పిల్లలను ఎత్తుకెళుతున్నారు జాగ్రత్త!

జాహ్నవి


హైదరాబాద్: కుషాయిగూడ నాగార్జున నగర్లో  గురువారం ఉదయం కిడ్నాప్ అయిన  నాలుగేళ్ల బాలిక జాహ్నవి దొరికింది. పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. తల్లిదండ్రులు ఆనందించారు. పోలీసులు, తల్లిదండ్రుల కథనం ప్రకారం ఇద్దరు మహిళలు ఉదయం 11 గంటల ప్రాంతంలో జాహ్నవికి మాయమాటలు చెప్పి తీసుకువెళ్లారు. అంబేద్కర్ నగర్కు సమీపంలోని బాలజీ నగర్కు తీసుకువెళ్లారు. అక్కడ బాలిక చెవికి ఉన్న బంగారు కమ్మలు, మెడలోని బంగారు గొలుసు తీసుకున్నారు. జాహ్నవిని అక్కడే వదిలి పారిపోయారు.



బాలిక ఏడుస్తూ అక్కడే తిరుగుతోంది. రఘు అనే వ్యక్తి ఏడుస్తున్న జాహ్నవి చూసి అప్పిపోయిందని భావించాడు. ఆ బాలికను ఎత్తుకుని దాదాపు రెండు గంటల పాటు చుట్టుపక్కల అంతా తిరిగాడు. బాలిక గురించి విచారించాడు. ఆ బాలిక తెలిసినవారు ఎవరూ కనిపించలేదు. జాహ్నవిని అడిగితే తండ్రి ఫోన్ నెంబర్ చెప్పలేకపోయింది. చివరకు కుషాయిగూడ స్కూల్లో చదువుతున్నట్లు జాహ్నవి చెప్పింది. దాంతో అతను రాత్రి 8 గంటల ప్రాంతంలో కుషాయిగూడ పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి బాలికను అప్పగించాడు.



జాహ్నవిని కిడ్నాప్ చేసిన వెంటనే  తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. ఆ ప్రాంతంలో వాహనాలను తనిఖీ చేయడం మొదలుపెట్టారు.మరోవైపు బాలిక బంధువులు దాదాపు 30 మంది వెతకడం మొదలుపెట్టారు. జాహ్నవి కలర్ ఫొటోలు ప్రింట్ చేయించి అందరికీ ఇస్తూ బాలిక కోసం వెతికారు. చివరకు జాహ్నవిని రఘు పోలీస్ స్టేషన్కు తీసుకురావడంతో కథ సుఖాంతమైంది. తల్లిదండ్రులు, బంధువులు ఆనందానికి అవధులులేవు.



బాలికకు బంగారు వస్తువులు పెట్టడం వల్ల ఆ మహిళలు కిడ్నాప్ చేశారు. పిల్లల ఒంటిపై బంగారు వస్తువులు పెట్టినప్పుడు జాగ్రత్త వహించాలని పోలీసులు సలహా ఇస్తున్నారు. కొందరు మహిళలు బంగారు వస్తువుల కోసం పిల్లలను తీసుకువెళుతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

***

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top