రోడ్లకు మహర్దశ

రోడ్లకు మహర్దశ - Sakshi


రహదారుల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం: కేసీఆర్



జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్‌కు నాలుగు లైన్లు

మండల కేంద్రాల నుంచి జిల్లాలకు రెండు లైన్ల రోడ్ల నిర్మాణం 

అన్ని నదులు, ఉప నదులపై అవసరమైన చోట వంతెనలు


 

సాక్షి, హైదరాబాద్: రహదారుల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యమిస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో రహదారుల పరిస్థితిపై శుక్రవారం సచివాలయంలో ఆయన మరోసారి సమీక్షించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్‌కు నాలుగు లైన్ల రహదారులు, మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు రెండు లైన్ల రహదారుల నిర్మాణ ం చేపట్టాలని అధికారులను ఈ సందర్భంగా ఆదేశించారు. రాష్ర్టవ్యాప్తంగా రహదారులకు వెంటనే మరమ్మతులు ప్రారంభించాలని సూచించారు. నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు, జాతీయ రహదారుల చీఫ్ ఇంజనీర్ గణపతిరెడ్డి, ఆర్‌అండ్‌బీ ఈఎన్‌సీ రవీందర్‌రావు, క్వాలిటీ కంట్రోల్ విభాగం ఈఎన్‌సీ భిక్షపతి సమీక్షలో పొల్గొన్నారు.



జిలా కేంద్రాల నుంచి నాలుగు లైన్లు: వరంగల్, కరీంనగర్, మెదక్, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లా కేంద్రాల నుంచి ఇప్పటికే హైదరాబాద్‌కు నాలుగు లైన్ల రోడ్లు ఉండగా, వీటిలో ఇంకా కొన్ని పనులు  పురోగతిలో ఉన్నాయని, నిజామాబాద్, ఖమ్మం రహదారులను కొత్తగా నిర్మించాల్సి ఉందని ఈ సందర్భంగా అధికారులు వివరించారు. రాష్ర్టంలో 149 మండలాలకు వాటి జిల్లా కేంద్రాలకు మధ్య డబుల్ లైన్ రోడ్లు లేవని, వెంటనే వాటిని వేయాలని కేసీఆర్ ఆదేశించారు. ప్రజల సౌకర్యం కోసం రహదారులను అద్దాల మాదిరి తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. తెలంగాణ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, రూరల్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్లను వెంటనే ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు.



ఆర్‌అండ్‌బీలో ఖాళీలను భర్తీ చేసి ఆ శాఖను బలోపేతం చేస్తామన్నారు. అత్యవసరంగా రోడ్ల మరమ్మత్తుల కోసం సీఈ స్థాయిలో రూ. 5 ల క్షలు, ఎస్‌ఈ స్థాయిలో రూ. 2 లక్షలు, ఈఈ స్థాయిలో రూ. లక్ష వరకు వినియోగించే అధికారం కల్పిస్తామన్నారు. రానున్న రెండేళ్లలో రహదారుల కోసం దాదాపు రూ. 12 వేల కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు, ప్రతి నియోజకవర్గానికి సగటున రూ. 110 కోట్లు కేటాయిస్తామన్నారు.

 

గోదావరిపై వంతెనలు: గోదావరి నదిపై ఎస్‌ఆర్‌ఎస్పీ ఎగువన ఒకటి, దిగువన మరొక వంతెనను నిర్మించాలని, అవి ముదోల్-అర్మూర్ నియోజకవర్గాల మధ్య, కడెం-రాయికల్ నియోజకవర్గాల మధ్య ఉండాలని సీఎం సూచించారు. అలాగే రాష్ర్టంలో నదులు, ఉప నదులపై ఎక్కడెక్కడ వంతెనలు అవసరమో సర్వే చేయాలని ఆదేశించారు. అన్ని జిల్లా కేంద్రాల్లో రింగురోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. 260 కిలోమీటర్ల పొడవున్న రాజీవ్ రహదారిని సరిచేసేందుకు రూ. 750 కోట్లు ఖర్చు చేయనున్నట్లు సీఎం వెల్లడించారు.



ప్రజ్ఞాపూర్, కుక్కనూర్‌పల్లి, గౌరారం, మామిడిపల్లి, తుర్కపల్లి, దుద్దెడ, ములుగు, కొడకుండ్ల, రామునిపట్ల, ఇబ్రహీంనగర్ తదితర చోట్ల బైపాస్‌రోడ్లు, షామీర్‌పేట్, సిద్దిపేట్, ఎల్కతుర్తి వద్ద ఫ్లైవోవర్లు నిర్మించాలని నిర్ణయించారు. హైదరాబాద్-వరంగల్ రహదారిలో ప్రస్తుతం యాదగిరిగుట్ట వరకు నాలుగు లైన్లు ఉండగా, దాన్ని వరంగల్ వరకు త్వరగా పూర్తి చేయాలని సీఎం పేర్కొన్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top