ఇక చెత్త అన్నది కనిపించకూడదు: కేసీఆర్

ఇక చెత్త అన్నది కనిపించకూడదు: కేసీఆర్ - Sakshi


రాష్ట్ర రాజధాని నగరం అంతా అద్దంలా మెరిసిపోవాలని, ఇక ఎక్కడా చెత్త అన్నది కనిపించకుండా చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఈ లక్ష్యాన్ని రెండు నెలల్లోనే సాధించగలమని, ప్రజల్లో ఆ విశ్వాసం ఉందని ఆయన చెప్పారు. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం విజయం సాధించిన సందర్భంగా ఇందులో పాల్గొన్న వివిధ శాఖల అధికారులకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఆయన శుక్రవారం ఓ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమానికి వెళ్లినప్పుడు తాను, మంత్రులు గమనించిన అంశాలను ఆయన అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. విద్యుత్ లైన్ల గురించి చాలాచోట్ల ఫిర్యాదులు వచ్చాయని, పలు ప్రాంతాల్లో హైటెన్షన్ లైన్లు వంగిపోయి ఇళ్లమీదుగా ఉన్నాయని ఆయన చెప్పారు. ఎంత డబ్బయినా ఇస్తామని.. నగరంలో ఇక ఇళ్లమీద నుంచి ఉన్న హైటెన్షన్ లైన్లన్నింటినీ వెంటనే తొలగించాలని ఆయన విద్యుత్ అధికారులకు సూచించారు.



ఇక మరికొన్ని చోట్ల మురుగునీటి పైపులైన్లు, మంచినీటి పైపులైన్లు కలిసి ఉన్నాయని, దానివల్ల ఇబ్బంది అవుతోందని.. ఏడాది, రెండేళ్లలో మొత్తం లైన్లన్నీ మార్చేయాలని తెలిపారు. అన్నింటికంటే పెద్ద సమస్య నాలాలని కేసీఆర్ విస్పష్టంగా చెప్పారు. నగరంలో మొత్తం 77 నాలాలున్నాయని, రెండు మాత్రం హుస్సేన్ సాగర్లో కలుస్తాయని, మిగిలిన 72  మూసీలో కలుస్తాయని.. వీటి నిడివి 390 కిలోమీటర్లని వివరించారు. అయితే ఇవన్నీ నూరుశాతం ఆక్రమణల్లో ఉన్నాయని ఆయన కుండ బద్దలుకొట్టినట్లు చెప్పారు. గతంలో ఉన్న కార్పొరేటర్లు, అధికారులకు చేతులెత్తి నమస్కరించాలని కేసీఆర్ వ్యాఖ్యానించారు. నాలాల్లో చెత్త, చెదారం వేస్తున్నారని, విరిగిన బకెట్లు, పాడైన పరుపులు కూడా వేస్తున్నారని చెప్పారు. వీటన్నింటినీ సరిచేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. 26న హైదరాబాద్ నగర ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటుచేశానని, అందులో ఈ సమస్యలన్నింటినీ ప్రస్తావిస్తానని అన్నారు.



పేదలకు గృహనిర్మాణం అవసరమని సీఎం కేసీఆర్ అన్నారు. వాళ్లకు గౌరవప్రదమైన పద్ధతిలో ఇళ్లు కట్టించి ఇవ్వాలని, ఇందుకోసం అవసరమైతే భూములు సేకరించడం, ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములున్నాయో చూడటం ద్వారా సమగ్ర గృహనిర్మాణం చేయిస్తామన్నారు. ముందు ముందు హైదరాబాద్లో స్లమ్ కల్చర్ అన్నది లేకుండా చూడాలని తెలిపారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top