ఎన్ని గంటలన్నది ముఖ్యం కాదు!

ఎన్ని గంటలన్నది ముఖ్యం కాదు! - Sakshi


మోదీ పర్యటనపై కేంద్ర మంత్రి దత్తాత్రేయ

 

 సాక్షి, హైదరాబాద్ : ప్రధానిగా తొలి సారి తెలంగాణకు వస్తున్న  నరేంద్ర మోదీ రాష్ట్రంలో ఎన్ని గంటలు పర్యటిస్తున్నారన్నది ముఖ్యం కాదని, ఎన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తున్నారన్నదే ముఖ్యమని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. ఒకే పర్యటనలో ఐదు భారీ కార్యక్రమాలకు ప్రధాని శ్రీకారం చుట్టనుండటం తెలంగాణ రాష్ట్రాభివృద్ధి పట్ల కేంద్రానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. వచ్చే నెల 7న రాష్ట్ర పర్యటనలో భాగంగా మోదీ పాల్గొనే కార్యక్రమాల వివరాలను శనివారం దత్తాత్రేయ విలేకరులకు వెల్లడించారు. వచ్చే నెల 7న మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో మోదీ గజ్వేల్‌లో జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని, సాయంత్రం 5 గంటలకు ఎల్బీ స్టేడియంలో జరిగే బూత్ స్థాయి బీజేపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారని తెలిపారు.



ఎన్టీపీసీ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా రామగుండంలో రూ.10 వేల కోట్ల వ్యయంతో చేపట్టే 1,600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణానికి ప్రధాని శంకుస్థాపన చేస్తారాన్నరు. పెండింగ్‌లో ఉన్న మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వే లైను పనులకు కూడా ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారన్నారు. అలాగే గతంలో మూతబడిన రామగుండం ఎరువుల కర్మాగారాన్ని రూ.6 వేల కోట్ల వ్యయంతో పునరుద్ధరించే పనులను సైతం ప్రధాని ప్రారంభిస్తారన్నారు. వీటితో పాటు వరంగల్‌లో 300 ఎకరాల్లో నిర్మించ తలపెట్టిన రెడీమేడ్ వస్త్రాల టెక్స్‌టైల్ పార్కు పనులకు శంకుస్థాపనతో పాటు మిషన్ భగీరథ తొలి దశ ప్రారంభోత్సవం, ఆదిలాబాద్ జిల్లా జైపూర్‌లో నిర్మించిన 1,200 మెగావాట్ల సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ప్రధాని మోదీ ప్రారంభిస్తారన్నారు. మెదక్ జిల్లా గజ్వేల్‌లోనే రిమోట్ ద్వారా పైన పేర్కొన్న ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలను ప్రధాని చేస్తారన్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top