హెచ్‌ఎండీఏ టార్గెట్

హెచ్‌ఎండీఏ టార్గెట్ - Sakshi


ఏసీబీ దాడులు



సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ)లోని అక్రమార్కులపై మళ్లీ పంజా విసిరేందుకు అవినీతి నిరోధక శాఖ సిద్ధమైంది. యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతున్న కిందిస్థాయి ఉద్యోగుల నుంచి ఉన్నతస్థాయి అధికారుల వరకు ఎవరినీ వదలకుండా జల్లెడ పట్టేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.  ఇందులో భాగంగా వరుస దాడులు నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించుకుంటున్నట్లు సమాచారం. హెచ్‌ఎండీఏలో  పీఓ (ఇన్‌ఛార్జి)గా పనిచేస్తున్న ఆర్.నాగేశ్వరరావు ఇల్లు, ఆఫీసులో వారం రోజుల క్రితం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి ఆదాయానికి మించిన ఆస్తులను గుర్తించిన విషయం తెలిసిందే.



ఈ సంఘటనతో కొందరు అక్రమార్కులు జాగ్రత్తపడగా, మరికొందరు ఇక ఇప్పట్లో ఏసీబీ దాడులుండవన్న ధీమాతో అక్రమాలకు ద్వారాలు తెరిచారు. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు గత శుక్రవారం హెచ్‌ఎండీఏలో పలువురు ఉద్యోగులకు సంబంధించిన సర్వీసు రిజిస్టర్ల (ఎస్.ఆర్)ను పరిశీలించి వెళ్లారు. ఎస్టాబ్లిష్‌మెంట్ విభాగానికి వచ్చిన వారు ఎవరికీ అనుమానం రాకుండా సంస్థలో అందరి సర్వీసు రిజిస్టర్లు తీసుకొని  అవసరమైన వివరాలను సేకరించారు. త్వరలో మళ్లీ కలుస్తామని వారు చెప్పడాన్ని బట్టి  మరోవిడత అక్రమార్కుల ఏరివేత చేపట్టనున్నట్లు స్పష్టమవుతోంది.

 

వారిపైనే కన్ను:

హెచ్‌ఎండీఏలో ప్రధానంగా ప్లానింగ్, ఇంజినీరింగ్ విభాగాల పైనే ఏసీబీ గురి పెట్టినట్లు సమాచారం. ఈ విభాగాల్లో కొందరు అధికారులు, కిందిస్థాయి ఉద్యోగులు పైకి హూందాగా వ్యవహరిస్తున్నా... ఫైల్‌పై సంతకం పెట్టాలంటే  బరువు పెట్టాల్సిందేనని ఆరోపణలు ఉన్నాయి. ప్లానింగ్ విభాగంలో డిప్యుటేషన్‌పై వచ్చిన కొందరు అధికారులు ఒక్కో పనికి ఒక్కో రేటు నిర్ణయించి నిర్లజ్జగా వసూలు చేస్తున్నట్లు ఏసీబీకి నేరుగా ఫిర్యాదులు అందినట్లు సమాచారం. కొత్త లేఅవుట్ అభివృద్ధి, భూ వినియోగ మార్పిడి, బహుళ అంతస్థు భవనాల నిర్మాణానికి  సంబంధించి బేరం కుదిరాకే ఫైల్ కదులుతుండడం, డబ్బులు ముట్టజెప్పాకే అనుమతులిస్తుండటంతో కొందరు బాధితులు ఏసీబీని ఆశ్రయించినట్లు తెలుస్తోంది.



అయితే... వారు నేరుగా డబ్బు తీసుకొనేందుకు ఇష్టపడకపోవడంతో  రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొనేందుకు ఏసీబీకి అవకాశం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఆయా అధికారులు, సిబ్బందిపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా లోతుగా విచారణ చేసిన ఏసీబీ అధికారులు రైడ్స్ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఇంజనీరింగ్ విభాగంలో కొందరు అధికారులు, కిందిస్థాయి సిబ్బందిపై కూడా ఫిర్యాదులు అందడంతో అవి అవాస్తవాలని కొట్టిపారేయకుండా లోతుగా విచారణ జరిపి అక్రమార్కులపై చర్యలకు దిగాలని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం.

 

సస్పెన్షన్‌కు రంగం :

ఏసీబీ దాడిలో ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్న ఆరోపణలతో అరెస్టైన పీఓ (ఇన్‌ఛార్జి) ఆర్.నాగేశ్వరరావును సస్పెండ్ చేసేందుకు హెచ్‌ఎండీఏ రంగం సిద్ధం చేసింది. ఏసీబీ కోర్టు నాగేశ్వరరావుకు 14 రోజులు రిమాండ్ విధించడంతో అతడిని జైలుకు తరలించారు. అరెస్టును ద్రువీకరిస్తూ ఏసీబీ శనివారం హెచ్‌ఎండీఏ ఇన్‌చార్జి కమిషనర్ ప్రదీప్ చంద్రకు రేడియో మెసేజ్ పంపింది. ఈమేరకు పీఓ(ఇన్‌ఛార్జి) నాగేశ్వరరావును సస్పెండ్ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసేందుకు హెచ్‌ఎండీఏ అధికారులు చర్యలు చేపట్టారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top