ఆ నిధులు స్థానిక అభివృద్ధికే... !

ఆ నిధులు స్థానిక అభివృద్ధికే... !


సాక్షి, సిటీబ్యూరో : అక్రమ నిర్మాణాలు, లేఅవుట్ల క్రమబద్ధీకరణకు వసూలు చేస్తున్న రుసుం (ఫీజు)లో నగర పంచాయతీలకు 70శాతం, గ్రామ పంచాయతీలకు 50శాతం చొప్పున వాటా ఇవ్వనున్నట్లు  హెచ్‌ఎండీఏ కమిషనర్ టి.చిరంజీవులు స్పష్టం చేశారు. ఈ నిధులను ఆయా ప్రాంతాల్లో రోడ్లు, నీటి సరఫరా, డ్రైనేజీ, వీధిదీపాలు వంటి మౌలిక సౌకర్యాలు కల్పించేందుకు వినియోగిస్తామన్నారు.



ప్రభుత్వం ప్రకటించిన ఎల్‌ఆర్‌ఎస్-బీఆర్‌ఎస్‌లను సద్వనియోగం చేసుకోవడం ద్వారా అక్రమ నిర్మాణాలను సక్రమం చేసుకోవడంతో పాటు స్థానికంగా సౌకర్యాలు సమకూరతాయని, దీనివల్ల ప్రజలకే ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. ఈ విషయం చాలామందికి తెలియకపోవడం వల్లే అక్రమ నిర్మాణాలు, ప్లాట్లను క్రమబద్ధీకరించుకొనేందుకు ఆసక్తి చూపట్లేదని, వారిలో అవగాహన పెంచేందుకు స్థానిక సంస్థల అధికారులతో పాటు రెవిన్యూ అధికారులు ప్రధాన భూమిక పోషించాలని కోరారు.



ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ భూముల్లో నిర్మితమైన భవనాలు, ఇతర నిర్మాణాలను  సర్వే నంబర్ల వారీగా ఎమ్మార్వోలు, వీఆర్వోలు గుర్తించి వాటి యజమానులను భూ వినియోగమార్పిడి దరఖాస్తు చేసుకొనేలా ప్రోత్సహించాలని సూచించారు. ఇటీవల మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో హెచ్‌ఎండీఏ నిర్వహించిన అవగాహన సదస్సులకు పెద్దమొత్తంలో జనాలు రావడాన్ని గమనించిన కమిషనర్ గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు.



క్రమబద్ధీకరణకు ఇదే చివరి అవకాశమన్న వాస్తవాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి సద్వినియోగం చేసుకొనేలా వారిని కదిలించాలని తెలిపారు. ఎల్‌ఆర్‌ఎస్/బిఆర్‌ఎస్‌ల దరఖాస్తు గడువు ముగిశాక, ఎటువంటి పరిస్థితిలో దరఖాస్తులను స్వీకరించబోమని తెలిపారు. సకాలంలో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకొన్న వారి దరఖాస్తులను 6నెలల వ్యవధిలోగా పరిష్కరించి అనుమతి పత్రాలు జారీ చేస్తామని స్పష్టం చేశారు.



ప్రభుత్వం నిర్దేశించిన గడువు ముగిశాక హెచ్‌ఎండీఏ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు రంగంలోకి దిగి అక్రమ నిర్మాణాలు, లే అవుట్లను సమూలంగా కూల్చివే యడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు.  అనుమతిలేని లేఅవుట్లలో కొనుగోలు చేసిన ప్లాట్లకు రిజిస్ట్రేషన్ చేయకుండా (జీవో నెం.151, తేదీ2.11.2015 రూల్-13(సి) ప్రకారం) నిషేధిత ప్రాంతాల్లోకి చేర్చేందుకు రిజిస్ట్రేషన్ల శాఖకు సమాచారం ఇస్తామన్నారు. దీనివల్ల ఆయా ప్లాట్లు అమ్మడం గానీ, కొనడం గానీ ఇతర లావాదేవీలకు అవకాశం లేకుండా స్తంభింపజేస్తామని కమిషనర్ చిరంజీవులు ‘సాక్షి’కి వివరించారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top