నేను అరెస్టయ్యా..!

నేను అరెస్టయ్యా..!


బంజారాహిల్స్: సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ అరెస్ట్.. ఆదివారం ఉదయం ఈ వార్త మీడియాలో హల్‌చల్ చేసింది..దేశ వ్యాప్తంగా ఇది సంచలనం అయింది.. క్షణాల్లో మీడియా లైవ్ వాహనాలన్నీ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నాయి.. బ్రేకింగ్‌లు చూసి పోలీస్ ఉన్నతాధికారులు సైతం ఉలిక్కిపడ్డారు. ఆయన్నుఎందుకు అరెస్టు చేశారంటూ వాకబు చేశారు.. అలాంటిదేమీ లేదంటూ పోలీసులు ప్రకటన చేసి ఆ పుకార్లకు తెరదించారు.. పోలీస్ వాహనమెక్కాలన్న రామ్ కోరికే దీనికి కారణమైంది..

 

విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏది చేసినా సంచలనమే..ఆదివారం ఉదయం 10:30 గంటలకు శ్రీనగర్‌కాలనీలోని స్నేహితుని ఇంటికి వచ్చారు వర్మ.. ఆల్పాహారం తీసుకుని బయటకు వచ్చిన ఆయనకు సత్యసాయి నిగమాగమం వద్ద  పోలీస్ పెట్రోలింగ్ వెహికల్ కనిపించింది.. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం సిటీ పోలీసులకిచ్చిన అధునాతన వాహనాల గురించి తెలుసుకోవాలన్న కోరిక ఆయనకు ఎప్పటి నుంచో ఉంది.. వెంటనే ఆయన వాహనం వద్దకు చేరుకుని ముందుసీట్లో కూర్చున్నారు. ఈ హఠాత్ పరిణామానికి పెట్రోలింగ్ వెహికిల్ డ్రైవర్ శ్రీధర్‌రెడ్డి కంగుతిన్నాడు. మీరెవరంటూ ప్రశ్నించాడు.



తాను రాంగోపాల్ వర్మనని పరిచయం చేసుకున్నారు. ఈ సీట్లో పోలీసులు తప్ప వేరెవరూ కూర్చొవద్దని వర్మను వారించాడు. ఈ వెహికల్‌లో కూర్చోవాలని చాలాసార్లు అనుకున్నానని ఒక ఫొటో దిగుతానంటూ తన సహచరుడికి ఫొటో తీయాల్సిందిగా సూచించాడు. ఫొటోలకు ఫోజులిచ్చారు..ఈ వాహనం బాగుంది..సీఎం కేసీఆర్ పోలీసులకు అధునాత వాహనాలిచ్చారని అభినందించారు.. నగర పోలీస్ కమిషనర్ సైతం సిబ్బంది కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చారంటూ మెచ్చుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు.



కొంత సేపటికి తాను అరెస్టయ్యానంటూ ఫొటోలతో సహా ట్విట్టర్‌లో పోస్టు చేశారు.. ఇది పెద్ద కలకలాన్నే రేపింది.. సోషల్ మీడియాలో ఈ వార్త హల్‌చల్ చేసింది..మీడియాలో సైతం బ్రేకింగ్‌లు రావడంతో కలకలం రేగింది. లైవ్ వాహనాలతో మీడియా ప్రతినిధులు క్షణాల్లో బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. వర్మను ఎందుకు అరెస్టు చేశారో తెలియక పోలీస్ ఉన్నతాధికారులకు సైతం ఉలిక్కిపడ్డారు. ఏమి జరిగిందో వాకబు చేశారు. అలాంటిదేమీ లేదంటూ జూబ్లీహిల్స్, బంజారహిల్స్ పోలీసులు ప్రకటన చేసి దీనికి తెరదించారు. మొత్తానికి పెట్రోలింగ్ వాహనం(టీఎస్ 09 పీఏ 0904) వార్తల్లోకి ఎక్కింది.

 

కేసు నమోదుకు యత్నాలు..

అనుమతి లేకుండా రాంగోపాల్ వర్మ పోలీసు వాహనంలో కూర్చోడం, ఫొటోలకు ఫోజులు ఇవ్వడం, అరెస్టు చేశారని తప్పుడు సంకేతాల్సి ట్విటర్‌లో పెట్టడం ఎంత వరకు సమంజసమని పోలీసులు ఆరా తీస్తున్నారు. చట్టపరంగా ఆయనపై కేసు నమోదు చేయాల్సి ఉన్నా న్యాయపరమైన అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే  చర్య తీసుకుంటామని పోలీసు అధికారులు అంటున్నారు.  ఈ విషయంపై ఏం జరిగిందో లిఖిత పూర్వకంగా రాసి ఇవ్వాలని పెట్రోలింగ్ వాహనం డ్రైవర్ శ్రీధర్‌రెడ్డిని ఉన్నతాధికారులు ఆదేశించారు.

 

న్యాయనిపుణుల సలహా తీసుకుంటున్నాం...

బంజారాహిల్స్ ఏసీపీ ట్విటర్‌లో తప్పుడు సమాచారం పోస్టు చేయడం, అనుమతి లేకుండా పోలీసు వాహనంలో ఎక్కడం నేర మే.  శ్రీధర్‌రెడ్డి ద్వారా పిర్యాదుతీసుకొని.. వర్మపై కేసు పెట్టవచ్చా అనే అంశంపై న్యాయనిపునుల సలహా తీసుకుంటున్నాము.ఆ తరువాతే కేసు నమోదు విషయంపై తేటతెల్లం అవుతుంది.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top