కాలేజీ విద్యార్థులకు హాస్టళ్లు!

కాలేజీ విద్యార్థులకు హాస్టళ్లు! - Sakshi

- ఇంటర్, డిగ్రీ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు

దూర ప్రాంత విద్యార్థుల కోసం ఎస్సీ అభివృద్ధి శాఖ నిర్ణయం

ఎస్సీ విద్యార్థులకు ప్రాధాన్యం.. 70 శాతం సీట్లు వారికే..

 

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్మీడియెట్, డిగ్రీ విద్యార్థులకు శుభవార్త. దూర ప్రాంతం నుంచి కాలేజీకి రాకపోకలు సాగించే వారి కోసం ఎస్సీ అభివృద్ధి శాఖ త్వరలో ప్రత్యేకంగా వసతి గృహాలను ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతం నియోజకవర్గానికో వసతిగృహం ఉన్నప్పటికీ విద్యార్థుల సంఖ్యకు తగి నట్టుగా వీటిని నెలకొల్పాలని భావిస్తోంది. ఇందుకు సంబంధించి క్షేత్రస్థాయి నుంచి పలువురు ప్రజా ప్రతినిధులు సైతం హాస్టళ్ల ఆవశ్యకతపై లేఖలు పంపు తుండటంతో చర్యలు మొదలుపెట్టింది. ప్రస్తుతం ఎస్సీ అభివృద్ధి శాఖ పరిధిలో పాఠశాల విద్యార్థుల వసతి గృహాలు కొనసాగుతున్నాయి. తాజాగా గురుకుల పాఠశాలలను ప్రారంభించడంతో పలు హాస్టళ్లలో విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. ఈ తరుణంలో పిల్లల సంఖ్య తక్కువగా ఉండి.. మౌలికవసతులు ఉన్న వాటిలో ఈ హాస్టళ్లను ప్రారంభించాలని భావిస్తోంది. ఈ మేరకు క్షేత్రస్థాయి అధికారుల నుంచి వివరాలను సేకరిస్తోంది.

 

వంద మందికి ఒక హాస్టల్‌

కొత్తగా హాస్టళ్లు ప్రారంభించడం ఖర్చుతో కూడుకున్న పని. అంతేకాకుండా వాటిని పూర్తిచేసి అందుబాటులోకి తేవడానికి చాలా సమయం పడుతుంది. దీంతో విద్యార్థులు లేని, 40 కంటే తక్కువ విద్యార్థులున్న హాస్టళ్లను సమీప వసతి గృహాల్లో విలీనం చేయనున్నారు. అలా విలీనం చేసిన హాస్టల్‌ భవనంలోనే కొత్తగా కాలేజీ విద్యార్థుల కోసం వసతిగృహాన్ని ఏర్పాటు చేయాలని ఎస్సీ శాఖ ప్రాథమికంగా నిర్ణయించింది. దీంతో ఖర్చు తగ్గడంతో పాటే సిబ్బందికి స్థానచలనం కలిగించాల్సిన పని ఉండదని, వనరులు సద్వినియోగం చేసుకోవచ్చని అధికారులు భావిస్తున్నారు.



పక్కా భవనం ఉండి కనీసం వంద మంది విద్యార్థులకు వసతి కలిగించే సామర్థ్యం ఉన్న భవనాలనే కాలేజీ హాస్టళ్లకు ఎంపిక చేయనున్నారు. వీటిని ఒకేసారి పెద్ద సంఖ్యలో కాకుండా ప్రాధాన్యత క్రమంలో ప్రారంభించనున్నారు. కరీంనగర్‌ జిల్లాలో కరీంనగర్, జమ్మికుంట తదితర మండలాల్లో బాలికలు, బాలుర కోసం వసతిగృహాలు ఏర్పాటు చేయాలని ఇటీవల ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌.. ఎస్సీ అభివృద్ధి శాఖకు లేఖ రాశారు. దాంతో అధికారులు ఆమేరకు చర్యలు చేపట్టి నివేదికను రూపొందించారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల సంఖ్యను పరిగణనలోకి తీసుకుని వసతి గృహాలను ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఇంటర్‌ ప్రవేశాల ప్రక్రియ ముగియగా.. డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. దీంతో ప్రవేశాలు ముగిసిన తర్వాత విద్యార్థుల సంఖ్యను బట్టి వసతి గృహాల ఆవశ్యకతపై అంచనాకు వస్తామని ఎస్సీ అభివృద్ధి శాఖ సంచాలకులు కరుణాకర్‌ ‘సాక్షి’తో అన్నారు.

 

ఉపకార నిధులతో నిర్వహణ

కొత్తగా ఏర్పాటు చేసే వసతి గృహాల నిర్వహణ భారాన్ని విద్యార్థుల ఉపకార వేతనాల నుంచి సర్దుబాటు చేయాలని ఎస్సీ శాఖ భావిస్తోంది. ప్రస్తుతం నియోజకవర్గ కేంద్రాల్లో పోస్టుమెట్రిక్‌ వసతి గృహాలను నిర్వహిస్తోంది. వీటి మాదిరిగానే కొత్తగా ఏర్పాటు చేసే కాలేజీ హాస్టళ్లను నిర్వహించనుంది. ఒక హాస్టల్‌లో కనిష్టంగా వంద మంది విద్యార్థులుంటేనే నిర్వహణలో ఇబ్బందులుండవని అధికారులు చెబుతున్నారు. ఈ సంఖ్యను దృష్టిలో పెట్టుకుని బాలికలు, బాలుర హాస్టళ్ల ప్రణాళికలు రూపొందిస్తున్నారు. వీటిలో ఎస్సీ విద్యార్థులకు 70 శాతం సీట్లు కేటాయిస్తారు. మిగతా కోటాలో ప్రాధాన్యత క్రమంలో విద్యార్థులను చేర్చుకుంటారు. 
Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top