జనవరిలో కాకతీయ ఉత్సవాలు


వరంగల్‌లో మూడు రోజులు, ఇతర జిల్లాల్లో రెండు రోజులు

నాటి కళావైభవం ఉట్టిపడేలా నిర్వహణ

పర్యాటక భవన్‌లో సన్నాహక సమావేశం


 

సాక్షి, హైదరాబాద్: కాకతీయ ఉత్సవాలను వచ్చే జనవరి రెండో వారంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణలో జనవరి 10, 11 తేదీల్లో జరపాలని నిర్ణయించగా, వరంగల్ జిల్లాలో మాత్రం ఒకరోజు ముందుగా 9వ తేదీన ఉత్సవాలు ప్రారంభమవుతాయి. దీనిపై చర్చించేందుకు ప్రభుత్వ సలహాదారులు పాపారావు, రమణాచారిలు సాంస్కృతిక శాఖ ముఖ్యకార్యదర్శి బి.పి.ఆచార్య, ఆ శాఖ సంచాలకులు హరికృష్ణ, వరంగల్ జిల్లా కలెక్టర్ కిషన్, సమాచార శాఖ సంచాలకులు సుభాష్‌గౌడ్‌లతో పర్యాటక భవన్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కాకతీయ సామ్రాజ్యంలో అలరారిన కళాసంపదతో పాటు వారసత్వ కళలను, ప్రజాదరణ పొందిన గ్రామీణ కళారూపాలను ప్రతిబింబించేలా ఉత్సవాలు నిర్వహించాలని వారు ఆదేశించారు.



ఆయా జిల్లాల కలెక్టర్లతో సమీక్షించి ఏర్పాట్లు చేయాలని, ఇందుకు సాంస్కృతిక శాఖ సంచాలకులు, వరంగల్ జిల్లా కలెక్టర్ వారికి సహకరించాలని పేర్కొన్నారు. విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించాలని, ఉత్సవాలను వీలైనంత ఎక్కువ మంది తిలకించేలా జిల్లా కేంద్రాల్లో వేదికను తీర్చిదిద్దాలని సూచించారు. కరపత్రాలు, పోస్టర్లు, బ్యానర్లతో ఊరారా ప్రచారం చేయాలని, ప్రధాన వేదిక వద్ద ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్యక్రమాలు ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. వృద్ధ కళాకారులకు ఇటీవల రూ.1,500కు పెంచిన పింఛన్‌ను ఈ సందర్భంగా పంపిణీ చేసేందుకు వీలుగా పరిశీలన ప్రక్రియను ఈ నెలాఖరుకు పూర్తి చేయాలని సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి బి.పి.ఆచార్య పేర్కొన్నారు.



ఇప్పటి వరకు ఉన్న లబ్ధిదారులే కాకుండా కొత్తగా అర్హులను కూడా గుర్తించాలని పేర్కొన్నారు. ఉత్సవాల నిర్వహణకు అవసరమైన కమిటీలు ఏర్పాటు చేయాలని, ఉత్సవాల సందర్భంగా ఆయా జిల్లాల్లోని ప్రముఖులు, మేధావులు, కళాకారులతో వేదిక వరకు ర్యాలీ నిర్వహించాలని పర్యాటక శాఖ అడిషనల్ చీఫ్ శ్రీనివాస్ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఇన్‌టాక్ కన్వీనర్లు అనూరాధారెడ్డి, పాండురంగారావు, పురావస్తు శాఖ సంచాలకులు మనోహర్, శిల్పారామం ప్రత్యేకాధికారి కిషన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top