క్షణికావేశంలో..

క్షణికావేశంలో.. - Sakshi


(వెబ్ ప్రత్యేకం)

టైమ్ కావొస్తుంది. ఇప్పటికే లేట్ అయింది. తొందరగా గమ్యం చేరుకోవాలనుకుంటే విపరీతమైన ట్రాఫిక్. అడ్డదిడ్డంగా వెళుతున్న వాహన శ్రేణుల సందుల్లోంచి తొందరగా వెళ్లాలన్న తాపత్రయం. హైదరాబాద్ నగరంలో పెరిగిన వాహనాలతో ట్రాఫిక్ సమస్య నానాటికి తీవ్రమవుతోంది. తొందరగా వెళ్లాలనుకునే వాళ్లకు నరకం చూపిస్తున్న రోడ్లు వాహన దారుడిని మరింత తొందరపెడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇంట్లో నుంచో ఆఫీసు నుంచో అర్జెంట్ పనిమీద రోడ్డెక్కిన ప్రతి వాహన దారుడిదీ ఇదే సమస్య.



ఆఫీసుకు వెళ్లాలన్నా... ఆస్పత్రికి వెళ్లాలన్నా... కాలేజీకి వెళ్లాలన్నా... కిరాణా కొట్టుకెళ్లాలన్నా... అన్ని సందర్భాల్లోనూ ఇదే పరిస్థితి. చెప్పలేని నరకం. ఆ పరిస్థితి చూసి తనలో తనకే చెప్పలేనంత కోపం. దానికి తోడు అడ్డదిడ్డంగా వెళుతున్న వాహన శ్రేణి వల్ల మరింత ఆవేశం. ఇరుకైన రోడ్లు.  చెవులు చిల్లులు పడేంతగా హారన్ల జోరు. అడుగడుగునా సిగ్నల్. సిగ్నల్ పడిందంటే... అడ్డదిడ్డంగా తోసుకొచ్చే వాహనాలు. ఒక వాహనం ఇంకో వాహనాన్ని రాసుకుంటూ వెళ్లడం. ఒక్కో అడుగు ముందుకు పడుతున్నట్టు లేదా ఒకరిపై ఇంకొకరు తోసుకుంటున్నట్టు... ఎంతో బలవంతంగా కదులుతున్న ట్రాఫిక్. ఇలాంటి పరిస్థితుల్లో ఏదైనా అర్జెంట్ పనుంటే ఇంతే సంగతులు.



నగరంలో ప్రతి వాహన దారుడిదీ ఇదే పరిస్థితి. దాంతో ఎక్కడాలేని చికాకు. ఆవేశం. అత్యవసర పనులమీద వెళ్లాలనుకునే వారిలో ఉండే కోపం ఇక చెప్పక్కరలేదు. హైదరాబాద్ ఒక్కటే కాదు. దేశంలోని మహానగరాల్లో ఎక్కడ చూసినా ఈ పరిస్థితే.



ముందస్తు ప్లాన్ లేకుండా రోడ్డెక్కితే రోడ్లపై దుమ్ము దూళితో పాటు మిగతా వాహనాల అంతరాయాలతో చికూచింత మరింత పెరుగుతుంది. ఒక్కోసారి ఒకరినొకరు దూషించుకుంటూ వాహనదారు ఆవేశంతో ఊగిపోతున్న దృశ్యాలు  ప్రతి రోడ్డులోనూ కనిపిస్తాయి. పరస్పరం బీపీలు పెంచుకుని కొట్టుకుని పోలీస్ స్టేషన్ల వరకు వెళ్లిన అనేక సందర్భాలు చూస్తుంటాం.



ఆటో, కారు, టు వీలర్, బస్సు, లారీ... ఎవరైనా సరే. ఇలాంటి సందర్భాల్లోనే వాహన దారులకు ఓపిక, సహనం ఎంతో అవసరం. క్షణికావేశానికి వెళ్లడం వల్ల అనవసరమైన అనేక ఇబ్బందులను కొని తెచ్చుకుంటున్న సందర్భాలు ఇటీవలి కాలంలో తరచూ సంభవిస్తున్నాయి. తాను వెళ్లాల్సిన రోడ్డు మూల మలుపులో మరో కారు అడ్డంగా నిలిపాడన్న కారణంగా ఇరు వాహనదారుల మధ్య గొడవ ఏ స్థాయికి వెళ్లిందో ఒక్కసారి ఈ కింద ఇచ్చిన వీడియో చూస్తే తెలుస్తుంది.



