ముద్రగడకు ఏమైనా అయితే..

ముద్రగడకు ఏమైనా అయితే.. - Sakshi


ఆ వర్గం మిమ్మల్ని క్షమిస్తుందా

పద్మనాభం పట్ల అవమానకరంగా మాట్లాడకండి

వైద్య నివేదికలపై మంత్రుల వ్యంగ్య వ్యాఖ్యలు తగవు

కులాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నాలు వద్దు

వైఎస్ఆర్‌సీపీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ



హైదరాబాద్


కాపు రిజర్వేషన్ల సాధన, తుని ఘటనలో అరెస్టు చేసినవారిని విడుదల చేయాలన్న డిమాండ్లతో 9 రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం పట్ల రాష్ట్ర మంత్రులు అవమానకరంగా మాట్లాడుతున్నారని వైఎస్ఆర్‌సీపీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. ఇన్నాళ్లుగా దీక్ష చేస్తున్నా ఆయన వైద్య నివేదికలు సాధారణంగానే ఉన్నాయంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు రాష్ట్ర హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఏకంగా అవసరమైతే ముద్రగడను సైతం అరెస్టు చేస్తామంటున్నారని.. వీళ్లంతా తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా అని ప్రశ్నించారు.



ముద్రగడ పద్మనాభం ఆరోగ్య పరిస్థితి గురించి మంత్రులు, అధికారులు ఎవరూ సరైన వివరాలు చెప్పడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. అసలు దీక్షకు కూర్చున్న రెండు గంటలకే ఆయనను రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారని, ఆ సందర్భంలో ఆయన కుటుంబసభ్యుల పట్ల, ముఖ్యంగా మహిళల పట్ల చాలా అవమానకరంగా ప్రవర్తించారని అన్నారు. కులాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేయకూడదని హితవు పలికారు.



జరగకూడనిది ఏమైనా జరిగితే అసలు ఆ వర్గం మిమ్మల్ని క్షమిస్తుందా అని బొత్స ప్రశ్నించారు. మీకు ఎవరిమీద, ఎందుకు ఈ కక్ష ఉందని నిలదీశారు. సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోమంటే ప్రాంతాల మధ్య, కులాల మధ్య తగువు పెడుతున్నారని మండిపడ్డారు. ఈ రాష్ట్రాన్ని ఏం చేద్దామనుకుంటున్నారని నిలదీశారు. వ్యక్తిగత లబ్ధి, రాజకీయ ప్రయోజనాల కోసం చూసి రాష్ట్రాన్ని రావణ కాష్టం చేయొద్దని.. ప్రజాస్వామ్యబద్ధంగా పాలించాలని, దీన్ని పోలీసు రాజ్యం చేయొద్దని అన్నారు. సమాజంలో ఎవరికి ఇవ్వాల్సిన గౌరవాన్ని వాళ్లకు ఇవ్వాలని, మీ గౌరవం మీరు పుచ్చుకోవాలని తెలిపారు. 67 సంవత్సరాలున్న ఆయన ప్రాణానికి హాని తలపెట్టకుండా ఆయన పూర్తిగా కోలుకునేలా సమస్యను పరిష్కరించాలన్నారు. అధికారులు ఆ కుటుంబం పట్ల అవమానకరంగా ప్రవర్తించారని, అందుకుగాను ఆ కుటుంబానికి సమాధానం చెప్పుకోవాలని డిమాండ్ చేశారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top