లక్ష్మీ పార్వతి పుణ్యమా అని సీఎం అయ్యా


ఎన్టీఆర్ బొమ్మతో ఎన్నికల్లో గెలవలేదు

ఎన్టీఆర్ కు ఛరిష్మా ఉంటే 1989 లో ఎందుకు ఓడిపోయారు

ఎన్టీఆర్ నన్ను వెన్నుపోటుదారుడని అంటారు

వెన్నుపోటు పొడిచే తత్వం నా రక్తంలో లేదు

అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు అన్న మాటలివి




హైదరాబాద్

ఎక్కడ ఏ ఎన్నికలు జరిగినా చంద్రబాబు నాయుడు టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్ టీ రామారావు పేరును స్మరించకుండా ప్రచారం చేయరు. ఆయన పేరు చెప్పకోకుండా చంద్రబాబు ఎన్నికల ప్రచారం చేయరు. ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలని ప్రతి మహానాడులోనూ తీర్మానం చేయిస్తారు. (అయితే ఆ విషయంలో కేంద్రానికి మాత్రం లేఖ రాయరు అది వేరే విషయం) ఎన్టీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని టీడీపీ మహానాడు (సర్వసభ్య సమావేశం) నిర్వహిస్తుంటారు. ప్రతి ఏటా చేసే తంతులో భాగంగా ఈసారి కూడా తిరుపతిలో నిర్వహిస్తున్న టీడీపీ మహానాడులో (మే 28 ఎన్టీఆర్ జన్మదినం) ఎన్టీఆర్ ను మరోసారి స్మరించబోతున్నారు.

అయితే ఇవన్నీ ఎన్టీఆర్ మరణించిన తర్వాత చంద్రబాబు నాయుడు చేస్తున్న రాజకీయ ప్రక్రియలు మాత్రమే. 1995 ఆగస్టు సంక్షోభంలో ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి  అధికారం దక్కించుకున్న చంద్రబాబు ఆ తర్వాత కాలంలో అసెంబ్లీలో ఎన్టీఆర్ గురించి ఏం మాట్లాడారో విన్నవారికి బాబు నైజమేంటో బాగా తెలుసు. ఇప్పటి తరానికి ఆ విషయాలు పెద్దగా తెలియకపోవచ్చు... కానీ లక్ష్మీపార్వతి పుణ్యమా అని సీఎం అయ్యాననీ అసెంబ్లీ వేదికగా అంగీకరించారు, ఎన్టీఆర్ బొమ్మతో తామంతా ఎన్నికల్లో గెలవలేదని, వెన్నుపోటు పొడిచే తత్వం తన రక్తంలో లేదని ఆయన అన్నారు.



1995 డిసెంబర్ 5 న జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఎన్టీఆర్ గురించి చంద్రబాబు ఏమన్నారంటే... (ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి గద్దె దింపిన సందర్భంగా అసెంబ్లీలో, స్పీకర్ నివాసం వద్ద జరిగిన నిరసనలకు సంబంధించిన చర్చ సందర్భంగా...)



''(ఎన్టీఆర్) ప్రతిరోజూ వెన్నుపోటుదారుడని మాట్లాడుతున్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒకసారి ఆలోచించుకోవలసిన అవసరం ఉంది. ఎన్టీఆర్ ఏ డెసిషన్ తీసుకుంటారో అని ప్రతిరోజూ టెన్షన్ గా ఉండేది. ఆయన ఏ డెసిషన్ తీసుకుంటారో మాకు తెలిసేది కాదు. 35 మంది మంత్రులను ఒక్కసారిగా రిమూవ్ చేయడం... (అప్పట్లో ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మొత్తం కేబినెట్ ను రద్దు చేశారు) ఆ విధంగా ఆయన ఎన్ని డెసిషన్స్ వారు తీసుకున్నా మేము అందరం సహకరించి ఎప్పటికప్పుడు ఆ తప్పులను దిద్దుకుంటూ ముందుకు తీసుకుపోయాం.'' (పూర్తిపాఠం చదవండి... ఏ డెసిషన్ తీసుకుంటారో.. )



''5 సంవత్సరాలు సుమారు 74 మంది ఎమ్మెల్యేలు ఇలా శ్రమపడ్డామో, ఏ విధంగా ఫైట్ చేసి తిరిగి అధికారంలోకి వచ్చామనేది అందరికీ తెలుసు. ఒక వ్యక్తి బొమ్మ పెట్టుకొని గెలిచామనే మాట కాదు. ప్రతి ఒక్కరి కాంట్రిబ్యూషన్ ఉంది. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ప్రముఖులు, కార్యకర్తలు మొదలైన వారి కాంట్రిబ్యూషన్ ఉంది. రామారావు గారి కాంట్రిబ్యూషనూ ఉంది. నేను ఒప్పుకుంటున్నాను. అందరూ కలిసి ఎన్నికల్లో గెలిచాం. ఎన్టీఆర్ కు చరిష్మా ఉంటే 1989లో ఆయన ఎందుకు ఓడిపోయారని అడుగుతున్నా. 1983లో చూసినట్లయితే 200 సీట్లు గెలవడం జరిగింది. (1983లో చంద్రబాబు టీడీపీలో లేరు. ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేశారు) 84 ఆగస్టు నెల క్రైసిస్ లో మిత్రపక్షాలు అందరూ కలిసి బీజేపీతో సహా 240 మంది గెలిచాం. తిరిగి 1994 లో జరిగిందేంటో అందరికీ తెలుసు. కాంగ్రెస్ 26 అయితే మిత్రపక్షాలతో కలిసి మేం 254 సీట్లు గెలిచాం. ఆ విధంగా ప్రతి ఒక్కరి పర్‌ఫార్మెన్స్ తో గెలిచాం. ఏ ఒక్కరితో కాదని తెలుపుతున్నాను.''