చిన్న చిన్న సంఘటనలు కూడా ఒక్కోసారి వాహనాలు నడిపే వారి మధ్య కోపతాపాలు తీవ్రస్థాయికి చేరుకుంటున్నాయడానికి ఇటీవల హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 1 లో జరిగిన ఒక సంఘటన ఇది. ప్రధాన మార్గం నుంచి ఒక వాహనదారుడు సందులాంటి మరో రోడ్డులోకి వెళుతున్న దశలో మూల మలుపు వద్ద అడ్డంగా ఆగిఉన్న వాహనం తీవ్ర ఆవేశాన్ని తెప్పించింది.

అంతే... హారన్ కొట్టడం.. అప్పటికి అవతలి నుంచి స్పందన రాకపోయేసరికి ఇంకేం... నోటికి పనిచెప్పాడు. ఇతనేదో అన్నాడని, కారులో ఉన్న వ్యక్తి కిందకు దిగి ఒకరినొకరు దూషించుకోవడం మొదలైంది. అంతటితో ఆగిందా అంటే అదీ లేదు. వారు వెళ్లాల్సిన గమ్యం గురించి మరిచిపోయారు. ఒకరినొకరు తిట్టుకోవడం తీవ్రస్థాయికి చేరుకుంది. ఆవేశకావేశాలతో పరస్పరం ఊగిపోయారు. అంతే ఆవేశంతో ఒక వ్యక్తి పక్కనే ఉన్న పెద్ద బండరాయి ఎత్తి అవతలివాడిపై వేసేందుకు సిద్ధపడ్డాడు. అవతలివాడు తానేం తక్కువ తినలేదన్నట్టు వెంటనే తన కారులోంచి పెద్ద ఇనుప రాడ్ ను బయటకు తీశాడు. నీ అంతు చూస్తా...  అంటూ పైపైకి వచ్చాడు. జనం మాత్రం ఎవరి పనిలో వారున్నట్టు ఏదో వింత సినిమా చూస్తున్నట్టు... సస్పెన్స్ కు ఎలా తెరపడుతుందా అని ఆతృతగా చూస్తున్నారు. ఒకరి చేతిలో ఐదారు కిలోల బరువున్న పెద్ద బండరాయి... మరొకరి చేతిలో ఇనుప రాడ్డు. ఆవేశంగా ఊగిపోయారు. రాడ్డు కింద పడేయ్... అంటుండగా, ఆ వ్యక్తి రాయిని కింద పడేసినప్పటికీ తన వద్ద కత్తి ఉందంటూ ఒరలోంచి కత్తిని బయటకు తీశాడు. ఇంతలో పక్కనే ధైర్యం చేసిన ఒక వ్యక్తి కాస్తా ముందుకొచ్చి జో హోగయా... హోగయా.. భయ్... చలో చలో... అంటూ చల్లార్చే ప్రయత్నం. అంతే.. దాంతో వాళ్లిద్దరు తీవ్రస్థాయి ఆవేశం నుంచి కొంచెం తగ్గి ఆయుధాలను కింద పడేసి కొద్దిసేపు మాటల యుద్దం కొనసాగించి ఎవరి దారిలో వారు వెళ్లిపోయారు.

ఆ సందర్భంలో క్షణికావేశానికి లోనై ఉంటే... పరస్పరం దాడులకు దిగి ఉంటే ఏం జరిగేది. అర్జెంటుగా వెళ్లాల్సిన వ్యక్తులు అసలు పని మరిచిపోయి తమ ఆవేశం నెగ్గడానికి చేసిన ప్రయత్నంలో పెనుగులాటలో జరగరానిది ఏదైనా జరిగితే. నిజానికి ఇలాంటి సంఘటనలు నిత్యం ఎక్కడో ఒకచోట చోటుచేసుకుంటూనే ఉన్నాయి. వాహనదారులు.. ఒక్కసారి ఆలోచించుకోవాలి.
 
ఇక్కడ గమనించాల్సిందేమంటే... ఆ ఒక్క క్షణంలో కనుక ఏదైనా జరగరానిది జరిగి ఉంటే. ఆవేశంలో వాళ్లిద్దరి మధ్య ఉన్న ఆయుధాలు మామూలు ప్రమాదానికి కాదు... ఏకంగా ప్రాణాలమీదకు రావొచ్చు. అందుకే... ఈ మహానగరంలో ప్రయాణం విషయంలో ఒకరినొకరు అర్థం చేసుకుంటూ కాస్త మీకోసం ఇంట్లో ఎదురుచూసే వాళ్లను దృష్టిలో పెట్టుకొని ముందుకు కదలండి.
Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top