చేసిన బెంగళూరు వాసి శ్రీలత విచారణలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో నమోదైన కేసుల్ని ఏసీపీ కేసీఎస్‌ రఘువీర్‌ నేతృత్వంలో ఇన్‌స్పెక్టర్‌ కేవీఎం ప్రసాద్‌ దర్యాప్తు చేస్తున్నారు. గురువారం ఆమెను సిటీకి తీసుకువచ్చిన అధికారులు కోర్టులో హాజరుపరిచారు.


బెంగళూరు సమీపంలోని అత్తూరుకు చెందిన శ్రీలత నిరుపేద రైతు కుటుంబంలో జన్మించింది. రెండేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో సోదరి మరణించింది. ఇటీవల భారత్‌మాట్రిమోని.కామ్‌ సైట్‌లో సుస్మిత పేరుతో, అందమైన యువతి ఫొటోతో రిజిస్టర్‌ చేసుకున్న శ్రీలత మోసాలకు తెర లేపింది. నగరానికి చెందిన శేషు అనే యువకుడు ఆసక్తి చూపడంతో అతడితో ఫోన్‌లో, వాట్సాప్‌ ద్వారా కమ్యూనికేషన్‌ కొనసాగించింది.



ఓ దశలో తన కుటుంబీకులు మీ కుటుంబసభ్యులతో మాట్లాడాలని శేషు కోరడంతో మరో నాటకానికి తెర లేపింది. తానే గొంతు మార్చి మాట్లాడిన  శ్రీలత ‘తల్లి’గా పరిచయం చేసుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 6న పెళ్లి చూపులకూ ముహూర్తం ఖరారు చేసింది. అంతలో విలువైన వస్తువులు, క్రెడిట్‌కార్డ్స్, రూ.40 వేలు ఉన్న పర్సు పోయిందంటూ శేషును సంప్రదించి ఆ మొత్తాన్ని బ్యాంకు ఖాతాలో డిపాజిట్‌ చేయమంది. ఇలా వివిధ సందర్భాల్లో రకరకాల కారణాలు చెబుతూ ఫిబ్రవరి 2 వరకు మొత్తం రూ.1,66,500 స్వాహా చేసింది.


ఆ మరుసటి రోజు నుంచే ఫోన్లు స్విచ్ఛాఫ్‌లో పెట్టడంతో పాటు ఎలాంటి కమ్యూనికేషన్‌ లేకుండా చేసింది. మరోపక్క సిటీకి చెందిన తేజ అనే యువకుడితోనూ పరిచయం పెంచుకున్న శ్రీలత తమకు బంజారాహిల్స్, సిటీ శివార్లతో పాటు బెంగళూరులో పలు భవనాలు ఉన్నట్లు చెప్పింది. దాదాపు రూ.28 కోట్ల ఆస్తి తన పేరిట ఉండగా... ఇటీవల సోదరుడు చనిపోయాడని, వదిన గొడవపడి రూ.12 కోట్ల ఆస్తి పట్టుకుపోయిందని నమ్మించింది.



తన తండ్రి సింగపూర్‌ ట్రిప్‌లో ఉన్నాడంటూ వివిధ కారణాలు చెబుతూ రూ.2.78 లక్షలు కాజేసింది. ఈ నగదును తన తండ్రితో పాటు సోదరి భర్త ఖాతాల్లో డిపాజిట్‌ చేయించుకుంది. వీటితో జల్సాలు చేస్తూ పరిచయస్తులు, బంధువులకు అనుమానం రాకుండా ఉండేందుకు మరో ఎత్తు వేసింది. బెంగళూరుకు చెందిన భారీ వ్యాపార సంస్థ టోటల్‌ మాల్‌లో మేనేజర్‌గా పని చేస్తున్నానని, నెలకు రూ.45 వేల జీతం వస్తోందని నమ్మించింది. సిటీకి చెందిన మరో ఇద్దరు యువకులకూ ఎరవేసినప్పటికీ... కోటీశ్వరురాలినని చెబుతూ డబ్బు అడగటంతో వారు అప్రమత్తమయ్యారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top