‘ఇంటి మనిషి’ వివాహానికి.. సీఎం దంపతులే పెళ్లి పెద్దలు

‘ఇంటి మనిషి’ వివాహానికి.. సీఎం దంపతులే పెళ్లి పెద్దలు - Sakshi


కల్యాణ మండపమైన ‘జనహిత’



సాక్షి, హైదరాబాద్‌: నిత్యం సమావేశాలు, సమీక్షలతో గంభీరంగా ఉండే ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ప్రగతిభవన్‌ ఆదివారం పెళ్లి బాజాలతో కొత్త శోభను సంతరించుకుంది! పచ్చటి తోరణాలు, పసుపు కుంకుమల అలంకరణలతో మంగళమయమైంది. జనహిత పెళ్లి మండపంగా మారింది. ఈ పెళ్లికి స్వయంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు దంపతులే పెళ్లిపెద్దలుగా వ్యవహరించారు. తన వద్ద పనిచేసే వారి ఇళ్లలో జరిగే శుభకార్యాలయాలకు సీఎం హాజరుకావటం కొత్త కాదు. గతంలో ఎందరో ముఖ్యమంత్రులు తమ ఇంటి పనివారు, ఉద్యోగుల ఇంట శుభ కార్యాలయాలకు హాజరై వారింట సంతోషాలను రెట్టింపు చేశారు.



ఇప్పుడు సీఎం కేసీఆర్‌ ఓ అడుగు ముందుకేసి... తన ఇంట పనిచేసే యువకుడికి స్వయంగా క్యాంపు కార్యాలయం ఆవరణలోనే వివాహం జరిపించారు. అంతేకాకుండా సీఎం దంపతులు పెళ్లి తంతు జరుగుతున్న సమయంలో అక్కడే ఉండి పెళ్లి పెద్ద పాత్ర పోషించి ఆకట్టుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరుకు చెందిన కొండేరు సతీశ్‌ చాలాకాలంగా కేసీఆర్‌ ఇంట్లో పనిచేస్తున్నాడు. చిన్నప్పుడే తల్లిని కోల్పోయిన అతను పదేళ్లుగా కేసీఆర్‌ కుటుంబీకుల దగ్గరే ఉంటున్నాడు. ఇటీవలే ఉప్పల్‌కు చెందిన శిరీషతో ఆయనకు వివాహం నిశ్చయమైంది. కుటుంబ సభ్యుల్లో ఒకడిగా మెలిగిన ఆ యువకుడి పెళ్లిని తన ఇంట్లోనే నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. వెంటనే ప్రగతిభవన్‌లోని జనహితలో అందుకు ఏర్పాట్లు సిద్ధమయ్యాయి.



ఆదివారం జనహితను కల్యాణవేదికగా ముస్తాబు చేశారు. ఉదయం పదింటి వేళ వివాహం జరిగింది. ముఖ్యమంత్రి దంపతులు, వారి కూతురు, ఎంపీ కల్వకుంట్ల కవిత సహా పలువురు ప్రజాప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌తోపాటు మరికొందరు అధికారులు హాజరయ్యారు. వధూవరులను ఆశీర్వదించిన ముఖ్యమంత్రి దంపతులు వారి బంధుమిత్రులతో కాసేపు కలివిడిగా గడిపి ఫొటోలు దిగారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top