కలల బండికి ముహూర్తం కుదిరింది..

కలల బండికి ముహూర్తం కుదిరింది.. - Sakshi


శరవేగంగా మెట్రో పనులు

నాగోలు-మెట్టుగూడ మార్గం సిద్ధం

మార్చి 21న ప్రారంభానికి సన్నాహాలు

ఫిబ్రవరిలో మియాపూర్-ఎస్‌ఆర్ నగర్ రూట్లో ట్రయల్ రన్


 

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ వాసుల కల నెరవేరబోతోంది.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన మెట్రో రైల్ ప్రాజెక్టు పనులు శరవేగంతో దూసుకుపోతున్నాయి. ఆటంకాలను.. సవాళ్లను అధిగమించి పట్టాలెక్కేందుకు సిద్ధమవుతోంది. మార్చి 21 (ఉగాది)న నాగోల్-మెట్టుగూడా మార్గంలో రైలు పరుగులు దీయనుంది. ప్రస్తుతం ఈ మార్గంలో ప్రయోగ పరీక్షలు విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ట్రయల్ జరుగుతోన్న ఈ ప్రాంతంలో ఏడు మెట్రో రైళ్లు రేయింబవళ్లు పరుగులు తీస్తూ.. నగరవాసులకు కనువిందు చేస్తున్నాయి.



ప్రస్తుతం పుణె నుంచి వచ్చిన రైల్వే డిజైన్ స్పెసిఫికేషన్ సెల్ సంస్థ నిపుణులు ఈ మార్గంలో పరుగులు తీస్తున్న ఏడు మెట్రో రైళ్లకు 18 రకాల పరీక్షలను గురువారం నాటికి పూర్తిచేశారు. ఈ మార్గంలో గురువారం రోజంతా విరామం లేకుండా మెట్రో రైళ్లను నడపడం విశేషం. సామర్థ్యం, లోడు టెస్టు, వేగం, సిగ్నలింగ్, ట్రాక్ పనితీరు, ఏసీ, లైటింగ్, ఆటోమేటిక్ కంట్రోల్ వ్యవస్థ, బ్రేకులు వంటిసాంకేతిక అంశాలను  క్షుణ్ణంగా తనిఖీ చేసి సేఫ్టీ సర్టిఫికెట్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారు. త్వరలో అధికారికంగా రైల్వేశాఖ నగర మెట్రోకు భద్రతా ధ్రువీకరణ (సేఫ్టీ సర్టిఫికెట్) జారీ చేయనుంది.



ఇక ఈ మార్గంలో వచ్చే ఏడు మెట్రో స్టేషన్లలో సైతం పనులు చివరి దశకు చేరుకున్నాయి. స్టేషన్‌లోనికి ప్రవేశించే, బయటికి వెళ్లే దారులు, పైకప్పు, సిగ్నలింగ్ పనులు, స్టేషన్లకు రంగులద్దే పనులు తుదిదశకు చేరుకున్నట్టు ఎల్‌అండ్‌టీ మెట్రో రైలు మేనేజింగ్ డెరైక్టర్ వీబీ గాడ్గిల్ ‘సాక్షి’కి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు తొలిదశను ప్రారంభిస్తామని చెప్పారు. మియాపూర్-ఎస్‌ఆర్ నగర్ రూట్లోనూ మెట్రో రైళ్లకు ప్రయోగ పరీక్షలను ఫిబ్రవరిలో నిర్వహించే అవకాశాలున్నాయన్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top