బొట్టు పెట్టుకుందని బాలికను శిక్షించిన హెచ్‌ఎం


హెచ్‌ఆర్సీలో విద్యార్థిని తండ్రి ఫిర్యాదు

పాఠశాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన హెచ్‌ఆర్సీ


 

దత్తాత్రేయనగర్: పుట్టిన రోజునాడు బొట్టు పెట్టుకొని పాఠశాలకు వెళ్లిన విద్యార్థినిని పాఠశాల ప్రధానోపధ్యాయురాలు రెండు గంట పాటు తన ఛాంబర్ బయట నిలబెట్టి శిక్షించడంతో పాటు మరోసారి ఇలా చేస్తే టీసీ ఇచ్చి పంపేస్తానని బెదిరించింది.  దీంతో సదరు హెచ్‌ఎంపై చర్యలు తీసుకోవాలని విద్యార్థిని తండ్రి హెచ్‌ఆర్సీలో గురువారం ఫిర్యాదు చేశారు.


 


ఫిర్యాదీ తెలిపిన వివరాల ప్రకారం... సికింద్రాబాద్‌కు చెందిన వీరా చారి కూతుళ్లు సీహెచ్.వైష్ణవి, సీహెచ్. భవ్యమాధురి సికింద్రాబాద్‌లోని తార్నాక వైట్ హౌస్ వద్ద గల సెయింట్ ఆన్స్ హై స్కూల్‌లో చదువుతున్నారు.  ఈనెల 24న భవ్య జన్మదినం కావడంతో ఉదయం గుడికి వెళ్లి బొట్టు పెట్టుకుని పాఠశాలకు వెళ్లింది. ప్రార్థన జరుగుతున్న సమయంలో పాఠశాల ప్రధానోపాధ్యయురాలు సల్లీ జోసేఫ్... భవ్య బొట్టుపెట్టుకొని రావడం గమనించి తన ఛాంబర్ వద్ద నిలబడాలని ఆదేశించింది. తర్వాత భవ్య తల్లి నాగలక్ష్మికి ఫోన్ చేసి పాఠశాలకు రావాలని కోరింది.  



పుట్టినరోజు కావడంతో తన కూతురు బొట్టు, తలకు పిన్స్ పెట్టుకొని వచ్చిందని మరోసారి ఇలా జరగకుండా చూస్తామని నాగలక్ష్మి చెప్పినా.. ప్రధానోపాధ్యాయురాలు వినిపించుకోలేదు.  రెండు గంటలకు పైగా బాలికను బయట నిలబెట్టి టీసీ ఇచ్చేస్తా.. వెళ్లిపో అని బెదిరించింది. దీంతో నాగలక్ష్మి కన్నీళ్లు పెట్టుకుంటూ భర్త చారిని పిలిపించింది.  హిందూ ధర్మం ప్రకారం పుట్టిన రోజునాడు ఆలయానికి వెళ్లి పూజలు చేయడం సాంప్రదాయమని హెచ్‌ఎంకు నచ్చచెప్పే ప్రయత్నం చేసినా హెచ్‌ఎం వినిపించుకోలేదు.


 


మరోసారి ఇలా చేస్తే  టీసీ ఇచ్చి పంపేస్తామని హెచ్.ఎం బెదిరించిందని, అప్పటి నుంచి తన కూతురు పాఠశాల అంటేనే భయపడుతోందని తండ్రి చారి హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు చేశారు.  మానవ హక్కులకు భంగం కలిగించడంతో పాటు తన కూతురు, భార్య మనోవేదనకు గురయ్యేలా చేసిన సదరు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన హెచ్‌ఆర్సీ సభ్యులు కాకుమాను పెద పేరిరెడ్డి పాఠశాల నిర్వాకంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏప్రిల్ 9 తేదీలోగా నివేదిక అందించాలని హైద్రాబాద్ డీఈఓకు ఆదేశాలు జారీ చేశారు.

 

 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top