కరీంనగరం స్వర్గధామం

కరీంనగరం స్వర్గధామం - Sakshi


నగరాన్ని అత్యద్భుతంగా అభివృద్ధి చేస్తాం: సీఎం కేసీఆర్‌

- శాతవాహన అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఏర్పాటు

- హైదరాబాద్‌ తరహాలో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌

- 4 లక్షల మొక్కలతో హరితహారం.. మానేర్‌ రివర్‌ ఫ్రంట్‌ ఏర్పాటు

- స్వర్గధామంలా నివాస గృహాలు నిర్మిస్తామని వెల్లడి

- వెంటనే రూ.25 కోట్లు విడుదల చేస్తూ ఆదేశాలు

తొలి ఇంటిని తానే కొనుగోలు చేస్తానన్న కేసీఆర్‌




సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని అతి ముఖ్యమైన నగరాల్లో ఒకటైన కరీంనగర్‌ను అద్భుతంగా తీర్చిదిద్దుతామని ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. నగర అభివృద్ధికి శాతవాహన అర్బన్‌ డెవలప్‌ మెంట్‌ అథారిటీని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. కరీంనగర్‌ వద్ద మానేరు రివర్‌ ఫ్రంట్‌ సుందరీకరణకు బడ్జెట్లో కేటాయించిన రూ.506 కోట్లలో రూ.25 కోట్లను బుధవారం విడుదల చేశారు. కరీంనగర్‌ అభివృద్ధి అంశంపై సీఎం కేసీఆర్‌ బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు ప్రగతి భవన్‌లో విస్తృత స్థాయి సమీక్ష నిర్వహించారు.



మంత్రులు హరీశ్‌రావు, ఈటల, ఎంపీ వినోద్‌కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్, జెడ్పీ చైర్‌పర్సన్‌ తుల ఉమ, సాంస్కృతిక సారథి చైర్మన్‌ రసమయి బాలకిషన్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, సీఎస్‌ ఎస్‌పీ సింగ్, పలువురు ఉన్నతా ధికారులు, కరీం నగర్‌ జిల్లా అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరీంనగర్‌తో పాటు రాష్ట్రంలోని అన్ని మున్సిపల్‌ కార్పొరేషన్లు, పోలీసు కమిషన రేట్లున్న పట్టణాల్లో అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు.



అద్భుతంగా తీర్చిదిద్దుతాం

మానేరు రివర్‌ ఫ్రంట్‌ను 90 కిలోమీటర్ల పొడవున ఏర్పాటు చేస్తామని.. ఉత్తర తెలం గాణకు మకుటంగా, అత్యంత సుందరంగా అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతామని సీఎం కేసీఆర్‌ తెలిపారు. విశాలమైన పచ్చిక బయళ్లు, యోగా కేంద్రాలు, వాటర్‌ స్పోర్ట్స్, బోటింగ్‌ ఏర్పాటు చేస్తామని, నదికి అభిముఖంగా స్వర్గధామంగా ఉండేలా నివాస గృహాలు నిర్మిస్తామని చెప్పారు. అందులో మొదటి గృహాన్ని తానే కొనుగోలు చేస్తానని, రెండో గృహాన్ని మంత్రి ఈటెల కొనుగోలు చేస్తారని తెలిపారు. రివర్‌ ఫ్రంట్‌ను మొదట చేగుర్తి లింగాపూర్‌ వరకు, రెండో దశలో వేగురుపల్లి వరకు సుందరీకరిస్తామని.. వెంటనే ఈ పనులు ప్రారంభించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. నదికి ఇరువైపులా పొడవుగా పెరిగే మొక్కలు నాటాలని సూచించారు.



