కొత్త రైళ్లు ఇవ్వరు...కొత్త లైన్లు వేయరు!

కొత్త రైళ్లు ఇవ్వరు...కొత్త లైన్లు వేయరు! - Sakshi


♦ వచ్చే రైల్వే బడ్జెట్‌లో రాష్ట్రానికి నిరాశే

♦ మన ఎంపీలకు సంకేతాలిచ్చిన రైల్వే మంత్రి

♦ పాత ప్రాజెక్టులకూ కేటాయింపులు కష్టమే

♦ దాదాపు ఆశలు వదులుకున్న రాష్ట్రప్రభుత్వం

 

 సాక్షి, హైదరాబాద్: కోటి ఆశలు పెట్టుకున్న రైల్వే బడ్జెట్ నిరాశ కూతను వినిపిస్తోంది. కొత్తగా ఏర్పాటైన రాష్ట్రం కావడంతో ఇక్కడి అవసరాలపై రాష్ట్రం పక్షాన ప్రజాప్రతినిధులు చేసిన విన్నపాలు ఈసారి బుట్టదాఖలయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ట్రిప్లింగ్, డబ్లింగ్ లాంటి ప్రాజెక్టుల సంగతి అటుంచితే కనీసం కొత్త రైళ్లు కూడా వచ్చే అవకాశం కనిపించట్లేదు. ఈమేరకు రైల్వే శాఖ మంత్రి సురేశ్‌ప్రభు స్వయంగా మన ఎంపీలకు పరోక్ష సంకేతాలిచ్చారు. ఆయా రాష్ట్రాల ప్రయోజనాలు, ఎంపీలు అందజేసే ప్రతిపాదనలకు తగ్గట్టుగా నిధులు కేటాయించే స్థితిలో ప్రస్తుతం రైల్వే శాఖ లేనందున ప్రతిపాదనలకు మోక్షం వస్తుందని ఆశించొద్దని తేల్చిచెప్పారు.



వెరసి కొత్త ప్రాజెక్టుల మంజూరు ఈసారి ఉండదని పేర్కొన్నారు. ఇప్పటికే గరిష్ట సామర్థ్యాన్ని మించి రైల్వే లైన్లను వినియోగిస్తున్నందున వాటిపై మరిన్ని కొత్త రైళ్లను నడపడమంటే భారాన్ని పెంచడమేనని, ఇది ప్రయాణికుల భద్రతను ప్రమాదంలోకి నెట్టేసినట్టే అవుతుందని ఆయన చేసిన వ్యాఖ్యలు కొత్త రైళ్లు ఉండవనే సంకేతాలిస్తున్నాయి. ఇటీవల ఢిల్లీలో మన ఎంపీలు ఆయనను కలిసినప్పుడు ఈ తరహా వ్యాఖ్యలు చేసి తిప్పపంపారు. ఇదే విషయాన్ని వారు సీఎం కేసీఆర్ దృష్టికీ తీసుకెళ్లారు. వచ్చే రైల్వే బడ్జెట్‌పై రాష్ట్ర ప్రభుత్వం దాదాపు ఆశలు వదిలేసుకుంది.



 ప్రాజెక్టులకు నిధుల్లేవు... కొత్త రైళ్లకు లైన్లు లేవు

 ‘అభివృద్ధి చెందిన దేశాల్లో రైల్వే కొత్త పుంతలు తొక్కుతుంటే మనం పాత పద్ధతులతో కుదేలవుతున్నందున దేశవ్యాప్తంగా రైల్వేను ఆధునీకరించాల్సి ఉంది. ఇందుకు భారీగా నిధులు అవసరం. వాటిని ఇప్పుడు సమకూర్చలేం. దీనికోసం ప్రత్యేక ప్రణాళిక అవసరం. ఆ లక్ష్యం సాధించాలంటే దేశం మొత్తాన్ని ఒక యూనిట్‌గా చూడాలి తప్ప ఆయా రాష్ట్రాల ప్రయోజనాలకు రైల్వే బడ్జెట్‌ను పరిమితం చేయొద్దు’ అని సురేశ్‌ప్రభు మన ఎంపీలతో వ్యాఖ్యానించారు. రైల్వే స్టేషన్‌ల ఆధునీకరణ, హైస్పీడ్ రైళ్లను అందుబాటులోకి తేవడం తదితర కీలక ప్రాజెక్టులపై ఆలోచనలు చేస్తున్నందున వ్యక్తిగత డిమాండ్లను పరిష్కరించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు.



ఇక చిన్నచిన్న పనులపై ఆశలు పెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. కాజీపేటలో వ్యాగన్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ... అన్ని ప్రాజెక్టులను పీపీపీ పద్ధతిలో నిర్మించాలనే యోచనలో భాగంగా దాన్ని పక్కనపెట్టేశారు. దానిస్థానంలో వ్యాగన్ వర్క్‌షాపును ప్రకటించే అవకాశం ఉంది. అత్యంత కీలకమైన బల్లార్షా-విజయవాడ ట్రిప్లింగ్ పనులకు తప్ప పెద్దగా వేటికీ నిధులు కేటాయించే అవకాశం కనిపించట్లేదు. ఇప్పటికే దాదాపు పది వరకు డబ్లింగ్ పనులు నిధుల కోసం ఎదురుచూస్తున్నాయి. వాటిని ఈసారి కూడా పక్కనపెట్టే అవకాశం ఉంది. కరీంనగర్ (పెద్దపల్లి)- సికింద్రాబాద్ (మనోహరాబాద్) కొత్త రైల్వే లైన్‌కు సర్వే పనులు పూర్తి కానందున ఈ బడ్జెట్‌లో పెద్దగా నిధులొచ్చే అవకాశం కనిపించట్లేదు.

 

 యాదాద్రి ఎంఎంటీఎస్‌కు అనుమతి ఇచ్చే అవకాశం

  హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ లైన్ నిర్మాణానికి అనుమతులు వచ్చే అవకాశం ఉంది. మూడొంతుల ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరించనున్నందున దానికి బడ్జెట్‌లో చోటు దక్కొచ్చు. బీబీనగర్-నడికుడి రెండో లైన్‌కూ గ్రీన్‌సిగ్నల్ వస్తుందని చెబుతున్నారు. బీబీనగర్ స్టేషన్ వద్ద డ్రై పోర్టు నిర్మాణం అవసరమనే ప్రతిపాదనను రైల్వే మంత్రి పరిశీలిస్తున్నారు. దానివల్ల రైల్వేకు భారీ ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఇక హైదరాబాద్- ఏపీ రాజధాని అమరావతి మధ్య హైస్పీడు రైలు మార్గం నిర్మించాలనే రెండు రాష్ట్రాల డిమాండుకూ ఆయన సానుకూలంగా ఉండే అవకాశం ఉంది. దీని నిర్మాణంలో రెండు రాష్ట్రాలతోపాటు ప్రైవేటు సంస్థలు ఆసక్తి చూపుతున్నందున రైల్వేపై పెద్దగా భారం పడకపోవడమే కారణం. ఇవి కాకుండా ఒకట్రెండు చిన్నాచితక ప్రాజెక్టులు తప్ప పెద్దగా నిధులు వచ్చే అవకాశం లేదని ఎంపీలు తేల్చేశారు. ఒకటీ అరా మినహా కొత్త రైళ్ల ఊసూ ఉండదంటున్నారు.

Election 2024

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top