‘హౌసింగ్’ అక్రమాలపై సమీక్ష


అసెంబ్లీలో ‘హౌస్ కమిటీ’ సమావేశం

సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం నుంచి భూములు పొందిన హౌసింగ్ కో ఆపరేటివ్ సొసైటీల్లో జరిగిన అక్రమాలపై శాసనసభా సంఘం (హౌస్ కమిటీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. సొసైటీ అక్రమాలపై ఏర్పాటైన సంఘం సోమవారం అసెంబ్లీ కమిటీ హాలులో చైర్మన్ ఆరూరి రమేశ్ అధ్యక్షతన సమావేశమైంది. వెంకటేశ్వరకో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ పరిధిలో జరిగిన అక్రమాలపై ప్రధానంగా సమీక్ష జరిగింది.



756 మంది లబ్ధిదారులకు 31 మంది మాత్రమే అసలైన లబ్ధిదారులుగా తేల్చిన కమిటీ.. సొసైటీ విషయంలో అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. జరిగిన అక్రమాలు, తీసుకోవాల్సిన చర్యలపై పూర్తి స్థాయి కార్యాచరణ ప్రణాళిక (యాక్షన్ ప్లాన్)ను సిద్ధం చేయాలని ఆదేశించింది. వచ్చే నెల 25న మరోమారు సమావేశం కావాలని.. నందగిరి, ఫిల్మ్‌నగర్, జూబ్లీహిల్స్, వెంకటేశ్వర కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలకు సంబంధించి పూర్తి వివరాలతో రావాలని సూచించింది.



జూబ్లీహిల్స్ క్లబ్ పరిధిలోని నర్సరీలో ప్రభుత్వ స్థలంగా బోర్డు ఏర్పాటు చేయాలని ఆదేశించినా ఇప్పటికీ చర్యలు తీసుకోలేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. ఓయూ కాలనీలో బయటి వ్యక్తులకు ప్లాట్లు అమ్ముతున్నారని, చివరకు సీఎం కార్యాల యం నుంచి కోరినా, ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. 15 రోజు ల్లో ఓ కమిటీని ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటామని హౌజ్ కమిటీకి సహకారశాఖ కమిషనర్ వీరభద్రయ్య హామీ ఇచ్చారు.

 

ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి వాకౌట్

హెచ్‌ఎంటీ కాలనీలో జరిగిన అక్రమాలపై చర్చించాలని కమిటీ సభ్యుడు, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. అయితే, ఎజెండాలో లేని అంశంపై చర్చించలేమనడంతో పొంగులేటి సమావేశాన్ని బహిష్కరించి వెళ్లిపోయారు. సమావేశంలో ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, గువ్వల బాలరాజు, చింతా ప్రభాకర్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, సీసీఎల్‌ఏ రేమాండ్ పీటర్, ఎంయూఏడీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎంజీ గోపాల్, హైదరాబాద్ కలెక్టర్ రాహుల్ బొజ్జా, అధికారులు పాల్గొన్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top