ఖరీఫ్‌ కళకళలాడాలి

ఖరీఫ్‌ కళకళలాడాలి


1.08 కోట్ల ఎకరాల్లో సాగు లక్ష్యం

- 2017–18 కార్యాచరణ ప్రణాళికలో వ్యవసాయ శాఖ

- గతేడాది కంటే రెండున్నర లక్షల ఎకరాలు పెరగనున్న వరి

- ఖరీఫ్, రబీ విత్తన సరఫరా లక్ష్యం 10 లక్షల క్వింటాళ్లు

- గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర రైతు సమాఖ్యల ఏర్పాటుకు చర్యలు




సాక్షి, హైదరాబాద్‌: గతేడాది కంటే ఖరీఫ్‌ పంటల విస్తీర్ణాన్ని పెంచాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. ఈ మేరకు 2017–18 వ్యవసాయ కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. వ్యవసాయ ప్రణాళికను ప్రభుత్వ అనుమతి కోసం పంపిం చారు. అక్కడ్నుంచి ఆమోదం రాగానే ప్రకటించనుంది. తాజా వ్యవసాయ ప్రణాళిక ప్రకారం 2017–18 ఖరీఫ్‌లో పంటల సాగు విస్తీర్ణాన్ని పెంచాలని నిర్ణయించారు. 2016–17లో ఖరీఫ్‌లో 1.02 కోట్ల ఎకరాల్లో పంటలు సాగవ్వగా.. 2017–18 ఖరీఫ్‌లో 1.08 కోట్ల ఎకరాల్లో పంటలు సాగు చేయాలని లక్ష్యంగా నిర్ధారించారు. అంటే గతేడాది కంటే 6 లక్షల ఎకరాల్లో అదనంగా సాగు చేయాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. అందులో వరి 2016–17 ఖరీఫ్‌లో 22.15 లక్షల ఎకరాల్లో సాగు చేయగా.. ఈసారి ఖరీఫ్‌లో 24.65 లక్షల ఎకరాల్లో సాగు చేయాలని నిర్ణయించారు.



అదనంగా రెండున్నర లక్షల ఎకరాల్లో వరి నాట్లు వేయించాలని, ఆ మేరకు రైతులను సన్నద్ధం చేయాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. అలాగే 2017–18లో మొత్తం 90.6 లక్షల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి రానుందని అంచనా వేసింది. గతేడాది అధిక వర్షాలు, మిషన్‌ కాకతీయతో చెరువులు నిండిపోవడం వంటి కారణాలతో భూగర్భ జలాలు పెరిగాయి. ఈసారి వర్షాలు అధికంగా కురుస్తాయన్న వాతావరణ శాఖ ముందస్తు అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వరి సాగు విస్తీర్ణాన్ని ఏకంగా రెండున్నర లక్షల ఎకరాలకు పెం చారు. ఇక రబీ పంటల సాగు విస్తీర్ణాన్ని కూడా పెంచాలని నిర్ణయించారు.



2016–17లో రబీ పంటల సాధారణ సాగు విస్తీర్ణం 30 లక్షల ఎకరాలు కాగా.. 2017–18 రబీలో 33.75 లక్షలకు పెంచాలని నిర్ణయించారు. ప్రభుత్వ ప్రచారం కారణంగా గతేడాది పత్తి సాగు విస్తీర్ణం సాధారణం కంటే గణనీయంగా తగ్గింది. అయితే మార్కెట్లో పత్తికి భారీగా ధర పలికింది. దీంతో రైతులు అనేకమంది ఈసారి పత్తి వైపు మరలుతారని వ్యవసాయశాఖ అంచనా వేసింది. దీంతో పప్పుధాన్యాల సాగు విస్తీర్ణం పడిపోతుందని భావిస్తున్నారు.



10 లక్షల క్వింటాళ్ల విత్తనాలు

ఈ ఏడాది ఖరీఫ్, రబీలకు 10 లక్షల క్వింటాళ్ల విత్తనాలు సరఫరా చేయాలని వ్యవసాయశాఖ లక్ష్యం గా నిర్దేశించుకుంది. అందులో ఖరీఫ్‌లో 6 లక్షల క్వింటాళ్లు, రబీలో 4 లక్షల క్వింటాళ్లు సరఫరా చేయనున్నారు. 2016–17లో రెండు సీజన్లకు కలిపి 7.5 లక్షల క్వింటాళ్లు మాత్రమే సరఫరా చేశారు. ఈసారి అదనంగా రెండున్నర లక్షల క్వింటాళ్ల విత్తనాలు రైతులకు అందజేయనున్నారు. అయితే ఎరువుల వాడకాన్ని ఈసారి కాస్తంత తగ్గించాలని నిర్ణయించారు. 2016–17 ఖరీఫ్‌లో 17.30 లక్షల టన్నులు సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకుంటే, 2017–18 ఖరీఫ్‌లో 16.20 లక్షల టన్నులే సరఫరా చేయాలని నిర్ణయించారు. గత రబీలో 12.50 లక్షల టన్నుల ఎరువులను సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా.. ఈసారి రబీలో 12 లక్షల టన్నులు మాత్రమే సరఫరా చేయాలని భావిస్తున్నారు. ఎరువులను గణనీయంగా తగ్గించడం వల్ల రైతులకు సాగు ఖర్చు తగ్గనుంది. దీనివల్ల రైతు ఆదాయం కూడా పెరుగుతుంది. ఎరువుల వాడకాన్ని తగ్గించేందుకు రైతులకు అవగాహన కల్పించాలని నిర్ణయించారు.



ఈ ఏడాదే సమాఖ్యల ఏర్పాటు

వచ్చే ఏడాది ఖరీఫ్‌ నుంచి రైతులకు ఎకరాకు రూ.4 వేల చొప్పున రెండు సీజన్లకు పెట్టుబడి ఖర్చులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లబ్ధిదారులను గుర్తించే పనిని ప్రభుత్వం గ్రామ రైతు సంఘాలకు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రే స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అంతేకాదు రైతులు తాము పండించిన పంటకు సరైన ధర ఇప్పించే పని కూడా రైతు సంఘాలకే కల్పించారు. అందుకోసం ఈ ఏడాదిలోనే గ్రామ రైతు సంఘాలు, మండల, జిల్లా, రాష్ట్ర రైతు సమాఖ్యలను ఏర్పాటు చేయాలని వ్యవసాయశాఖ తన ప్రణాళికలో ప్రస్తావించింది. అందుకు త్వరలో మార్గదర్శకాలు ఖరారు చేసి సమాఖ్యలను ఏర్పాటు చేస్తారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top