కొత్తకొత్తగా...


సాక్షి, సిటీబ్యూరో: స్లమ్‌ఫ్రీ సిటీలో భాగంగా నగరంలోని మురికివాడల స్థానే అందమైన కాలనీల నిర్మాణానికి సిద్ధమవుతున్న ప్రభుత్వం... వీటిని త్వరగా పూర్తి చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ప్రీ ఫ్యాబ్రికేటెడ్ ఇళ్లపై దృష్టి పెట్టింది. ఇప్పటికే సనత్‌నగర్ నియోజకవర్గంలోని ఐడీహెచ్ కాలనీలో డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి.


మరోవైపు సంప్రదాయ పద్ధతిలో కంటే ప్రీ ఫ్యాబ్రికేటెడ్ విధానంలో ఇళ్ల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయగలమని జీహెచ్‌ఎంసీ అధికారులు భావిస్తున్నారు. నిర్మాణ వ్యయం కొంత అధికమైనప్పటికీ, పనులు తొందరగా పూర్తవు తాయని... సమయం కలిసి వస్తుందని అంటున్నారు. స్లమ్‌ఫ్రీ సిటీలో భాగంగా తొలిదశలో మరో 12 బస్తీల్లో ఇళ్లు నిర్మించాలని యోచిస్తున్నారు. అందులో ఇప్పటికే 8 బస్తీలను ఎంపిక చేసినట్లు తెలిసింది.

 

రూ.500 కోట్లతో పనులు

ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కింద ప్రస్తుత, కొత్త ఆర్థిక సంవత్సరాలకు జీహెచ్‌ఎంసీకి ప్రభుత్వం రూ.250 కోట్ల వంతున (మొత్తం రూ.500 కోట్లు) మంజూరు చేసింది. ఈ నిధులతో పేదలకు డబుల్ బెడ్‌రూమ్, డబుల్ టాయ్‌లెట్, హాల్, కిచెన్‌లతో కూడిన ఇళ్లను  నిర్మిస్తామని జీహెచ్‌ఎంసీ కమిషనర్, స్పెషలాఫీసర్ సోమేశ్‌కుమార్ తెలిపారు. వీటితో పాటేరహదారులు, పార్కులు, షాపింగ్‌కాంప్లెక్స్‌లు, కమ్యూనిటీ హాళ్లు, ఆటస్థలాల వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. తొలి దశలో 12 బస్తీల్లో ప్రీ ఫ్యాబ్రికేటెడ్ విధానంలో ఇళ్లు నిర్మించాలని యోచిస్తున్నారు. కూకట్‌పల్లిలోని అమ్రునగర్ తండాలో ప్రయోగాత్మకంగా తొలి ప్రీ ఫ్యాబ్రికేటెడ్ ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నారు.

 

తొలి ప్రాధాన్యం వారికే...

ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు కావడంతో ఆ వర్గాలు అధిక సంఖ్యలో ఉన్న బస్తీలను ఎంపిక చేశారు. ఒక్కో ఇంటికి దాదాపు రూ. 6 లక్షలు ఖర్చు కాగలదని తొలుత అంచనా వేశారు. రహదారులు, పార్కులు, తాగునీటి సరఫరా, విద్యుత్ తదితర మౌలిక సదుపాయాలతో కలిపి ఐడీహెచ్ కాలనీలో ఒక్కో ఇంటికి ప్రస్తుతం రూ.9.20 లక్షల వంతున ఖర్చవుతోంది. దీని కంటే వ్యయం కాస్త అధికమైనా సమయం, నాణ్యత ఉంటాయని ప్రీ ఫ్యాబ్రికేటెడ్ వైపు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం.

 

ఆకట్టుకునేలా...

తొలి దశలో నిర్మించే ఈ ఇళ్లను చూసి మిగతా బస్తీల్లోని ప్రజలు ఆసక్తి చూపేలా నిర్మాణం... సదుపాయాలు ఉండాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్, స్పెషలాఫీసర్ సోమేశ్ కుమార్ భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఇళ్ల నిర్మాణం చేపట్టే చోట స్థానికులను ఒప్పించేందుకు అధికారులు తిప్పలు పడాల్సి వస్తోంది. తక్కువ విస్తీర్ణం, సదుపాయాలు లేనప్పటికీ... తమకు ప్రత్యేకంగా ఉండాలని... అపార్ట్‌మెం ట్లు వద్దని ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.


తొలిదశ ఇళ్లను చూసిన తరువాత  వారి అభిప్రాయం లో మార్పు రావచ్చని అధికారులు ఆశిస్తున్నారు. తద్వారా మిగతా ప్రాంతాల వారు ఇలాంటి ఇళ్ల నిర్మాణానికి అంగీకరించవచ్చని భావిస్తున్నారు.

 

తొలిదశలో ఎంపిక చేసిన బస్తీలు... కుటుంబాలు... సామాజికవర్గాల వివరాలు

 

 సర్కిల్        బస్తీ                          ఎస్సీలు    ఎస్టీలు    బీసీలు    మైనార్టీలు    జనరల్    మొత్తం

 కాప్రా            సింగం చెరువు                   1        58           0             0               1          60

 చార్మినార్-4    జంగమ్మెట్                      110        8           0             0            199         317

 చార్మినార్-5    గోడేకి ఖబర్                     162        1           0             0              10        173

 చార్మినార్-5    స్వామి వివేకానంద నగర్     235        279        0              0              24        538

 చార్మినార్-5    పార్థివాడ                           7        150        0               0               0        157

 అబిడ్స్-9    లంబాడీతండా                         1          85        0               0             4           90

 ఖైరతాబాద్-10    అంబేద్కర్ నగర్               62           6        27              2             1           98

 కూకట్‌పల్లి-14    అమ్రునగర్ తండా               0        155        0                0              0        155

 మొత్తం                                             578        742        27              2           239       1588

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top