గ్రూప్-1 మెయిన్స్‌లో అడిగిన ప్రశ్నలివే..

గ్రూప్-1 మెయిన్స్‌లో అడిగిన ప్రశ్నలివే.. - Sakshi


 హైదరాబాద్: ‘ప్యాకేజీతో పోల్చితే ప్రత్యేక హోదా వల్ల ఎక్కువ ప్రయోజనాలుంటాయా?, పట్టిసీమ పథకం వల్ల ప్రయోజనాలేంటి?’ వంటి తాజా పరిణామాలను గ్రూప్-1 మెయిన్స్‌లో ప్రశ్నలుగా సంధించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) నిర్వహించిన 2011 గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు బుధవారం నుంచి ప్రశాంతంగా ప్రారంభమయిన విషయం తెలిసిందే. తొలిరోజు బుధవారం జనరల్ ఎస్సేపై పరీక్ష జరిగింది. ప్రశ్నలన్నీ దాదాపుగా ఇటీవలి పరిణామాలపైనే ఇచ్చారు. విభజన తర్వాత ప్రత్యేక హోదా కోసం రాష్ట్రంలో ఆందోళనలు సాగుతున్న నేపథ్యంలో దానికి సంబంధించి ఓ ప్రశ్న ఇచ్చారు.



‘భారత ప్రభుత్వం ఆం ధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. కానీ ప్రత్యేక హోదా ఇవ్వలేదు. ప్రస్తుత ప్యాకేజీతో పోల్చితే హోదా వల్ల ఎక్కువ ప్రయోజనాలుంటాయా? వివరించండి?’ అని ప్రశ్నించారు. అలాగే నదుల అనుసంధానం ఏపీలో నీటి కొరత ఎలా తీర్చగలదో తెలపండి? పట్టిసీమ పథకం ప్రయోజనాలు వివరించం డి? అని మరో ప్రశ్న ఇచ్చారు.


దళితులపై దాడుల నేపథ్యం లో.. భారతదేశంలో దళితుల ప్రస్తుత పరిస్థితేమిటి? అనేక పథకాలు, రక్షణ కోసం కఠిన చట్టాలున్నప్పటికీ క్షేత్రస్థాయిలో గణనీయమైన అభివృద్ధి ఎందుకు లేదు? అంటూ ప్రశ్నించారు. ‘దేశద్రోహ చట్టాలకు ప్రజాస్వామ్యంలో స్థానం లేదు. మన దేశం లో ఇటీవలి సంఘర్షణల నేపధ్యంలో పైన పేర్కొన్న వాక్యంపై చర్చించండి?’ అని మరో ప్రశ్న ఇచ్చారు. కాశ్మీర్‌లోయలో ఆందోళనల నేపథ్యంలో.. భారత్ చేస్తున్న ఉమ్మడి తీవ్రవాద వ్యతిరేక ప్రయత్నాలపై ఇది ఎలాంటి ప్రభావం చూపుతుందో వివరించాలని ప్రశ్నించారు. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడంపైనా ప్రశ్న సంధించారు.



తొలి రోజు పరీక్షకు 3,128 మందే హాజరు: కాగా, రాష్ట్రవ్యాప్తంగా బుధవారం జరిగిన 2011 గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు 8,760 మందికి గాను 3,128 మంది హాజరయ్యారని ఏపీపీఎస్సీ కార్యదర్శి వైవీఎస్‌టీ సాయి పేర్కొన్నారు. హైదరాబాద్‌లో 1,082 మంది, విశాఖలో 833 మంది, విజయవాడలో 654 మంది, తిరుపతిలో 559 మంది హాజరయ్యారని చెప్పారు. ఇదిలాఉండగా పరీక్ష ఉదయం 10 గంటలకే అయినా 8.30కల్లా అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని ఏపీపీఎస్సీ నిబంధన పెట్టింది. అనేక మంది అభ్యర్థులు నిర్ణీత సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకోలేకపోవడంతో వారిని పరీక్ష హాల్లోకి అనుమతించలేదు.


ఇలా అవకాశాలు కోల్పోయిన వారు వందల సంఖ్యలో ఉన్నారు. మరోవైపు ఈసారి పరీక్షల నిర్వహణకు ఏపీపీఎస్సీ పగడ్బందీ ఏర్పాట్లు చేసింది. గదుల్లో సీసీ కెమెరాలు ఉన్న భవనాలనే పరీక్ష కేంద్రాలుగా ఎంపిక చేసింది. అభ్యర్థులకు బయోమెట్రిక్, ఐరిష్‌తో పాటు ప్రత్యేకంగా మళ్లీ ఫొటోలు తీశారు. వీటిని ఆయా అభ్యర్థుల దరఖాస్తుల్లోని ఫొటోలు ఇతర అంశాలతో సరిపోల్చిన తర్వాతే పరీక్ష హాల్లోకి అనుమతించారు. కాగా, ఈ పరీక్షను ఏపీ, తెలంగాణలు ఒకేరోజు నిర్వహించడంతో అభ్యర్థులు ఏదో ఒక్క రాష్ట్రానికే పరిమితం కావాల్సి వచ్చింది.



 ఏపీపీఎస్సీ కార్యాలయం ఎదుట ఆందోళన

 గంటన్నర ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలనే నిబంధనతో పాటు బయోమెట్రిక్ విధానాన్ని తొలగించాలంటూ పలువురు అభ్యర్థులు బుధవారం హైదరాబాద్‌లోని ఏపీపీఎస్సీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. పరీక్షను మళ్లీ నిర్వహించాలంటూ డిమాండ్ చేశారు. పరీక్షా కేంద్రానికి 30 నిమిషాల ముందు చేరుకున్నామని, కానీ 9 గంటలకే బయోమెట్రిక్ పూర్తరుుందంటూ పరీక్షకు అనుమతించలేదని పలువురు అభ్యర్థులు వాపోయారు. ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ్‌భాస్కర్ దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన కూడా నిర్లక్ష్యంగా మాట్లాడారని ఆరోపించారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top