హైటెక్ కాపీయింగ్: బీటెక్ విద్యార్థి పట్టివేత

హైటెక్ కాపీయింగ్: బీటెక్ విద్యార్థి పట్టివేత - Sakshi


చాంద్రాయణగుట్ట: హైటెక్ పద్ధతిలో పరీక్షల్లో కాపీయింగ్‌కు పాల్పడుతున్న ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని కళాశాల యజమాన్యం పట్టుకొని పోలీసులకు అప్పగించింది. పోలీసుల కథనం ప్రకారం... మాసబ్‌ట్యాంక్‌కు చెందిన షేక్ వసీం అహ్మద్ మలక్‌పేటలోని నవాబ్ షా ఆలం ఖాన్ కళాశాలలో మెకానికల్ ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. సెకండ్ ఇయర్‌కు సంబంధించి కొన్ని సబ్జెక్ట్‌లు బ్యాక్‌లాగ్ ఉండటంతో ఆ పరీక్షల కేంద్రం చాంద్రాయణగుట్టలోని అరోరా ఇంజినీరింగ్ కాలేజీలో పడింది. శుక్రవారం మధ్యాహ్నం థర్మల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ పరీక్ష ప్రారంభమైంది.  కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా పాఠశాల డెరైక్టర్ చేపూరి శ్రీలత తన బృందంతో కలిసి విద్యార్థులందరినీ పరిశీలిస్తున్నారు. వీరిని చూసి పరీక్ష రాస్తున్న షేక్ వసీం అహ్మద్ ఒక్కసారిగా తన పేపర్ అక్కడే వదిలేసి బయటికి పరుగు తీశాడు. 



దీంతో అనుమానం వచ్చిన సిబ్బంది అతడిని వెంబడించి పట్టుకుని క్షణ్ణంగా తనిఖీ చేయగా... దిమ్మె తిరిగే విషయం బయటపడింది.  వసీం అండర్ వేర్‌లో సెల్‌ఫోన్, బనియన్ అంచులలో కుట్టిన ట్రాన్స్‌మీటర్ కేబుల్,  చెవిలో సూక్ష్మమైన బ్లూటూత్ పరికరం బయటపడ్డాయి. బయటి నుంచి కాల్ వచ్చిన వెంటనే నాలుగైదు రింగ్‌లకు ఆటోమెటిక్‌గా ఫోన్ రిసీవ్ కావడం...  రిసీవ్ అయిన వెంటనే వైర్‌లెస్ ట్రాన్స్ మీటర్ స్వీకరించడం... దాని నుంచి బ్లూటూత్‌కు ఆడియో రిసీవింగ్ అవుతున్నట్లు కనిపెట్టారు.



దీంతో పాటు ఫోన్ చేసిన వారి వివరాలు, సమయం లభ్యం కాకుండా ఫోన్‌లో సాఫ్ట్‌వేర్ మార్చినట్టు అధికారులు గుర్తించారు. తాను ఉస్మానియా యూనివర్సిటీలో ఉండే స్నేహితుడి ద్వారా ఈ మాస్ కాపీయింగ్ చేస్తున్నానని నిందితుడు వసీం అహ్మద్ విలేకరులకు తెలిపాడు. ఇతను నాలుగు పరీక్షలు రాయాల్సి ఉండగా ఇప్పటికే ఒకటి రాశాడు. రెండో పరీక్ష రాస్తూ పట్టుబడ్డాడు. కళాశాల డెరైక్టర్ ఫిర్యాదు మేరకు వసీంను చాంద్రాయణగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top