వీడు మామూలోడు కాదు!..

జగదీశా


► సర్వర్‌ మైనింగ్‌ పేరిట రూ.కోట్లలో కుచ్చుటోపీ

► సొంత కరెన్సీ, కాయిన్స్‌ పేరుతో బురిడీ

► పోలీసు కస్టడీలో నిందితుడు




సాక్షి, సిటీబ్యూరో:
మల్టీ లెవల్‌ మార్కెటింగ్‌ పేరుతో ఎంతో మంది అమాయకుల నుంచి రూ.లక్షల్లో దండుకున్న ఘరానా ఆన్‌లైన్‌ మోసగాడు... బెంగళూరుకు చెందిన బీఎం జగదీశా లీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ట్రాన్సిట్‌ వారెంట్‌పై నిందితుడిని బెంగళూరు నుంచి నగరానికి తీసుకువచ్చారు. మియాపూర్‌ కోర్టులో హాజరుపరిచిన అనంతరం కస్టడీలోకి తీసుకొని నిందితుడి మోసాలపై ఆరా తీస్తున్నారు.



జర్మనీ కేంద్రంగా పని చేస్తున్నట్టుగా రిజిస్ట్రేషన్‌ చేసిన డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.3జీకాయిన్‌.ఈయూ, ఇంగ్లండ్‌ చిరునామాతో 3జీ మైనింగ్‌ టెక్‌ లిమిటెడ్‌ల మార్కెటింగ్‌కు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.3జీకాయిన్‌.గోల్డ్‌ పేరుతో మరో వెబ్‌సైట్‌ను ప్రారంభించాడు. తన గర్ల్ ఫ్రెండ్ భర్త, తమిళనాడుకు చెందిన కె.నాగరాజన్‌ పేరుతో ఈ వెబ్‌సైట్‌లను ప్రారంభించాడు. మరో ట్విస్ట్‌ ఏంటంటే కె.నాగరాజన్‌ గత ఏడాది జనవరిలో చనిపోయాడు. దీంతో అతడి ఆధార్‌ కార్డు, బ్యాంక్‌ ఖాతాలు, పాన్‌ కార్డు నంబర్లను వినియోగించి సర్వర్‌ మైనింగ్‌కు తెరలేపాడు. దీని ద్వారా వచ్చే డేటాను గిగా బైట్స్‌గా మార్చి ఇస్తే మీకు ఒక గ్రాము క్రిష్ణో కరెన్సీ వస్తుందని... దీని విలువ నాలుగు యూరోలని వెబ్‌సైట్‌లో ప్రకటన ఇచ్చాడు.



కుషాయిగూడకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ రూ.18 లక్షలు పెట్టుబడి పెట్టాడు. నెలవారీ రిటర్న్స్‌ ఆ కంపెనీ ఇవ్వకపోవడంతో వెబ్‌సైట్‌లోని చిరునామా ఆధారంగా బెంగళూరు కార్యాలయాన్ని సంప్రదించాడు. ఎంతకీ సమాధానం రాకపోవడంతో మోసపోయానని తెలుసుకొని సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు బెంగళూరు వెళ్లి జగదీశాను అరెస్టు చేశారు.


మోసం చేసేదిలా...



‘మా సంస్థ నిర్వహిస్తున్న సర్వర్‌ మైనింగ్‌ డేటా ప్రాజెక్టులను తీసుకుంటే... రెండేళ్లలో మీ పెట్టుబడికి 180 శాతం అధిక ఆదాయం వస్తుంద’ని నమ్మిస్తాడు. దీని కోసం కంపెనీ ఇచ్చే సర్వర్‌ మైనింగ్‌ డేటాను అల్గారిథమ్‌ ప్రక్రియలో క్రిష్ణోగ్రఫీ, బార్‌కోడ్‌లను కిలోబైట్స్, మెగాబైట్స్, గిగా బైట్స్‌లుగా మార్చి డేటాను రూపొందించాలి. ఒక గిగాబైట్‌ డేటాను తయారు చేస్తే ఒక గ్రాము క్రిష్ణో కరెన్సీని ఇస్తామని చెబుతాడు. దీని విలువ నాలుగు మూరోలకు సమానమని చెబుతాడు. దీని కోసం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.3జీకాయిన్‌.గోల్డ్‌లో 3జీ కాయిన్‌ ఖాతా తెరవాలంటే తొమ్మిది స్టెప్పుల్లో వివరాలు నింపాలి.



బ్యాంక్‌ ఖాతా, పాన్‌ నంబర్, అడ్రస్‌ ప్రూఫ్‌ డాక్యుమెంట్లు  పూర్తి చేయాలి. వెబ్‌సైట్‌లో ఇవన్నీ తనిఖీ చేసిన తర్వాత దరఖాస్తుదారుడి అడ్మినిస్ట్రేటర్‌ ఈ–మెయిల్‌కి ఓ ఐడీ నంబర్‌ పంపించేవాడు. రిజిస్ట్రేషన్‌ చార్జీల కింద 30 యూరోలకు సమానమైన భారత కరెన్సీని  3జీ కాయిన్‌ఐఎన్‌సీ పేరిట రూ.2,250 డిపాజిట్‌ చేయమనే వాడు. ఇలా ఒక్కో క్రిష్ణో కాయిన్‌పై 30 యూరోలను డిపాజిట్‌ చేసి సర్వర్‌ మైనింగ్‌ పొందితే రెండేళ్లలో 128 క్రిష్టో కాయిన్స్‌ పొందవచ్చని చెప్పేవాడు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top