రాష్ట్రంలో ప్రతి ఎకరాకు సాగునీరు!

రాష్ట్రంలో ప్రతి ఎకరాకు సాగునీరు!


* 1.20 కోట్ల ఎకరాలకు ఐదేళ్లలో నీరిచ్చేలా రాష్ట్ర సాగునీటి శాఖ ప్రణాళిక

* ఏఐబీపీ కింద రూ.7,099 కోట్లు, హర్ ఖేత్ కో పానీ కింద రూ.8వేల కోట్లు

* కేంద్రం నుంచి కోరాలని నిర్ణయం


సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సాగుకు యోగ్యమైన ప్రతీ ఎకరా భూమికి నీటిని అందించేలా రాష్ట్ర సాగునీటి ప్రణాళిక సిద్ధమైంది. మొత్తంగా 1.20 కోట్ల ఎకరాల భూమికి వివిధ పద్ధతుల్లో పూర్తి స్థాయిలో సాగునీరందించేలా కార్యాచరణను తయారు చేశారు. ప్రధానమంత్రి కృషి సించాయి యోజన (పీఎంకేఎస్‌వై) లో భాగంగా కేంద్రం తీసుకొచ్చిన ‘హర్ ఖేత్ కో పానీ’, ‘పర్ డ్రాప్-మోర్ క్రాప్’, వాటర్‌షెడ్ డెవలప్‌మెంట్, గ్రామీణ ఉపాధి హామీ పథకం, సత్వర సాగునీటి ప్రాయోజిత కార్యక్రమం (ఏఐబీపీ) పథకాలను ఉపయోగించుకొని, వాటికింద ఇచ్చే నిధులను రాబట్టుకునేందుకు వీలుగా రాష్ట్ర వ్యవసాయ శాఖ, నీటి పారుదల శాఖ, గ్రామీణాభివధ్ధి శాఖలు కలిసి సంయుక్తంగా జిల్లాల వారీ ప్రణాళికలను సిద్ధం చేశాయి.



వీటికి రాష్ట్ర స్టాండింగ్ కమిటీ ఆమోదముద్ర వేయగా, ఒకట్రెండు రోజుల్లో ఈ నివేదికను  కేంద్రానికి పంపనున్నారు. కొత్తగా చేపట్టిన పీఎంకేఎస్‌వై కింద ‘ప్రతి సాగుభూమికి నీరు’ పథకంలో భాగంగా రాష్ట్ర సమగ్ర సాగునీటి ప్రణాళికను సిద్ధం చేయాలని గతంలోనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆదేశించింది. దేశ వ్యాప్తంగా ఎక్కువగా బోర్లు, బావుల కిందే వ్యవసాయ భూమి సాగులో ఉండగా, భూగర్భ జలాలు తగ్గడంతో పంటల విస్తీర్ణం తగ్గి ఉత్పాదకత పడిపోతోంది. ఈ దృష్ట్యా పీఎంకేఎస్‌వై పథకాన్ని తెరపైకి తెచ్చిన కేంద్రం.. సాగు భూమి విస్తీ ర్ణం పెంచాలని నిర్ణయం తీసుకుంది. రానున్న ఐదేళ్లలో దీనికోసం రూ.50 వేల కోట్ల మేర నిధులు కేటాయించేందుకు సిద్ధమని ప్రకటిం చింది.



ఈ నేపథ్యంలో కేంద్రం మార్గదర్శకాల కు అనుగుణంగా జిల్లాల్లో సాగు యోగ్యమైన భూ విస్తీర్ణం ఎంత, ఇప్పటికే జరుగుతున్న సాగు విస్తీర్ణం ఎంత, ఇందులో బోర్లు, బావు లు, భారీ, మధ్య, చిన్నతరహా ప్రాజెక్టుల కింద సాగు జరుగుతున్న ఆయకట్టు ఎంత, మిగతా ప్రాంతాన్ని సాగులోకి తెచ్చేందుకు ఎలాంటి కార్యాచరణ అమలు చేయాలన్న దానిపై రాష్ట్ర నీటి పారుదల శాఖ కసరత్తు పూర్తి చేసి నివేదిక తయారు చేసింది. 1.20 కోట్ల ఎకరాలకు సాగునీటిని అందించేలా కార్యాచరణ పూర్తి చేసింది. దీనికోసం ఏఐబీపీ కింద చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణాల పూర్తికి రూ.7.099 కోట్లు, హర్ ఖేత్ కో పానీ పథకం కింద రూ.8 వేల కోట్లు కేటాయించాల్సిందిగా కేంద్రాన్ని కోరేందుకు నిర్ణయించింది. ఇందు లో రూ.5వేల కోట్లను మిషన్ కాకతీయ పనులకు ఖర్చు చేయనున్నారని తెలిసింది.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top