హరిత హారానికి భారీగా విరాళాలు

కరీంనగర్‌లో హరితహారానికి భారీగా విరాళాలు ఇచ్చేందుకు జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు ముందు కొచ్చారు. ఎంపీ వినోద్‌కుమార్‌ రూ.50 లక్షలు, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ రూ.50 లక్షలు, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు రూ.50 లక్షలు, ఎమ్మెల్సీ భానుప్రసాద్‌ రూ.50 లక్షలు విరాళంగా ఇస్తామని ప్రకటించారు. మండలి చైర్మన్‌ స్వామిగౌడ్, చీఫ్‌ విప్‌ సుధాకర్‌రెడ్డి తదితరులు తమ నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి ఖర్చు చేస్తామని చెప్పారు.



ముఖ్యమంత్రి వెల్లడించిన నిర్ణయాలివీ..

► కరీంనగర్‌కు అభివృద్ధి ప్రణాళిక తయారీ, అమలు కోసం శాతవాహన అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఏర్పాటు. నగరంలో వివిధ రంగాల పరిస్థితిని అధ్యయనం చేసి బ్లూప్రింట్‌ తయారు చేసే బాధ్యత మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌కు అప్పగింత.

► పదిన్నర కిలోమీటర్ల పొడవున్న లోయర్‌ మానేరు డ్యామ్‌ కట్టపై మొక్కల పెంపకం. డ్యామ్‌ మీద టూరిస్టు స్పాట్, వ్యూపాయింట్, రెస్టారెంట్‌ ఏర్పాటు, కాటేజీల నిర్మాణం. రూ.40 కోట్లతో డ్యామ్‌ సుందరీకరణ పనులు.

► నగరంలో పచ్చదనం పెంచేందుకు రూ.10 కోట్లతో స్పెషల్‌ డ్రైవ్‌. ఇందుకోసం కరీంనగర్‌లో హరితహారం కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభిస్తారు. అదే రోజున నగరవ్యాప్తంగా లక్ష మొక్కలు నాటుతారు. పచ్చదనం పెంపు కార్యక్రమ పర్యవేక్షణకు ఐఎఫ్‌ఎస్‌ అధికారి వి.ఆంజనేయులుకు ప్రత్యేక అధికారిగా బాధ్యతలు.

► కరీంనగర్‌లో మరో ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ ఏర్పాటు. అవసరమైన చోట రోడ్ల వెడల్పు. ఆర్టీసీ బస్సులు నిలిపేందుకు బస్‌బేల నిర్మాణం. ప్రస్తుత పోలీసు కార్యాలయ ప్రాంగణంలో కొత్త పోలీస్‌ కమిషనరేట్‌ నిర్మాణం. హైదరాబాద్‌ తరహాలో కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లేర్పాటు.

► ప్రస్తుతం కలెక్టరేట్‌ ఉన్న చోట పదెకరాల విస్తీర్ణంలో నూతన కలెక్టరేట్, జిల్లా పరిషత్‌ కార్యాలయం, మున్సిపల్‌ కార్పొరేషన్‌ భవనాల రీమోడలింగ్‌. అక్కడే కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం ఏర్పాటు.

► కరీంనగర్‌ చుట్టూ ఉన్న రహదారులను లింక్‌ చేసి ఔటర్‌ రింగ్‌రోడ్డు ఏర్పాటు.

► పదెకరాల స్థలంలో అంతర్జాతీయ స్థాయిలో కరీంనగర్‌ కళాభారతి నిర్మాణం. 500, 1200 మంది పట్టే సామర్థ్యంతో రెండు వేర్వేరు హాళ్ల ఏర్పాటుకు నిర్ణయం.

► నగరంలో రూ.25 కోట్లతో ఐదు చోట్ల శాకాహార, మాంసాహార మార్కెట్ల ఏర్పాటు. గజ్వేల్‌లో నిర్మించిన తరహాలో ఏసీ సౌకర్యంతో పాటు పరిశుభ్ర మార్కెట్ల నిర్మాణం.

► నాలుగు చోట్ల ఖనన వాటికలు (బరియల్‌ గ్రౌండ్స్‌), మరో నాలుగు చోట్ల దహన వాటికలు (క్రిమటోరియమ్స్‌) ఏర్పాటు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top