దొనకొండలో పారిశ్రామిక పార్కు

దొనకొండలో పారిశ్రామిక పార్కు - Sakshi


- రూ.43 వేల కోట్లతో ఏర్పాటు..మూడు దశల్లో పూర్తి

- చైనాతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం

- కృష్ణపట్నంలో ఎరువుల కర్మాగారం

 

 సాక్షి, హైదరాబాద్: ప్రకాశం జిల్లా దొనకొండలో రూ.43,120 కోట్లతో అంతర్జాతీయ పారిశ్రామిక పార్కు ఏర్పాటు కానుంది. ఈ మేరకు చైనాలో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందాలు జరిగాయి. చైనా అసోసియేషన్ ఆఫ్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ ప్రెన్యూర్స్, చైనా స్మాల్ అండ్ మీడియం ఎంటర్ ప్రైజెస్ గ్రూప్(బీజింగ్)తో రాష్ట్ర ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డ్, పరిశ్రమలు, వాణిజ్య శాఖ ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఏపీ ప్రభుత్వ సమాచార సలహాదారు కార్యాలయం సోమవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ పారిశ్రామిక పార్కును మూడు దశల్లో పూర్తి చేస్తారు. కృష్ణ పట్నం వద్ద గ్యాస్ ఆధారిత ఎరువుల కర్మాగారం ఏర్పాటుకు చైనా హాంక్యూ కాంట్రాక్టింగ్ అండ్ ఇంజనీరింగ్ కార్పొరేషన్, ఇసోమెరిక్ హోల్డింగ్స్, ఎల్‌ఈపీఎల్ వెంచర్స్‌ప్రైవేట్ లిమిటెడ్‌లతోనూ ఒప్పందం కుదిరింది. 2017-18లో నిర్మాణమయ్యే ఈ ప్రాజెక్టుకు రూ.10,183 కోట్ల వ్యయం అవుతుంది. కాగా, ప్రపంచ ఆర్థిక వేదికలో సీఎం  ప్రసంగం చేశారు.



 పెట్టుబడులపై పలు కంపెనీల హామీలు

 కాగా, చైనా పర్యటన రెండో రోజు సీఎం చంద్రబాబుతో వివిధ కంపెనీల ప్రతినిధులు భేటీ అయ్యారు. జెట్రో అధ్యక్షుడు యాసుషి అకాహోషితో  సమావేశమైన సీఎం రాష్ర్టంలో పెట్టుబడుల అవకాశాలను వివరించారు. విశాఖ, కృష్ణపట్నం ఓడరేవులను కార్గోహబ్‌లుగా ఏర్పరచడంపై యునెటైడ్ పార్శిల్ సర్వీస్ గ్రూప్ వ్యూహాత్మక అధ్యక్షుడు జాన్ విల్లెం బ్రిన్‌తో చర్చించారు. విజయవాడ, విశాఖ, తిరుపతి నగరాలకు విమానాలను నడిపేందుకు ఎతిహాద్ విమానయాన సంస్థ ఉపాధ్యక్షుడు విజయ్ పూనోసామి అంగీకరించారు. 200 మెగావాట్ల విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు స్పెయిన్ సంస్థ ఆక్సియోనా ఎనర్జీ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇంధన రంగం ఆధునికీకరణకు సహకరిస్తామని టోటల్ ఎస్‌ఏ కంపెనీ ఉపాధ్యక్షుడు జీరోమ్‌స్మిట్, మెగా కోల్డ్ చెయిన్ ప్రాజెక్టుల ఏర్పాటుకు డాన్ఫోస్ గ్రూప్ సంస్థ  చైర్మన్ మాడ్స్ క్లాసన్ హామీనిచ్చారు. మోడ్రన్ ఎలక్ట్రాన్ సంస్థ సహవ్యవస్థాపకుడు టోనీపాన్, చైనా ప్రభుత్వ సంస్థ ఎస్‌ఏఎస్‌ఏసీ ప్రతినిధులతోనూ సీఎం భేటీ అయ్యారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top