కోళ్ల పరిశ్రమకు ప్రోత్సాహకాలు

కోళ్ల పరిశ్రమకు ప్రోత్సాహకాలు - Sakshi


ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడి

పౌల్ట్రీ ఎక్స్‌పో-2014ను ప్రారంభించిన సీఎం


సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కోళ్ల పరిశ్రమకు అన్ని విధాలా ప్రోత్సాహకాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. భూమి సహా ఎలాంటి సహకారం ఇవ్వడానికైనా సిద్ధమని హామీయిచ్చారు. బుధవారం హైటెక్స్‌లో ఏర్పాటు చేసిన పౌల్ట్రీ ఎక్స్‌పో-2014ను సీఎం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మాట్లాడారు. దేశంలో కోళ్ల ఉత్పత్తిలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు.


బడ్జెట్‌లో పౌల్ట్రీ రంగానికి నిధులను రూ. 90 కోట్ల నుంచి రూ. 220 కోట్లకు పెంచామని వివరించారు. ఈ రంగానికి ఊతం లభించేలా ఐసీడీఎస్ కేంద్రాలకు గుడ్ల పంపిణీని 3 కోట్ల నుంచి 5.25 కోట్లకు పెంచామన్నారు.హాస్టల్ విద్యార్థులకు ఇంతకుముందు వారానికి రెండు గుడ్లు ఇస్తే... ఇప్పుడు వారానికి మూడు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. దీనిపై త్వరలో ఉత్తర్వులు ఇస్తామన్నారు. చికెన్, గుడ్లు మంచి పౌష్టిక ఆహారం అని ఆయన పేర్కొన్నారు.



రాష్ట్రంలో కోళ్ల పరిశ్రమకు అపారమైన అవకాశాలున్న దృష్ట్యా దేశవిదేశీ పారిశ్రామిక వేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు రావాలని కోరారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో వ్యాట్‌పై ఇప్పటికిప్పుడు ఏమీ చెప్పలేనని... ఆ తర్వాత పౌల్ట్రీ ప్రతినిధులు తనను కలిస్తే గంట లోగానే వ్యాట్‌పై ప్రకటన చేస్తానని వెల్లడించా రు. కోళ్ల పరిశ్రమకు విద్యుత్ సబ్సిడీ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు.



అమెరికా నుంచి ‘చికెన్ లెగ్స్’ దిగుమతులపై నియంత్రణ పాటించాలని సీఎం కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ప్రపంచ వ్యాప్తంగా కోళ పరిశ్రమ అనూహ్యంగా అభివృద్ధి చెందుతోందని కేంద్ర వ్యవసాయశాఖ సహాయ మంత్రి సంజీవ్‌కుమార్ తెలిపారు. 12వ పంచవర్ష ప్రణాళికలో కోళ్ల పరిశ్రమ అభివృద్ధి కోసం రూ. 2,800 కోట్లు కేటాయించామన్నారు. వ్యవసాయ అనుబంధ రంగంలో కోళ్ల పరిశ్రమే వేగంగా దూసుకుపోతుందన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాళ్లలో పలు పౌల్ట్రీ పరిశ్రమలు తమ ఉత్పత్తులను ప్రదర్శించాయి. కార్యక్రమంలో ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే కృష్ణారెడ్డి తదితరులు  పాల్గొన్నారు.

 

రోజుకు రెండు గుడ్లు తింటా:
పోచారం

తాను రోజూ ఉదయం అల్పాహారం కింద రెండు గుడ్లు తింటానని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. పౌల్ట్రీ సదస్సులో ఆయన మాట్లాడుతూ గుడ్డు మంచి పౌష్టికాహారం అని అన్నారు. ఇది మాంసాహారం కాదన్నారు. గుడ్ల ఉత్పత్తిలో తెలంగాణ దేశంలో రెండోస్థానంలో ఉందన్నారు. కాగా పాడి రైతులకు ప్రోత్సాహం కింద లీటరు పాలకు రూ. 4 ఇస్తున్నామన్నా రు. విజయ డెయిరీ పాల ఉత్పత్తి సామర్థ్యం 5 లక్షల లీటర్లు ఉందన్నారు. మరో డెయిరీ ఏర్పాటుకు రూ. 240 కోట్లు ఇవ్వాల్సిందిగా కేంద్రాన్ని కోరారు. రాష్ట్రంలో పేద మహిళలకు ఒక్కొక్కరికి రెండు గేదెలు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. 50 వేల కుటుంబాలకు గేదెలు ఇచ్చి పాల ఉత్పత్తి పెంచుతామన్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top