‘కాళేశ్వరం’ విద్యుత్ బాధ్యత ట్రాన్స్‌కోకు

‘కాళేశ్వరం’ విద్యుత్ బాధ్యత ట్రాన్స్‌కోకు - Sakshi


♦ సబ్‌స్టేషన్ల నిర్మాణం, నిర్వహణ చేపట్టనున్న సంస్థ

♦ సీఎండీ ప్రభాకర్‌రావుతో అధికారుల చర్చలు సఫలం

 

 సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టుకు అవసరమయ్చే విద్యుత్‌ను సరఫరా చేసే బాధ్యతను పూర్తిగా తీసుకునేందుకు ట్రాన్స్‌కో అంగీకరించింది. సబ్‌స్టేషన్ల నిర్మాణం, నిర్వహణను తామే తీసుకుంటామని నీటిపారుదలశాఖకు హామీ ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టులో 400 కేవీ, 200 కేవీ సబ్‌స్టేషన్ల నిర్మాణం చేపట్టే విషయమై ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావుతో నీటిపారుదలశాఖ ప్రభుత్వ సలహాదారు పెంటారెడ్డి, ఈఎన్‌సీ మురళీధర్, సీఈ హరిరామ్, వెంకటేశ్వర్లు శుక్రవారం జరిపిన చర్చలు ఈ మేరకు ఫలప్రదమయ్యాయి.



మొత్తంగా 4,500 మెగావాట్ల విద్యుత్‌ను సరఫరా చేసే సబ్‌స్టేషన్ల నిర్మాణానికి సుమారు రూ. 3 వేల కోట్లు ఖర్చవుతాయని ప్రాథమికంగా అంచనా వేశారు. తెలంగాణ ప్రాంతమంతా దక్కన్ పీఠభూమి కావడం, ప్రాజెక్టు పూర్తిగా ఎత్తిపోతలే కావడంతో విద్యుత్ అవసరాలు 4,500 మెగావాట్ల వరకు ఉంటుందని లెక్కగట్టారు. ఈ ప్రాజెక్టుకు తొలి ప్రాధాన్యత నిచ్చి దానిసత్వర పూర్తికి ప్రభుత్వం ప్రణాళికలు వేస్తున్న దృష్ట్యా విద్యుత్‌ను సరఫరా చేసే సబ్‌స్టేషన్ల నిర్మాణ బాధ్యతలను పూర్తిగా ట్రాన్స్‌కో తీసుకోవాలని అధికారులు కోరారు. గతంలో నిర్మించిన ప్రాజెక్టులకు ఈ స్థాయిలో అవసరాలు లేకపోవడంతో 133 కేవీ నుంచి 220 కేవీ సబ్‌స్టేషన్ల నిర్మాణాలను సంబంధిత ప్రాజెక్టుల అథారిటీలే చేపట్టి వాటి నిర్వహణ బాధ్యతలను మాత్రం ట్రాన్స్‌కోకు అప్పగించాయని తెలిపారు. ప్రస్తుతం 400 కేవీల సబ్‌స్టేషన్ల నిర్మాణం అవసరం ఉండటం, ఆ స్థాయి నిర్మాణాలు చేపట్టే సామర్థ్యం నీటిపారుదలశాఖ వద్ద లేకపోవడంతో వాటి బాధ్యతను ట్రాన్స్‌కో తీసుకోవాలని ప్రతిపాదించారు.



 పాలమూరుకు మరో 5 సబ్‌స్టేషన్లు

 ఇప్పటికే పనులు ప్రారంభమైన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల అవసరాల నిమిత్తం మరో 5 సబ్‌స్టేషన్ల నిర్మాణం చేపట్టాల్సి ఉందని నీటిపారుదలశాఖ అధికారులు సీఎండీ దృష్టికి తీసుకెళ్లారు. వాటి నిర్మాణ బాధ్యతలకు ఆయన అంగీకారం తెలిపినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

 

 8 సబ్‌స్టేషన్లు.. రూ. 3 వేల కోట్ల ఖర్చు

 కాళేశ్వరం ప్రాజెక్టు కోసం మేడిగడ్డ వద్ద 3, ఎల్లంపల్లి వద్ద 2, మిడ్‌మానేరు నుంచి మల్లన్న సాగర్ వరకు 3 సబ్‌స్టేషన్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంటుందని నీటిపారుదల శాఖ అధికారులు వివరించారు. దీనిపై సీఎండీ ప్రబాకర్‌రావు స్పందిస్తూ ప్రాజెక్టుకు అన్నీ 400 కేవీ సబ్‌స్టేషన్లు నిర్మాణం చేయాల్సి ఉందని, ఒక్కో 400 కేవీ సబ్‌స్టేషన్, లైనింగ్‌ల నిర్మాణానికి సుమారు రూ. 400 కోట్ల మేర ఖర్చయ్యే అవకాశం ఉందని వివరించారు. ఈ లెక్కన సుమారు రూ. 3 వేల కోట్ల ఖర్చవుతుందని తెలిపారు. నిర్మాణ వ్యయాన్నంతా ప్రాజెక్టు నిధుల్లోంచే ఖర్చు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. దీనికి నీటిపారుదలశాఖ అధికారులు అంగీకారం తెలిపినట్లు సమాచారం. దీంతోపాటే ట్రాన్స్‌కో అధికారుల సేవలను వినియోగించుకున్నందుకు ఆ శాఖ ఇంజనీర్లకు 10 శాతం అదనంగా జీతాలు ఇవ్వాలన్న అభ్యర్థనను ఆమోదించినట్లు తెలిసింది. ఈ పనులను త్వరలోనే ప్రారంభించి 15 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top