అవినీతి లేదంటే నవ్వుకుంటున్నారు

అవినీతి లేదంటే నవ్వుకుంటున్నారు - Sakshi


సీఎం క్యాంపు ఆఫీసు వేదికగా రాజకీయ అవినీతి: కె.లక్ష్మణ్


 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రాజకీయ అవినీతి లేదని సీఎం కేసీఆర్ అంటే ప్రజలు నవ్వుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. సీఎం క్యాంపు కార్యాలయమే రాజకీయ అవినీతికి వేదికగా మారిందన్నారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌లో చేర్చుకోవడం ద్వారా 63గా ఉన్న సంఖ్యను 80 దాటించారని, దీని వెనుక ఉన్న అవినీతి సంగతి ఏమిటని ప్రశ్నించారు. మంగళవారం ఆయన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పార్టీ ఫిరాయింపులు, రాజకీయ అవినీతికి సీఎం తన క్యాంపు కార్యాలయాన్నే వేదికగా చేసుకున్నారన్నారు.


రాజకీయ అవినీతికి అర్థాన్ని, నిర్వచనాన్ని మార్చేశారని, పార్టీకి- ప్రభుత్వానికి మధ్య ఉండే లక్ష్మణరేఖను చెరిపే శారని అన్నారు. కార్పొరేటర్లు, ఎమ్మెల్యేల అవినీతి వ్యవహారాలపై ఆధారాలతో సహా మీడియాలో వస్తున్నా సీఎంకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. మిషన్ భగీరథలో జరిగిన అవినీతి గురించి ఎందుకు మాట్లాడటం లేదన్నారు. అవినీతి కారణాలతోనే ఉప ముఖ్యమంత్రి రాజయ్యను బర్తరఫ్ చేసినట్టుగా సీఎం ప్రకటించారని, అయితే ఇప్పటిదాకా ఆ అవినీతి ఏమిటో, ప్రజా సొమ్ము ఎంత దుర్వినియోగ మయిందో చెప్పలేదన్నారు. రాష్ట్రంలో 1,700 పరిశ్రమలు, 1.20 లక్షల మంది ఉద్యోగాలు వచ్చాయంటున్న సీఎం.. ఆ వివరాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు. కొత్తగా వచ్చిన కంపెనీల పేర్లు, వాటిలో ఉద్యోగాలు పొందిన వారి పేర్లను వెల్లడిస్తూ శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు.


ఎందుకు ఓటెయ్యాలె..?

పచ్చి అబద్ధాలు, అవాస్తవాలతో ప్రజలను మోసం చేస్తున్న టీఆర్‌ఎస్‌కు, కేసీఆర్‌కు 2019లో ఎందుకు ఓటేయాలని లక్ష్మణ్ ప్రశ్నించారు. ‘‘దళితుడిని సీఎం చేస్తానని మోసం చేసినందుకా? దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని మోసం చేసినందుకా?  డబుల్ బెడ్‌రూం ఇళ్లు రెండేళ్లయినా ఇవ్వనందుకా? గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తానని, తాండాలను పంచాయతీలుగా చేస్తానని మోసం చేసినందుకా? ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను పక్కదారి పట్టిస్తున్నందుకా? తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన మజ్లిస్‌ను మిత్రపక్షమంటూ ప్రజలను మోసం చేస్తున్నందుకా? సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవం చేస్తామని అధికారంలోకి రాగానే మజ్లిస్ మెప్పు కోసం మాట తప్పినందుకా? టీఆర్‌ఎస్‌కు ఎందుకు ఓటెయ్యాలె..?’’ అని లక్ష్మణ్ ప్రశ్నించారు. అస్సాం, హరియాణా స్ఫూర్తితో తెలంగాణలోనూ తాము అధికారంలోకి వస్తామన్నారు. బీజేపీకి ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి కేసీఆర్ జీర్ణం చేసుకోలేకపోతున్నారన్నారు.


యువతను మోసగిస్తున్నారు

అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటుతున్నా యువకులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా సీఎం మోసం చేస్తున్నారని లక్ష్మణ్ విమర్శించారు. మంగళవారమిక్కడ బీజేపీ యువమోర్చా రాష్ట్ర పదాధికారులు, జిల్లాల అధ్యక్షుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం కోసం ఎన్నో త్యాగాలు చేసిన యువత ను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top