ఎంపీ రాయపాటి ఆరోపణలపై సీఎం విచారణ జరిపించాలి

ఎంపీ రాయపాటి ఆరోపణలపై  సీఎం విచారణ జరిపించాలి

- ముఖ్యమంత్రికి మాజీ సీఎస్‌ ఐవైఆర్‌ కృష్ణారావు విజ్ఞప్తి

దొనకొండలో నాకు సెంటు భూమి లేదు

గట్టిగా అడక్కపోతే మేనిఫెస్టోలో హామీలు అమలు చేయరు

 

సాక్షి, హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తనపై చేసిన ఆరోపణలపై విచారణ జరిపించాలని మాజీ సీఎస్, బ్రాహ్మణ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ ఐవైఆర్‌ కృష్ణారావు ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. హైదరాబాద్‌లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రకాశం జిల్లా దొనకొండలో తనకు సెంటు భూమి కూడా లేదని స్పష్టం చేశారు. దొనకొండలో వేల ఎకరాలు కొన్నారని, అక్కడ రాజధాని ఏర్పాటు చేయాలన్న విజ్ఞప్తిని సీఎం చంద్రబాబు తిరస్కరించినందునే ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేస్తున్నారని గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు తనపై చేసిన ఆరోపణలను ఐవైఆర్‌ తీవ్రంగా తప్పుబట్టారు. వివిధ అంశాలపై ఐవైఆర్‌ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే...

 

జిల్లాలో ఒక్కసెంటు కూడా లేదు..

నాకు దొనకొండలోనే కాదు. నా సొంత జిల్లా ప్రకాశంలో ఒక్క సెంటు భూమి కూడా లేదు. ఒక అబద్ధాన్ని వందసార్లు చెప్పించడం ద్వారా నిజమనిపించే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈరోజు ఒకరు ఆరోపిస్తారు. రేపు ఒక పేపర్‌లో రాస్తారు. మరో రోజు ఫేస్‌బుక్‌లో పెడతారు. ఆయన స్పందించలేదు కదా. ఇది నిజమేననిపిస్తారు. అందువల్లే నేను స్పందిస్తున్నాను. ఎంపీ ఆరోపణలపై విచారణ చేపట్టి నిజాలుంటే నాపై చర్యలు తీసుకోవాలని సీఎంకు విన్నవిస్తున్నా. గట్టిగా అడగకపోతే ఎన్నికల మేనిఫెస్టోలోని వాగ్దానాలు నెరవేర్చరు. ముద్రగడ పద్మనాభం గట్టిగా అడగబట్టే కాపు కార్పొరేషన్‌కు నిధులిచ్చారు. బ్రాహ్మణ సంక్షేమానికి కూడా మేనిఫెస్టోలో చెప్పిన మాదిరిగా రూ. 500 కోట్లు కేటాయించాలి.

 

అది ప్రభుత్వ అనుబంధ సొసైటీ...

బ్రాహ్మణ కో ఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీ ప్రైవేట్‌ సంస్థ అని, దానికి నేను నిధులు మళ్లించానని ఆర్థిక శాఖ మంత్రి యనమల ఆరోపించారు. సహకార సంస్థల చట్టం కింద రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వు ద్వారా ఏర్పాటైన ప్రభుత్వ అనుబంధ సంస్థ అది. దానిని ప్రైవేట్‌ సంస్థ అనడం తప్పు. దీనిపై ఆర్థిక మంత్రి స్పష్టత ఇవ్వాలి. ఇక సొసైటీ సీఈవో నాకు బంధువంటూ అభియోగాలు మోపారు. అది తప్పు. 

 

విశాఖలో ప్రభుత్వ భూముల రద్దు తప్పు..

విశాఖపట్నంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు ఇచ్చిన 35 ఎకరాలను రద్దు చేసి ప్రైవేటు సంస్థకు ఇవ్వాలనే ప్రయత్నాలు భూ కేటాయింపుల చట్టంలోని మార్గదర్శకాలకు పూర్తి విరుద్ధం. ప్రభుత్వ భూమి కేటాయింపులో మొదటి ప్రాధాన్యం ప్రభుత్వ సంస్థలకు, రెండో ప్రాధాన్యం ప్రభుత్వరంగ సంస్థలకు ఇవ్వాలి. తర్వాతే ప్రైవేటు వ్యక్తులు, సంస్థలను పరిగణనలోకి తీసుకోవాలి. ప్రభుత్వ సంస్థలకు ఇచ్చిన భూ కేటాయింపులు రద్దు చేసి ప్రైవేటు సంస్థకు ఇస్తే పెద్ద తప్పవుతుంది. 
Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top