''ఒక వ్యక్తి కోసం పార్టీని రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను విస్మరించి ఆ వ్యక్తి కోసం ఏమైనా చేయడానికి నాయకుడు రావడం జరిగింది. మేమంతా చెప్పాం. ఎన్ని చెప్పినా వినలేదు. మా సీనియర్ కొలీగ్స్ చెప్పారు. వినలేదు. వారు ఏమీ వినకుండా ఏకపక్ష ధోరణిలో పోయారు. కాబట్టే మేం నిర్ణయం తీసుకోవలసి వచ్చిందని చెబుతున్నా.'' (పూర్తిపాఠం చదవండి... మేం ఎన్ని చెప్పినా వినలేదు)



ఈ సందర్భంగా అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యుడు కె. బాపిరాజు జోక్యం చేసుకుని... ''బాబు ముఖ్యమంత్రి అయ్యారంటే ఆవిడ (లక్ష్మీపార్వతి) పుణ్యమా...'' అని ప్రశ్నించగా... చంద్రబాబు స్పందిస్తూ... ''మీరు తెలుసుకున్న వాస్తవం కూడా ఎన్‌టీ రామారావు ఇంకా తెలుసుకోలేదు. నేను ఎప్పుడూ ముఖ్యమంత్రి పదవి కావాలని కోరుకోలేదు. వాస్తవంగా చెబుతున్నాను. ఎన్టీఆర్ బతికున్నంత వరకు ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకున్న వాడిని. మొన్నటి వరకు నా స్టాండ్ అదే. కానీ ఎప్పుడైతే రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీన్నాయో... పార్టీ మొత్తం పోయే పరిస్థితి వచ్చిందో ఎమ్మెల్యేలందరం కలిసి నా మీద ఒత్తిడి తెచ్చినప్పుడు విధిలేని పరిస్థితుల్లో ఒప్పుకున్నాను. ఎన్ టీ రామారావు అంటుంటారు. వెన్నుపోటు పొడిచే తత్వం నా రక్తంలో లేదు. ఆరోజు మేము పోరాడి చెప్పి చెప్పి విసిగిపోయి తిరుగుబాటు చేసి ఈ ప్రభుత్వాన్ని పార్టీని నిలబెట్టుకున్నాం. అంతేగానీ ఇంకొకటి కాదు. ''



''ప్రజాస్వామ్యం... ప్రజాస్వామ్యం... అని (ఎన్టీఆర్) మాట్లాడితే నాకే అర్థం కావడం లేదు. అసలు ప్రజాస్వామ్యానికి డెఫినిషన్ ఏంటని అడుగుతున్నాను. ఎన్ టి రామారావు గారు ఏం చేశారంటే పార్టీ కాన్ స్టిట్యూషన్ రాసుకున్నామని అన్నారు. ఆయన ఎప్పుడు రాసుకున్నారో నాకు తెలియదు. శాశ్వతంగా పార్టీ అధ్యక్షుడిగా కూడా ఆయన రాసుకున్నారు. మన కాన్ స్టిట్యూషన్ పర్మిట్ చేస్తే ఆయనే శాశ్వతంగా ముఖ్యమంత్రి అని రాసుకునే వారేమో నాకు తెలియదు కానీ... ఆయన (ఎన్టీఆర్) ఎన్ని శాపనార్థాలు పెట్టినా వాటిని ఆశీర్వచనాలుగానే నేను తీసుకుంటా. నేను ఎప్పుడూ తొందరపడే పరిస్థితి లేదు. డెస్పరేట్ మూడ్ లో ఎన్ని చేయాలో అన్నీ చేస్తున్నారు. (ఎన్టీఆర్‌ను గద్దె దించే రోజున అసెంబ్లీలో ఎన్టీఆర్ కు మద్దతుగా నిలిచిన ఎమ్మెల్యేలు గొడవ చేయడంపై) ప్రజలు ఎక్కడ గుణపాఠం చెప్పాలో అక్కడ చెబుతారు. అది కూడా తొందరలోనే చూస్తారు....'' (పూర్తిపాఠం చదవండి... ఆయన ఎన్ని శాపనార్థాలు పెట్టాలో అన్నీ పెడుతున్నారు)



ఇదీ ఎన్టీఆర్ గురించి చంద్రబాబు ఆనాడు అసెంబ్లీ వేదికగా అన్న మాటలు. స్పీకర్‌ను శాసనసభకు రాకుండా ఎన్టీఆర్‌కు మద్దతిచ్చిన శాసనసభ్యులు అడ్డుకున్న తీరును గర్హిస్తూ వారిపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సభ ఏకగ్రీవంగా తీర్మానం కూడా చేసింది.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top